Thursday, May 20, 2021

ఆకాశమే నీ హద్దురా

 మీను నువ్వు నాతో కలిసి సినిమాలు చూడవ్, ఎప్పుడూ ఆ వెధవతోనే చూస్తావ్ అని భీకరమైన కంప్లైంట్ చేస్తా ఉంటాది. అందుకని అప్పుడప్పుడు దాంతో కలిసి సినిమాలు చూసే విశ్వప్రయత్నం చేస్తుంటా. చాన్నాళ్ల తర్వాత ఓ పది రోజుల ముందు 'మిస్ ఇండియా'. ఓ పది నిమిషాల్లో టకటకా నాలుగు సుత్తి దెబ్బలు కొట్టించుకున్నాకా నా మొహం చూసి అమ్మా నీతో అయ్యేటట్టు లేదులే, ఇంకోసారి చూడు; నేనొక్కదాన్నీ చూస్తా అని నాకు ప్రాణదానం చేసింది. సినిమా అయ్యాక ఎట్లా వుంది అంటే అయిపోయింది అన్నది ఆ మహా భీకర కీర్తి ఫాన్స్యూ. నువ్వు చూడకులే అని కూడా చల్లని మాట చెప్పింది.

మళ్లీ మా వాడితో అవెంజరుల 'endgame' ప్లాన్ చెయ్యడం విని మళ్లీ మొన్నామధ్య గొణిగింది, నాతో చూడవ్ అని, మీరిద్దరూ మాత్రం మళ్లీ మళ్లీ చూస్తారు అని. సర్లే సూర్య సినిమా రిస్క్ తక్కువ కదా మహా అయితే అప్పుడప్పుడు పూనకం వచ్చి అరుస్తాడు, అరవవాళ్ళకది కామన్ అనుకుని ఒకసారి గట్టిగా శ్రీమన్నారాయణ అనుకుని మొదలెట్టామ్. మొదలు బాగానే అనిపించింది, ఆ పిల్ల కూడా మా పిల్ల లాగా వుంటాం చేత ఇద్దరికీ ఇంస్టాంట్ గా నచ్చేసింది వాగుడుతో సహా. కాకుంటే మొట్ట మొదటి సూర్య భీకర నృత్య ప్రదర్శన తదనంతర అరివీర భీకర డవిలాగు వినగానే ఏందమ్మా సెంటిమెంటుతో సమ్పిపూడిసేలాగా వుండాడుగా అంటూనే మెడ అనుకూలంగా చాపేసి కూర్చున్నా. ఇక వేటు మీద వేటు. ఏం చేస్తాం.
ఆ కారికేచర్ పాత్రల్ని పొత్రాల్లాగా వాడి చూసేవాళ్ళని రుబ్బేయడం మాత్రం అన్నేలం 😭 వీళ్ళ సెంటిమెంటు సంతకెళ్లా, మరీ ఇంత డ్రామానా సీను సీనుకీ. సినిమా మధ్యలోకి కాదు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సన్ట్ అయిపోయినా ఇంకా ఓ కొలిక్కి రాకుండా పాడిందే పాటరా అంటే తిక్కరాక ఏం చేస్తాది. నా లెక్క సింపుల్ సినిమా మొదలుపెట్టాక ఎప్పుడు ఆయుపోతుంది అని మిగిలిన టైమ్ చూస్తా కూర్చున్నామంటే ఇంక అంతే. నిండా ముంచేసినట్టు.
మంచి విషయాలు లేవా అంటే ఎందుకు వుండవు, బోలెడు. అసలు కథ ప్లాట్ చాలు, ఆ హీరోయిన్ చాలు (ఏ మాటకామాట మొదలు పెట్టినప్పుడు ఉన్నంత హై రేంజిలో కంటిన్యూ చెయ్యలా, మరీ హీరోకి పోటీ వస్తాదనేమో!), హీరో చనాసేపు నేలమీద నడిచే మనిషి కావడం చాలు, హీరో ఐయినా కొన్నిసార్లు ఓడిపోవడం చాలు. కానీ, వీటిల్లో దేనినీ లాభంగా మల్చుకున్నట్టు కనపళ్ళా అదే గోల. ఆ చివరి ఫ్లైట్ బయల్దేరితే శివయ్యకు కొబ్బరికాయ కొడతా అనుకున్నాక కూడా ఏదో మతలబుతో దాన్ని నేలమీదే ఉంచడం నాకు సరింగా అనిపించలే. పోన్లే ఒక మంచి వ్యాపార కథ అందరు జనాలకీ తెలిసింది అనీ అనుకోలేం వచ్చింది ఓటిటిలో కాబట్టి, ఇది నిజంగా థియేటర్ కి సరిపొయ్యే కథ. పాపమ్ సూర్య, సుధ కొంగర.
మళ్ళా మా గోలకొస్తే మా మీనమ్మాయి తెలుగమ్మాయి, వాళ్ళ నాన్న అరవబుద్ధి కూడా కొంచెం కలిసినట్టుంది. ఎంత సెంటిమెంటునైనా అవలీలగా జీర్ణించుకుంటుంది. ఈ సినిమా చివరికి వచ్చాక కూడా పో అమ్మా!! ఈ సీన్లో అసలైతే ఏడవాలి నీతో చూస్తుంటే నవ్వొస్తుంది అని చాలా విచారం వ్యక్తం చేసింది. అప్పుడు కలిగింది నాకు రియలైజేషన్. మా వాడూ నేను రాయి రప్పా, ఇవేవీ పడవ్. అందుకే మా టీం బ్రహ్మాండంగా సెట్ అయినట్టుంది. వాడు మరీ నిమిత్తమాత్రుడు. నేను ఐరన్ మాన్ చచ్చిపోయాడు అని పదే పదే గొణుగుతుంటే అమ్మా ఐరన్ మాన్ ని ఎందుకు చంపారో తెల్సు కదా అని నాకు బోధ చేస్తాడు. నిజ్జంగా it's a range of parenting 🙄🤦🤷

No comments: