సాహిత్యం మన ఊహలకు రెక్కలు తొడిగితే సినిమా మనల్ని ఒక విమానంలో కూచోబెట్టేసి రాచమర్యాదలు చేస్తూ ఆ లోకాల్లో చాలా దగ్గరగా చూపిస్తూ తిప్పుకొస్తుంది. అన్నిసార్లూ ఆ విహంగ వీక్షణం నచ్చాలని లేదు, ఎన్నోసార్లు బోలెడు అద్భుతాల్ని కళ్ళముందు ఉంచుతుంది ఆట్టే ఊహతో పని లేకుండా. అట్లాంటి అద్భుతాల్లో ఒక యాభై ఐదింటిని గుదిగుచ్చి "ద కిడ్" తో మొదలెట్టి "సైకో" తో ముగిస్తూ ఈ మాల కట్టారు శ్రీదేవి గారు. పుస్తకం చేతికి రాగానే ముందు చేసింది లెక్క వేసుకోవడమే, పాతిక చూసిన సినిమాలు ఇంకో ముప్పై చూడాలి
1931 నుంచి 1993 మధ్యలో వచ్చిన సినిమాలు ఇవన్నీ. ఎక్కువ సినిమాలు మాత్రం ముప్పై, నలభైల నుంచే. AFI లిస్టింగ్, BFI లాంటి లిస్టింగ్ లు, ర్యాంకింగ్ లు కాకుండా తాను చూసిన వందల వేల సినిమాల్లోంచి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు నిర్మించిన వాటిల్లో క్లాసిక్స్గా నిలిచిపోయిన యాభై అయిదు సినిమాలను ఈ పుస్తకం కోసం ఎంచుకున్నారు. టైటిల్ కింద కనీ కనపడకుండా మొదటి భాగం అని రాసిన సబ్ టైటిల్ నాకు ఇంకా నచ్చింది నిజానికి ఇందులో కొన్ని వ్యాసాలు ముందు ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించినవేనట.
పుస్తకం విషయానికొస్తే, ఇవి సినిమాల కథా పరిచయాలు మాత్రమే కావు. చిత్ర నిర్మాణ విశేషాలున్నాయి; కథా నేపథ్యాలున్నాయి (చాలాసార్లు కథకు ముందు వెనుక ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్దపు నేపధ్య కథలన్నిటికీ బోలెడన్ని అవసరమైన విశేషాలను సేకరించి కలిపి రాసారు); తెరమీది కనిపించే బొమ్మల్లోని తారల వెనుక కథలు, వారు పాత్ర పోషణ కోసం పడే తాపత్రయాలు, వారి జిలుగుల వెనుక మసకలు, ఎదుగుదలలు, గొప్ప వ్యక్తిత్వాలు, కనపడని క్రీనీడలు ; హాలీవుడ్ ప్రపంచపు ఆదరణ, అనాదరణల కత్తిమీది సాము; సినిమా 24 కళల సమాహారం అనే అన్ని కళల మీద సాధ్యమైనంత సాధికారపు సమాచారం, దిగ్దర్శకుల ఉత్థానపతనాలు, వారు చెయ్యి వేసిన సినిమాలు అంతటి క్లాసిక్స్ ఎందుకు అయ్యాయి అన్న పరిశోధనాత్మక పరిశీలన; నిర్మాణ సంస్థల ప్రొఫెషనలిజం, సినిమా లోని అన్ని క్రాఫ్ట్స్ మీది సాధికారత, కనపడని పెత్తందారీతనం ఇట్లా శ్రీదేవి గారు వ్యాఖ్యానించని అంశం లేదు. కానీ, ముచ్చటైన విషయం ఏంటంటే గొప్ప రీడబిలిటీ. ఎన్ని విశేషాలు చెప్తున్నా హాయిగా చదివెయ్యగలం. కాఫీ టేబుల్ ఎడిషన్ అంత అందంగా వేశారు, కానీ బ్రహ్మాండమైన ఎడిషన్ పర్సనల్ లైబ్రరీలకు. ఇక్కడొక ఇంకొక మాట శ్రీదేవి గారికి పుస్తకాల మీద మామూలు ప్రేమ కాదు. ఏ పుస్తకాన్నీ మేటర్ అయ్యింది కదా అని వేసేయ్యరు. ఎంత నాణ్యమైన పుస్తకాలో నేను చదివినవీ చూసినవీ అన్నీ.
ప్రతీ సినిమా పోస్టర్తో మొదలయ్యి చిన్నగా కథలోని అతి ముఖ్యమైన సంగతులు, వెనుక సంగతులు చూసేసి, కథని సంగ్రహంగా చూపించి అప్పుడు చూపిస్తారు సినిమాలోని బోలెడు బొమ్మలు. ఎన్ని మంచి క్లిప్స్ సేకరించారో ప్రతీ సినిమాకు, వాటి వెనుక ఆ సినిమాల గురించి తెలుసుకోదగిన వివరాలన్నీ. శ్రీదేవి గారి ప్రత్యేకమైన ప్రేమలు (నటులు, దర్శకులు, జాన్ర) చెప్పకపోయినా పుస్తకం మొత్తం పూర్తయ్యేసరికి మనకే తెలిసిపోతాయ్ ఎంచక్కటి తెలుగు. కొన్నిచోట్ల ఒరిజినల్ సంభాషణలు ఇచ్చాక దాన్ని తెలుగు చేస్తూ ప్రతి పదానికి వీలైనంత సమానార్థకపు తెలుగు మాటనే వాడారు. ఉద్దండులు లాంటి చాలా మాటలు చదివి నేను బోలెడు సంబరపడ్డాను.
ఇప్పుడు OTT ల కాలంలో అన్ని సినిమాలు, సినిమా వెంట సినిమా బింజ్ వాచ్ చేసేస్తాం, పుస్తకం పనేమిటి అని అడిగేవాళ్ల కోసం కాదు ఈ పుస్తకం. సినిమా మీద ఇష్టం వుండి మంచి సినిమాతో కొంత ప్రయాణించాలనుకునేవారు మిస్ కాకూడని పుస్తకం. పిల్లల సినిమాల నుంచి సైకో థ్రిల్లర్ సినిమాల దాకా అన్నీ ఉన్నాయి. ఇది వ్యక్తిగతమైన సెలెక్షన్ కాబట్టి ఇంకా బోలెడు గొప్ప చిత్రాలు మిగిలే ఉన్నాయి కనీసం ఇంకో రెండు డైరీలకు. ప్రపంచ సినిమాలోకి వెళ్తే ఇంకెన్నో. నేను ఎదురుచూస్తాను శ్రీదేవి గారూ
ఇంత మంచి పుస్తకాన్ని అన్నిరకాలుగా నాణ్యంగా తెచ్చినందుకు
అభినందనలు
శ్రీదేవి గారూ. ఈ పుస్తకాన్ని గొప్ప సినిమా మనిషి సింగీతం గారికి అంకితం ఇవ్వడం ఇంకా ప్రేమించే విషయం. ఈ పుస్తకం శ్రీదేవి గారి దగ్గర దొరుకుతుంది ప్రస్తుతానికి. ధర 550 రూపాయలు, పోస్టేజ్ తో సహా. GooglePay/PhonePay వివరాలు
98490 12166, Muralidhar.
పుస్తకం చదివాక అస్సలు ఎక్కువ కాదని మీరే అంటారు. సినిమాని ప్రేమించే వాళ్లయితే తప్పక కొని చదవండి. మీకు సినిమా మీద పెద్ద ఇష్టం లేకున్నా ఎవరన్నా సినిమా పిచ్చి ఫ్రెండ్స్ ఉన్నా ఇంతకుమించి మంచి బర్త్డే గిఫ్ట్ వుండదు మరి కంటెంట్స్ పేజీలో ఒకటి పెట్టా మిగిలినవి ఇంకా గొప్పవి
No comments:
Post a Comment