Thursday, May 20, 2021

గ్రీన్ బుక్ (2018)


గ్రీన్బుక్ అంటే ఏంటి!? ఒక ఆకుపచ్చటి అట్ట ఉన్న ఒక పుస్తకం నల్లరంగులో వున్న వాళ్ళ కోసం, వాళ్ళ శరీరాలు తెల్లరంగు వాళ్ళ చేతిలో ఎర్రరంగు చిందించకుండా వుండాలంటే కొన్ని చోట్లలోనే ఆగాలి; తినడానికైనా, ప్రయాణంలో ఆగడానికైనా, గ్యాస్ స్టేషన్కైనా, క్లబ్లకైనా ఇంకెందుకైనా. ఈ పుస్తకం రాసింది కూడా ఇట్లాంటి వివక్ష ఎదుర్కొన్న విక్టర్ హ్యూగో గ్రీన్ అన్ననల్లటాయనే. అమెరికాలో కార్ కల్చర్ మొదలయ్యాక కాస్త నిలదొక్కుకునన్న ఆఫ్రికన్ అమెరికన్లు కూడా కార్లు కొనడం నడపడం మొదలుపెట్టారు. వాళ్ళు తెల్లవాళ్ళతో సమానంగా తిరగడం, బహిరంగ ప్రదేశాలను వాడడానికి వీలు లేదు “జిమ్ క్రో లా” ప్రకారం. 1965 దాకా కనీసం వందేళ్ళు అమలులో ఉన్న ఈ చట్టాల ప్రకారం తెల్ల అమెరికన్లు, నల్ల అమెరికన్లు ‘సమానమే, కానీ వేరువేరుగా సమానం’. తెల్లవాళ్ళకి వుండే సౌకర్యాలు, కేటాయింపులకూ; నల్లవాళ్ళకి వుండే సౌకర్యాలు, కేటాయింపులకూ, హస్తిమశకాంతరం ఒక్కమాటలో చెప్పాలంటే. సరే, రోడ్లవెంట ‘ఆ వేరు వేరుగా సమానమైన’ ఏర్పాట్లు ఉన్న ప్రదేశాలు అన్నిటినీ క్రోడీకరించి నల్లరంగు మోటారిస్టులకి ఉపయోగకరంగా ఉండేలా రాసిన పుస్తకమే ఈ గ్రీన్ బుక్.

ఈ పుస్తకం ప్రస్తావన ఎందుకు సినిమా గురించిన టపాలో అంటే, సినిమా అంతా నడిచేది ఈ గ్రీన్బుక్ సూచించిన దారిలోనే మరి. డాన్ షిర్లే, ప్రముఖ అమెరికన్ క్లాసికల్ మరియు జాజ్ పియానిస్ట్. రెండేళ్ళ వయసునుంచే పియానో వాయించడం మొదలుపెట్టిన బాలమేధావి. రెండు ఆనరరీ డాక్టరేట్లు పొంది డా. షిర్లే గా పేరొందిన మనిషి. పియానో వాయిస్తూ స్టేజిమీద ఉన్నంతసేపూ ఆయన ప్రేక్షకులందరూ నమస్కారం చెయ్యడానికైనా, కరచాలనం చెయ్యడానికైనా, చప్పట్లు కొట్టడానికైనా, స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడానికైనా మురిసిపోయేటన్త విద్వత్తు వున్నవాడు. స్టేజీ మీద వున్నంతవరకూ. అంతే. ఆ స్టేజీ మీద వుండనప్పటిదే మన అసలు కథ. ఇది డాన్ జీవితచరిత్ర కాదు. 1960ల మొదట్లో అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలలో రెండునెలలపాటు డాన్ చేసిన సంగీత పర్యటన బ్యాక్డ్రాప్ లోని కథ మాత్రమే.

టోనీ లిప్ వాలేలోన్గ్య ఇటాలియన్ అమెరికన్. ఒక నైట్ క్లబ్లో బౌన్సర్ గా పనిచేస్తుంటాడు. భార్య ఇద్దరు పిల్లలూ. ఎప్పటికప్పుడు సరిపోయేంత సంపాదన. ఇరుగుపొరుగులు చుట్టపక్కాలతో చాలా చక్కటి సంబంధాలుంటాయి భార్యాభర్తలిద్దరికీ. ముఖ్యంగా భార్య ఎక్కువ స్నేహశీలి, నలుపుతెలుపు బేధాలు తెలీని మనిషి. టోనీ అంత పారదర్శకమైన మనిషేమీ కాదు. టోనీ పనిచేస్తున్న నైట్ క్లబ్ ఒక రెండు నెలలు మూసేస్తారు రినోవేషన్ కోసం. సరైన ఉద్యోగం దొరక్క తప్పనిపరిస్తితిలో డాన్ దగ్గర రెండునెలల రోడ్ ట్రిప్ లో డ్రైవర్ కం బౌన్సర్ గా పనిచేయడానికి చేరతాడు, మంచి జీతానికి ఆశపడి. ఒకసారి రోడ్ ట్రిప్ మొదలయ్యాక మాత్రం సినిమాని ఇంక పూర్తి మనిషిగా ఒళ్ళు దగ్గరపెట్టుకుని చూడక తప్పదు.

డాన్ చాలా సోఫిస్టికేటేడ్ అలవాట్లు వున్న మనిషి. నియమనిబంధనలు, మర్యాద మన్ననలు తూచ తప్పకుండా పాటించే వ్యక్తి. టోనీ పూర్తిగా వ్యతిరేకం, కాకుంటే లోపల మంచితనం నిండిన మనిషే. ఇద్దరూ మొహాలు మొటమొటలాడిస్తూనే ప్రయాణం మొదలెడతారు. నల్ల మనిషని, ఇన్ని ఆంక్షలని టోనీ; మర్యాదామన్ననా, పద్దతీపాడూ తెలియని మనిషని డాన్ అనుకుంటుంటారు అవతలి వాళ్ళ గురించి. చిన్నగా యాత్ర ముందుకు సాగుతుంటే డాన్ ఎంత గొప్ప విద్వత్తుగలవాడో, అటు నల్లవాళ్ళకీ చెందక, ఇటు తెల్లవాళ్ళు దగ్గరికి రానివ్వక డాన్ ఎంత ఒంటరి మనిషో టోనీకి తెలుస్తుంది. మొరటుగా కనిపిస్తున్న టోనీ హృదయసారళ్యం డాన్ కి తెలుస్తుంది. రాను రాను కథ దక్షిణానికి సాగుతున్న కొద్దీ పెరుగుతున్న వివక్షని టోనీ విస్తుపోయిచూస్తుంటాడు మనతోపాటు. మధ్య రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి ఒకటే హోటల్లో ఉంటారు, తింటారు. కింది రాష్ట్రాలకి వెళుతున్న కొద్దీ డ్రైవర్ గా వున్న టోనీ ఉండగలిగే హోటళ్ళలో సంగీతవిద్వాంసుడు డాన్ కి ప్రవేశం వుండదు. డాన్ కి దుస్తుల దుకాణంలో కోటు ట్రై చేసే అధికారం వుండదు. కావాలంటే కుట్టించి ఇస్తారు, లేదా అదే సరిపోతుందిలే అని కొనుక్కోవడమే. నల్లవాళ్ళు ట్రై చేసాక ఇంక వేరేవాళ్ళు ముట్టుకోరన్నమాట. కాదు, అసలు అవి షాపులో ఉండడానికి వీల్లేదు. రకరకాల సంఘటనలు, ప్రతీ సంఘటనలో డాన్ దైన్య పరిస్తితి ఇంకాస్త విశ్వరూపం చూపిస్తూ. డాన్ పాత్రధారి మహేర్శలా అలీ ఆ పాత్రకు ఎంత న్యాయం చేసాడంటే ఆ కళ్ళలో కనిపించిన హావభావాల్లో ఏడు తరాల ముందటి కుంటాకింటే నించీ, రైలు పెట్టెలోంచి తోయబడ్డ గాంధీ దాకా ఎందరో కనపడతారు. అలీ కి డాన్ పాత్రపోషణకుగాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డు వచ్చింది.

ఇక్కడ కథ మొత్తం చెప్పడం లేదు, ఒకటి రెండు సంఘటనలు మాత్రం రాస్తాను. టోనీ, డాన్ వేరు వేరు హోటళ్ళలో వుండటం మొదలుపెట్టాకా ఒకసారి డాన్ ఆ పరిసరాల్లో ఉండలేక నైట్ క్లబ్ కి వెళ్లి తాగుతాడు. కనీసం అరడజను మంది తెల్లవాళ్ళు కలిసి డాన్ ని కొడుతుంటారు వాళ్ళ బృందంలోని ఇంకొకరు గమనించి టోనీ ని తీసుకోచ్చేదాక. ఆ ఊళ్ళో ప్రదర్శన పూర్తయ్యాక చక్కటి నవ్వుతో మీ ఆహ్లాదకరమైన ఆతిధ్యానికి ధన్యవాదాలు అని డాన్ చెబుతున్నప్పుడు నాకు మాత్రం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంకొక సంఘటనలో డాన్ ని పోలీసులనుంచి తప్పించడానికి టోనీ వాళ్ళకు లంచం ఇచ్చి మరీ విడిపించినప్పుడు ఇదేమంటే, నువ్వు టూర్ మొత్తం పూర్తి చెయ్యకుంటే నాకొచ్చే డబ్బు సంగతేంటి అన్న టోనీ మాటలతో ఇంకొంత గాయపడతాడు డాన్. ఇదే టోనీ చివరి ఘట్టంలో డాన్ తనకు జరుగుతున్న అవమానాల్ని ఎదిరించి నిలబడినప్పుడు ఇంక కాంట్రాక్టు మాట వదిలేసి, డాన్ ని ముందుండి బయటికి నడిపిస్తాడు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం చక్కటి స్థాయికి వస్తాయి ఇద్దరి మధ్యా.

సినిమా ప్రధానాంశం గుండెల్ని మెలితిప్పేదే ఐయినా ట్రీట్మెంట్ ఎక్కువభాగం ఆహ్లాదకరంగా ఉండటం వల్ల అసలు పాయింట్ ప్రేక్షకుడి మనస్సులోకి గట్టిగా వెళ్ళగలుగుతుంది. డాన్, టోనీ ల మధ్య అనుబంధం చక్కగా ఆవిష్కృతమైంది. ఇద్దరి మధ్యా స్నేహం ఎంతలా పెరుగుతుందంటే టోనీ తన భార్యకు రాసే ఉత్తరాల్ని డాన్ సరి చేస్తుంటాడు, టోనీ చదువుతుంటే. హాయిగా నవ్వుకునే సందర్భం అది. డాన్ వచ్చి కూర్చుంటూ టోనీ ఏదో సీరియస్గా రాయడం గమనిస్తాడు, ఏం చేస్తున్నావు అంటే ఉత్తరం రాస్తున్నా అని చదువుతాడు, తన దినచర్య రాస్తూ, సాక్సులు ఉతుక్కుని టీవీ మీద ఆరబెట్టుకున్నది రాస్తాడు; అసలు నువ్వు ఏం చెప్పాలకుంటున్నావ్ అని డాన్ అడిగితే నిన్ను మిస్ అవుతున్నాను అని భార్యతో చెప్పాలనుకుంటున్నాను అంటాడు టోనీ. డాన్ సినిమాలో మొదటిసారిగా ఒక పేద్దనవ్వు నవ్వేసి ఆ ఉత్తరాన్ని కాస్త ప్రేమగా రాయడానికి సాయం చేస్తాడు. సినిమా చివరికల్లా సొంతంగా టోనీ చక్కగా రాయగలుగుతాడు. ఇట్లాంటి చాలా చిన్న సన్నివేశాలు, సంఘటనలతో సినిమా గాఢతను పెంచుకుంటూ పోయాడు దర్శకుడు పీటర్ ఫారెల్లీ. దర్శకుడు ఆస్కార్ కి నామినేట్ కాలేదు కానీ సినిమాకి బెస్ట్ పిక్చర్ గా, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లేకి గానూ అకాడెమి అవార్డులు వచ్చాయి.

రేస్ డిస్క్రిమినేషన్లు ఇంకా ఎక్కడున్నాయ్ అని అనుకోలేనన్ని రకాల డిస్క్రిమినేషన్లు ఇంకా రాజ్యం చేస్తున్న ఇప్పటికాలంలో ఈ సినిమా లాంటి సినిమాలు ఇంకా అవసరమే. ఎక్కువగా ప్రశంసలనే మూటకట్టుకున్నా ఇక్కడ ఒక వైట్ మనిషినే కాపాడేవాడిగా చూపించడం మీద కొంత విమర్శ వచ్చింది. కాకుంటే అది పెద్దగా నిలబడలేకపోయింది, ఎందుకంటే ఇది నిజ జీవిత గాథ కాబట్టి, డాక్యుమెంట్ చేయబడ్డ వివరాలకు అతి దగ్గరగా సినిమాని తీసారు కాబట్టి. ఈ యాత్ర పూర్తయ్యాక, వాళ్ళ ఎనభైలలో టోనీ, డాన్ మరణించేదాకా ఇద్దరూ మంచి స్నేహితులుగానే కొనసాగారు కాబట్టి. అరవైల మొదటి సగం కాలపు చిత్రీకరణ నాకు తెలిసినంతలో చాలా authentic గా వుంది. అతి గొప్ప పియానిస్టు అని చెప్పినందునే కాకుండా డాన్ పియానో వాయించడం మొదలుపెట్టగానే ఇతను గొప్ప విద్వాంసుడు అని తెలిసేలాంటి కంపోసిషన్లనే ఎంచుకున్నారు మొత్తం సినిమాలో. ‘రోమా’ సినిమా చూసినప్పుడు చూసేయ్యల్సింది ఇన్నాళ్లుపట్టింది వీలు కుదరక, అన్వర్ గారి పుస్తకంలో చదివాకా మళ్ళీ గుర్తొచ్చి ఇంక పూర్తి చేశా. అన్వర్ గారు ఈ సినిమా గురించి మంచి వ్యాసం రాసారు (ఇప్పుడు ఈ-బుక్ గా కూడా వుంది, వీలైన వాళ్ళు చదవండి), ఇది అందులో పదోవంతు కాకున్నా ఈ సినిమా గురించి నేనే రాసుకోవాలన్న దౌర్బల్యంతోనే రాసాను. చాలా చక్కటి సినిమా, వీలైన అందరూ చూడండి.

షరా: నాకు యూనివర్సిటీ లైబ్రరీ లో దొరికింది కాబట్టి వేరే సోర్స్లు ఇంకేమైనా వున్నాయేమో నేను చెప్పలేను :)

No comments: