Thursday, May 20, 2021

మామిడికాయ పచ్చడి/చట్నీ చేయు విధానం

 


కావలసిన పదార్థాలు:

1. అన్ని పచ్చళ్ళు రోటికి లొంగవన్న జ్ఞానం
2. అధవా తెలియకున్నా, ఓ డజను పచ్చళ్లంటే నూరేసా ఆ మాత్రం తెలియదా అని అహంకరించకుండా అమ్మకోసారి ఫోన్చేసి ఇదెలా ఏడవాలి అని అడిగే తెలివిడి;
రెండూ లేవా, శుభం. మన కర్మ. ఇంక ఈ ప్రకారం ముందుకు పోవాలి.
3. రెండు మధ్యస్థంగా ఉన్న మామిడికాయల చెక్కుతీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి.
4. చెంచా కారం, చిటికెడు పసుపు, చిటికెడు పైన మెంతిపొడి, అరచెంచా ఉప్పు (అస్సలు కక్కుర్తి పడకూడదు, కావాలంటే కలపొచ్చు, వద్దంటే కిందామీదా పడ్డా తియ్యలేం), పావు చెంచా జీలకర్ర పొడి. చింతపండు వద్దుకాక వద్దు. ఈ పాయింట్ దాకా చదివిన అనుభవజ్ఞులు నేను బేసిక్స్ లో ఎంత కచ్చితత్వాన్ని సాధించానో గ్రహించెదరు గాక. (పచ్చడి అనగానే పచ్చిమిరపకాయలు, చింతపండు తీసే వంటగాళ్ల స్తాయికన్నా పై స్థాయి అన్నట్టు)
5. మన బిత్తర పనుల్ని కాస్త దిద్దగల మనుషులు 😉 అందుబాటులో ఉండడం. ఇవ్వన్నీ ఉన్నాయంటే ఇహ రంగం సిద్ధమైనట్టే.
పచ్చడి నూరే విధానం:
రోలు, రోకలి కడిగి తుడుచుకుని (మళ్లీ బేసిక్స్ గమనించి నాకో దుశ్శాలువ కప్పగలరని తలుస్తాను), మామిడికాయ ముక్కల్ని, పసుపుని, మెంతిపొడిని, జీలకర్ర పొడిని రోట్లో వేసి ఎలాగైతే పచ్చి మిరపకాయలని దంచుతామో అలాగే దంచాలి. మామిడికాయ ముక్కలు; కుక్కర్ మీది వెయిట్ ఎగిరిపోయినప్పుడు పప్పు వంటిల్లంతా ఎలా చిందుతుందో అలా, మిక్సిలో పప్పువేసి అప్పుడప్పుడు మూత పెట్టెయ్యకుండానే స్విచ్ వేసినప్పుడు ఇల్లంతా ఎలా చిందుతుందో అలా కనీసం వంటిల్లంతా ఎగురుతాయి. వెతికి పట్టుకోగలిగినన్నిటిని పట్టుకుని మళ్లీ రంగంలోకి దూకాలి. (అప్పటికి పనమ్మాయి ఇల్లు తుడవడం పూర్తి కాకుంటే రోట్లో మిగిలిన వాటితో తృప్తి పడడం అన్నిందాలా మేలు).
ఇప్పుడు మాత్రం వొళ్ళు దగ్గర పెట్టుకుని సదరు ముక్కల్ని బతిమాలుతూ చాలా జాగ్రత్తగా టమాటా పచ్చడి నూరేప్పుడు టమాటాలు మొత్తం చితికిపోవద్దని ఏ నేవళంతో దంచుతామో అలా మెల్లగా మొదలెట్టాలి. కాసేపటికి ఆ ముక్కలకీ, మన చెయ్యికీ, ఆ రోలుకి తప్పని సయోధ్య కుదురుతుంది; ఈ మొండి మనిషితో ఎందుకులే అన్నట్టు. ఈ స్థాయిలో ఉప్పు, కారం వేసేయవచ్చు. ఇంకా నూరగా నూరగా ఓపిక తగ్గిపోవడం, ఇది అంత సులువుగా తేమిలే వ్యవహారం కాదు అన్న జ్ఞానం ఒక్కసారిగా కలుగుతాయి. అప్పుడు ఉపాయంగా, నీ చెయ్యి తగిలితే బహుశా ఈ పచ్చడి అమోఘంగా కుదురుతుందని, మన బిత్తర పనుల్ని దిద్దే మనిషికి కాస్త మస్కా కొట్టి పనిలోకి దిగడానికి ఒప్పించాలి. అదేమిటో అప్పటిదాకా మనం పడ్డ కష్టమంతా టక్కున ఫలితం చూపిస్తుంది; ఆ మనిషి ఒక నిమిషమో, అర నిమిషమో దంచి నూరగానే 😑 ఏదేమైనా శుభం కార్డుకి దగ్గరవుతాం.
6. గిన్నెలో ఎత్తుకుని, ఘుమాయించే ఇంగువ తాలింపు తగిన దినుసులన్నింటితో కలిపి వేసుకున్నామంటే మాత్రం ఆ పచ్చడి రుచి అమోఘాతి అమోఘం. అప్పటిదాకా వేసిన తైతక్కలన్నీ మర్చిపోయి "రోలు-సంప్రదాయ పచ్చళ్ళ ఉద్ధరణలో దాని గణనీయ పాత్ర: మామిడికాయ రొటి పచ్చడి అనే ప్రత్యేక శోధన" అన్న రీసెర్చ్ పేపర్ రాసుకోవడానికి వేడన్నంలో నెయ్యి, మామిడికాయ రొటిపచ్చడి వేసుకుని తింటూ సిద్ధం కావచ్చు.
ఇది సూతుడు శౌనకాది మునులకు నైమిశారణ్యం లో రోటి పచ్చళ్ళ వైభవ సప్తాహంగా చెబుతున్నప్పుడు నేను చాటుగా విని రాసిన మామిడికాయ రొటిపచ్చడి ఖండం. సమాప్తము.

No comments: