Thursday, May 20, 2021

చెట్లు ఉసురుపోసిన (ప్రసాదించిన) జీవితం - పెరుమాళ్ మురుగన్

 


(అమ్మ - పెరుమాళ్ మురుగన్ పుస్తకం నుంచి అనువాదం)

అమ్మ దగ్గర ఎప్పుడూ డబ్బులుండేవి. తన అవసరాలకి ఎప్పుడూ ఎవరిమీదా ఆధారపడేది కాదు. తన ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు కూడా ఉన్న మేకల్ని, ఆవుల్ని అమ్మేసి ఇంట్లోనే ఉండిపోయింది. నేను నా కుటుంబంతో సహా నామక్కల్ కి మారినప్పటినుంచి పొలంలో ఉన్న నా రెండు గదుల ఇల్లు ఖాళీగానే ఉంది. అమ్మని అందులో ఉండమన్నాం, కానీ నాకు అంత పెద్ద ఇల్లు ఎందుకని దానిని అద్దెకిచ్చేసింది. ఆ ఇంటి వెనక నా పుస్తకాలు పెట్టి ఉంచిన చిన్న అర లాంటి గది ఉంది. మట్టి పెంకులతో కప్పు వేసిన ఆ చిన్న అర చాలు అనేది.
నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని చూసినా అమ్మ అనే మాట ఒకటే 'నాకేం ఖర్చులుంటాయి?' బదులుగా నా పిల్లలు ఎప్పుడు మా ఊరు వెళ్లి వస్తున్నా తానే పదో, ఇరవయ్యో వాళ్ళ చేతిలో పెట్టేది.
ఆ ఇంటి నుంచి వంద, నూట యాభై రూపాయల అద్దె వచ్చేది. ఆవిడ ఒక్కతే ఉన్నా ఆ కాసిన్ని డబ్బులెట్ల సరిపోతాయ్? అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూరగాయలు, సరుకులు తీసుకెళ్ళేవాణ్ణి. 'ఇవన్నీ నాకెందుకు? నేనేం చేసుకుంటాను? నువ్వు డబ్బులన్నీ దుబారా చేస్తావేం? నాకేమైనా అవసరం వుంటే నేనే అడుగుతాను కదా' అని నన్ను కోప్పడేది. అప్పట్నుంచీ అమ్మకేమికావాలో ముందే అడిగి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నా. అమ్మా నీ ఖర్చులన్నీ ఎట్లా గడుస్తున్నాయ్ అని నేను ఆమెనడిగితే ఇంటి బయట చుట్టూ ఉన్న చెట్లని చూపించి, 'అవి ఇస్తాయి' అని చెప్పేది. మా అమ్మకి ఆ కొన్ని చెట్ల నుంచి వచ్చే ఆదాయం సరిపోయేది.
పెళ్ళికి ముందు మా అమ్మకి పోలంపనులు ఏమీ తెలియవు, ఒకసారి నేర్చుకున్నాక ఆమె మొక్కని పెంచడం కూడా ఒక అందంతో చేసేది. అమ్మ అంట్లు తోమే జాలారు దగ్గర్లో ఒక మిరపచెట్టుని ఎప్పుడూ పెంచేది. ఏడాది పొడుగూతా ఆమెక్కావాల్సిన మిరపకాయలు ఆ చెట్టే ఇచ్చేది రెండు మూడేళ్లు. ఆకుపచ్చటి గొడుగులాగా చూడటానికి కూడా కంటికింపుగా వుండేది. కొన్ని కాయలు పచ్చిగా కోసుకునేది, కొన్నిటిని చెట్టుమీదే పండనిచ్చి ఎండబెట్టేది. పది రోజులకోసారి పొరియల్ చెయ్యడానికి ఒకట్రెండు కలేపళ్ళ మొక్కలు సరిపొయ్యేవి. అమ్మ ప్రకృతిని ఉపయోగించుకునే పద్దతి బలే ముచ్చటగా వుండేది.
నామక్కళ్ లో మేముండే ఇంట్లో కూడా అమ్మ చెట్లు పెంచింది. ఒక ములగ చెట్టు, ఓ కరివేపాకు చెట్టు బయటి గోడ పక్కనే వేసి, డాబా ఎక్కితే వాటిని కోసుకొనేంత పెరిగేదాకా పెంచింది. మా ఇంటిముందు నాటిన గోరింటాకు మొక్క ఇప్పుడు పెద్ద పెద్ద కొమ్మలతో గోడంతా కమ్మేసింది. వాకిలి మొత్తం నింపేసే ఆ గోరింట వాసన తగిలినప్పుడల్లా అమ్మ, అమ్మతోపాటే ఆమె ఆ చెట్లను జాగ్రత్తగా పెంచుకున్న జ్ఞాపకం నాలో నిండిపోయేది.
అమ్మ మా ఊళ్ళో పెంచిన చెట్ల ముచ్చట ఇంకా పెద్దది. ఇంట్లో, పొలంలో ఎన్నో చెట్లు పెట్టింది. ఒక్కో కరివేపాకు చెట్టు, మునగ చెట్టు, నిమ్మచెట్టు, జామచెట్టు, ఉసిరిచెట్టు, రెండేసి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, దానిమ్మ, చింత చెట్లుండేవి. మొత్తం పదమూడు చెట్లు - మాకంత గుర్తు.
మా చింతచెట్లు ఓ మాదిరివి, చింతకాయలు పండి ఎండిపొయ్యాక కూడా వాటంతట అవి రాలేవు కావు, కర్రతో కొట్టి దులుపుకోవడమే. మా అమ్మ ఆ చింత పండుని 'నరం చింత' అనేది, నరాల్లాగా చెట్టుకి అతుక్కుని ఒక పట్టాన రాలవని. ఒక్కో ఎండిన చింతకాయని జాగ్రత్తగా రాలకొట్టి రాల్చి, గింజ తీసేసి దాచేది. తనకోసం కొంత పక్కన పెట్టుకుని మా అన్నకూ, నాకు ఏడాదికి సరిపడా చింతపండు ఇచ్చేది. చింతచెట్టు పంటని ఎప్పుడూ అమ్మింది లేదు, మిగిలిన పదకొండు చెట్ల నుంచి వచ్చిందే అమ్మ ఆదాయం.
మా చుట్టుపక్కల పెద్దగా కరివేపాకు చెట్లు ఉండేవి కావు, నీటి ఎద్దడితో పెంచడం కష్టమని ఎవరూ వేసేవాళ్ళు కాదు. మా దగ్గర కరివేపాకు ఎంత అబ్బరంగా ఉండేదంటే ఎవరింట్లో అన్నా ఒక్కళ్ళే బిడ్డలు వుంటే వాళ్ళని లేత కరివేపాకు మొక్కతో పోల్చేవాళ్ళు. మా అమ్మ కరివేపాకు చెట్టు మొదట్లో ఓ కుండ పెట్టేది. పంపులో నీళ్లు వచ్చినప్పుడల్లా ఆ కుండ నింపి పెట్టేది. మేము కాళ్ళు, చేతులు అక్కడే కడిగేవాళ్ళం కాబట్టి ఆ చెట్టుకి వేరే నీళ్లు పొసే పనిలేదు. కొబ్బరి చెట్ల దగ్గరా అట్లాగే రెండు కుండలు పెట్టింది. అంట్లు అక్కడా కడిగేది మళ్ళీ నీళ్లు పోసేపని లేకుండా. జామ, ఉసిరి చెట్లు అమ్మ వుండే చిన్న గది ముందే వుండి కావలసినంత నీడ ఇచ్చేవి ఇల్లూ, వాకిలికి, వాటికి మాత్రం అప్పుడప్పుడూ కాసిన్ని నీళ్లు పోస్తే సరిపొయ్యేది.
దానిమ్మ చెట్లు ఇంటికీ రోడ్డుకి మధ్య ఉన్న కాలిబాటలో వుండేవి. నా భార్య ఈ దానిమ్మ గింజలు మొలకెత్తించి ఒక పాలిథిన్ సంచీలో పట్టుకెళ్లి అక్కడ నాటింది. ఆ చెట్టు బాగానే ఎదిగి పూలు, పిందెలు వచ్చేవి. పిందెలు కాస్తా కనపడగానే ఎక్కడినుంచో పురుగులొచ్చి వాటిని పాడు చేసేవి. అమ్మ ఆ పిందెల మీద బూడిద చల్లి పురుగుల్ని చంపాలని చూసేది కానీ, ఆ బూడిదని అవి మంచిగ అరాయించుకునేవి.
ఒకసారి అమ్మ ఆ దానిమ్మ కాయల్ని ఇంటి చుట్టుపక్కల కనపడ్డ పాలిథిన్ సంచీలు పోగు చేసి వాటిని కాయ చుట్టూరా జాగ్రత్తగా చుట్టి దారంతో కట్టేసింది. పురుగులు ఈ సంచీల్ని ఏమీ చేయలేకపోయాయి, అట్లా అమ్మకి అవి క్రిమి సంహారకాలుగా ఉపయోగపడ్డాయి. అప్పట్నుంచి అమ్మ ఆ చెట్టుమీద ఒక కన్నువేసి ఉంచేది, కాయ కనపడగానే చిటుక్కున పాలిథిన్ సంచీ కట్టేది పురుగు దాన్ని చూసేలోపు. మా దానిమ్మ చెట్టుమీద పాలిథిన్ సంచీలు పెరుగుతున్నట్లు వుండేది అదాటున చూస్తే. అప్పుడప్పుడూ జాగ్రత్తగా ఆ సంచీలు విప్పి కాసేపు కాయకు గాలి తగలనిచ్చి మళ్ళీ కట్టేసేది. ఆ కాయ పూర్తిగా పండి సుళువుగా తెంపగలిగినప్పుడే వాటిని తెంపేది చెట్టుకి దెబ్బ తగలకుండా. మా పాలు పళ్ళు మేము తిన్నాక మిగిలినవి అమ్మితే బాగానే డబ్బు వచ్చేది వాటిమీద.
అప్పుడప్పుడూ వచ్చే వానలు గోరింటాకు చెట్టునీ, మునగ చెట్టునీ పోషించేవి. గోరింటాకుని ప్రత్యేకం కొనేవాళ్ళు ఉండరు, అందుకే వేరేవి ఏమైనా కొంటున్నప్పుడు వాళ్ళు గోరింటాకు తెంపుకోవచ్చు. మునగచెట్టు మాత్రం ఏడాది పొడుగునా ఏదోకటి ఇచ్చేది. మునగాకు ఎప్పుడూ వుండేది, కాలంలో మునక్కాయలు కాసేవి. మునగచెట్టు మహా పెళుసు, అందుకే ఆ చెట్టుని ఎవ్వరినీ పట్టుకొనిచ్చేది కాదు, అమ్మే చులాగ్గా చెట్టు కందకుండా ములక్కాయలు కోసే విద్య నేర్చుకుంది. ఎప్పుడైనా గాలి విసురుకి ఓ కొమ్మ విరిగిపోతే చెయ్యి విరిగినంత పనయ్యేది అమ్మకి. మునగచెట్టుకి పసిపిల్లలంత సుకుమారపు అవసరాలుండేవి, అమ్మ ఆ చెట్టుని అంత సుకుమారంగానే చూసుకునేది. మా మావిడిచెట్లు ఇంటినుంచి కాస్త దూరంగా పొలంలో వుండేవి. ఆ రెండు చెట్లకి పైపుతో నీళ్లు పెట్టేది. చెట్లనుంచి వచ్చే వస్తువేదీ అమ్మ వృధా పోనిచ్చేది కాదు. అమ్మ బజారుకి ఎప్పుడూ ఉత్త చేతులతో బయలుదేరేది కాదు, రెండు మూడు కట్టల కరివేపాకు, మునగాకో, ఏ కూరగాయలో సంచీలో వేసుకునేది. దారిలో ఉన్న ఇళ్లలో వాటి అమ్మకం అయిపోయేది. చుట్టుపక్కల పిల్లలు జామకాయలు, వుసిరికాయలకోసం వచ్చేవాళ్ళు, అవి అమ్మకి అందే ఎత్తులో వుండవు కాబట్టి ఆ పిల్లల్ని కోసుకోనిచ్చి వాళ్ళిచ్చిన డబ్బు తీసుకునేది. మామిడిపళ్ళ కాలం వస్తే మాత్రం పొద్దంతా మా అమ్మ కావిలి వుండేది ఆ చెట్లకి. ఆ చెట్ల దరిదాపుల్లో ఒక నీడ తచ్చాడినా 'ఎవరక్కడ?' అని అరుస్తుండేది.
మా ఇంటికెప్పుడైనా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఉన్న మునగాకో, మునక్కాయలో తప్పకుండా కోసుకుని సంచీలో వేసుకునేది, వెళుతూ వెళుతూ వాటిని అమ్మేసి సంచీ ఖాళీ చేసుకునేది, ఎక్కడా వస్తువు దుబారా కావద్దు అమ్మ లెక్కలో.
అమ్మ కంటపడకుండా ఒక్క పసిపిందెఅయినా తప్పించుకునే ప్రసక్తి లేదు. ఇంక మామిడిపళ్ళ కాలంలో అయితే మేము ఎంత బతిమిలాడినా ఊరునుంచి కదిలేది కాదు. తప్పిదారి రావాల్సిన పరిస్థితి వస్తే సాయంత్రంగా వచ్చి మళ్ళీ పొద్దున్నే ఇంటికి చేరేది. మేముగనక వేసవిలో ఊరికి వెళితే వెంటనే చెట్ల దగ్గరికెళ్లి రెండు పండిన కాయలు తెంపుకొచ్చేది. ఆ పళ్ళు మా చేతికిస్తూ 'మీరొస్తున్నారని చెట్టుమీదే వుండనిచ్చా' అని చెప్పేది ఎక్కువ రోజులు ఉండనిచ్చినందుకు చెట్టు తనకేదో అనుమతి ఇవ్వాలన్నట్టు. మాకు ఎప్పుడూ బాగా మగ్గిన జామకాయలు, చక్కగా పండిన ఉసిరికాయలు దొరికేవి. అమ్మకి ఆ చెట్ల అణువణువూ తెలుసు.
మామిడిపళ్ళ కాలంలో అమ్మ ఆదాయం బాగా వుండేది. కొబ్బరికాయలు కూడా అమ్మేది. అమ్మకి ఎంత ఆదాయం వచ్చేది ఇవన్నీ అమ్మితే? మహా అయితే కొన్ని వందలు. మూడొందల రూపాయలు మహా బాగా సరిపోతాయి అనేది, ఇంకా కొంత డబ్బు దాచేది కూడా. నా అంచనా అయితే ఇంటద్దెతో కలిపి ఒక అయిదొందలు వస్తాయి నెలకి. అందులోనే బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరలు గడిపేది అమ్మ.
నాకు మంచి జీతం వచ్చే గవర్నమెంటు ఉద్యోగమని అమ్మకి తెలుసు. అమ్మ అవసరాలు నేను చూసుకోగలననే నమ్మకం, తాను ఒప్పుకుంటే చూసుకుంటాననే గర్వం ఉన్నాయి ఆమెకు. అప్పట్లో మా ఊళ్ళో ముసలివాళ్లైన తల్లిదండ్రుల్ని తిండికి కూడా సరిగా లేకుండా తిప్పలుపెట్టిన పిల్లల కథలేమీ తక్కువలేవు. మన దగ్గర పిల్లలు కావాలనుకునేదే ముసలితనంలో ఆసరాగా ఉంటారని. చిన్నప్పటినుంచీ 'పెద్దయ్యాక మీ అమ్మా నాన్నల్ని చూసుకోవా?' అన్న మాటల్ని నూరిపోస్తూనే వుంటారు. అయినా తల్లిదండ్రుల్ని గాలికి వదిలేసే పిల్లలు వుంటూనే ఉన్నారు. అమ్మకీ మొదట్లో ఈ భయం వుండేది, కానీ నా చేతలతో ఆమెకి గట్టి నమ్మకం కలిగింది తనకా గతి పట్టదని.
ఎవరైనా అమ్మని నిన్ను వాడు చూసుకుంటాడా అని అడిగితే, 'వాడెప్పుడైనా నేను అడిగింది ఇవ్వనన్నాడా? కట్టలకొద్దీ నోట్లు ఇవ్వబోతాడు, నేనే వద్దంటాను. నన్ను చూడటానికి ఎప్పుడైనా ఉత్త చేతులతో వస్తాడా? సంచీల నిండా ఏవొకటి నింపుకువస్తాడు. ఇక్కడేమైనా పిల్లలున్నారా అవి తినడానికి? అందుకే వాడిని అవేవీ తేవద్దంటాను. నా ఒక్కదానికి గడవడానికి ఈ చెట్లు చాలవా?' అంటుంది.
అమ్మకి పార్కిన్సన్స్ జబ్బు చేశాక ఎనిమిదేళ్లు బతికింది. ఆమె ఇష్టం మీద హోమియోపతీ మందులు వాడినా, అల్లోపతీ మందు కూడా వేసుకునేది. రోజుకో మాత్ర, అది ఖరీదైనదే. ఎక్కువ ధర అని తెలిస్తే వాటిని వద్దంటుందన్న భయానికి నేను అవి చవకేనని చెప్పా. ప్రతీ నెలా మర్చిపోకుండా ఆ మాత్రలు కొనిచ్చేవాణ్ణి. ఊళ్ళో ఎవరైనా 'నువ్వు నీ కొడుకుని చదివించావ్, వాడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా?'అని అడిగితే అమ్మ 'మీకు కళ్ళు కనబడట్లేదా, నెలనెలా ఎన్నెన్ని మాత్రలు తెచ్చి పోస్తున్నాడు? వాటికీ ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా చెప్పాడా? అవి వెయ్యో రెండువేలో నీకేమైనా తెలుసా?' అని పోట్లాడేది.
ఆ చెట్లు అమ్మకి ఆదాయం ఇవ్వడమే కాక ఇంకో పెద్ద మేలు చేసాయి.
నేనెప్పుడూ ఊరికి వెళ్లినా అమ్మ ఏ చెట్టు కిందో కూర్చొనో, నిలబడో వుండేది. మా ఇల్లు పొలాల్లో వుండటంచేత ఒంటరిగా వుండేది. మిగిలిన ఇళ్ళు కూతవేటు దూరంలో వుండేవి కానీ, యింటిముందు అటూ ఇటూ జనాలు తిరిగేవాళ్లు కాదు. ఎప్పుడైనా జనాలు ఇటువచ్చినా ఒకట్రెండు మాటలంతసేపు కనపడేవాళ్లు. ఎవరిపని వాళ్ళకుండేది. అమ్మకి చెట్లతోనే సావాసం. వాటితో మాట్లాడేది. వాటితో పాటు అమ్మ ఒక చెట్టు, అట్లా కలిసిపోయేది. వాటిలో వచ్చే చిన్న మార్పైనా అమ్మ పసిగట్టేది. ఏ చెట్టు మీద ఎన్ని పిందెలున్నాయి, ఎన్ని పండ్లున్నాయి, ఎన్ని కాయలున్నాయి, అవి ఎన్నాళ్ళలో పండుతాయి, అన్నీ అమ్మకి తెలుసు. ఏ పనిలో ఉన్నా వాటివైపు ఓ చెవి వేసి వుంచేది. అమ్మకు కొన్నేళ్లు ఎక్కువ ఆయుష్షు పోసింది ఖాయంగా ఆ చెట్లే.
రెండేళ్లపాటు వర్షాలు లేవు మా ప్రాంతంలో. బోరింగులో నీళ్లు అడుగంటిపోయాయి. ఆ చెట్లని కాపాడానికి అమ్మ ఎన్నో తిప్పలు పడ్డది. పార్కిన్సన్స్ వాళ్ళ కాళ్లు చేతులు సరిగ్గా చాపగలిగేది కాదు, బరువులు పట్టుకునే శక్తి వుండేది కాదు. ఇంటి దగ్గర ఉన్న చెట్లకి పెద్ద బాధ లేదు కానీ మామిడిచెట్లు వడలిపోవడం మొదలైంది. వాటిని కాపాడుకోవాలని అమ్మకు ఎంత ప్రాణంగా ఉండేదంటే పిల్లలు ఆడుకునే రెండు గురుగుముంతలు కొనుక్కొచ్చింది. వాటిలో నీళ్లు నింపుకుని ఆ చెట్ల దగ్గరికి బయల్దేరేది. ఆ కాస్త దూరానికి ఒకటిరెండుసార్లు మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకుంటేగానీ నడవగలిగేది కాదు. అట్లా ప్రతీరోజూ కాసిన్ని నీళ్ళని పోసి ఆ చెట్లని మళ్ళీ జీవం పుంజుకునేలా చేసింది.
మేము అమ్మని చూసేందుకు వెళ్ళినప్పుడు ఆమె అడిగేది ఒక్కటే 'ఆ మామిడి చెట్లకి ఒక కుండెడు నీళ్లు పోసిపొమ్మని'. అమ్మ దగ్గరికి ఏదైనా కొనడానికి వచ్చినవాళ్ళనీ ఆ మాటే అడిగేది. రెండేళ్లపాటు ఆ మామిడిచెట్లు పూత పుయ్యలేదు. కానీ అమ్మ పంతంతో బతికించింది. మూడో ఏడాది కొంచెం వర్షాలు పడ్డాయి, మామిడిచెట్లు మళ్ళీ పూత పూసి కాయలు కాసాయి, అమ్మ సంబరానికి అంతులేదు.
అమ్మ చివరి యేడాది భారంగా గడిచింది. ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో మా ఇంటికి తీసుకువచ్చాం. ఊర్నుంచి అమ్మని చూడటానికి ఎవరైనా వస్తే ముందు చెట్ల గురించే వాకబు చేసేది. మేము కూడా ఊరికి వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా నీళ్లు పోయడం అలవాటు చేసుకున్నాం. ఎప్పుడైనా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగైతే తనను బస్సు ఎక్కించేదాకా ఊరుకునేది కాదు. ఆ చెట్లకి ఆ గురిగిముంతలతో నీళ్లు పోస్తూ కనీసం వారమన్నా అక్కడ వుండేది. ఆ చెట్లని చూసుకోవడానికి ఎవరూ లేదని అమ్మ చాలా దిగులుపడేది.
అమ్మ చివరి ఆరునెలల్లో మా ఊరికి వెళ్లలేకపోయింది. మేము వెళ్ళినప్పుడల్లా ఆ చెట్లకి నీళ్లు పోస్తూనే ఉన్నాం. మేం చెయ్యగలిగింది అంతే. పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చెట్లకి నెలకోసారికన్నా ఎక్కువ వెళ్లి నీళ్లు పొయ్యలేకపోయాం. అమ్మ జరిగిపోయాక కొన్ని నెలలపటు మా ఊరికి వెళ్లలేకపోయాం. అమ్మ వస్తువులు తీసుకురావడానికి నేను వెళ్ళినప్పుడు ఆ మామిడిచెట్లని ఒకసారి చూడాలనుకున్నాను. చెప్పడానికేముంది? రెండు చెట్లూ ఎండిపోయి మొద్దుల్లా నిలబడ్డాయి.
అనాథపిల్లల్లా.
----------------
పెరుమాళ్ మురుగన్ రాసిన అమ్మ పుస్తకం కవితా మురళీధరన్ ఇంగ్లిష్ లోకి చేసారు. "A life bestowed by trees" story. ఒక దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మ ఆవిడ, చాలా మంది అమ్మలలాగే. విజయవంతమైన అనేకన్నా ఆటుపోట్లు తట్టుకునే నిబ్బరం ఉన్న స్త్రీ పురుషుల వెనక గట్టిగా నిలబడ్డ అమ్మ కచ్చితంగా వుంటుందని అనిపిస్తుంది చదువుతూ వుంటే. ఎక్స్ప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఈ మాటలు సాధారణీకరించడానికి మాత్రం రాయలేదు. అమెజాన్ లో దొరుకుతుంది, నేను తప్పకుండా చదవమనే చెప్తాను. కనీసం పెరుమాళ్ మురుగన్ అభిమానులు చదవాలి. ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో, రచయితగా ఆయన నిర్మాణంలో ఆయన తల్లి, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాలు వేసిన పునాది తెలిసిపోతుంది.
ఈ కథ ఎందుకు అనువాదం చెయ్యాలనిపించింది? ఇదేదో ప్రపంచాన్ని ఉద్దరించేసిన మనుషుల కథ కాదు, గొప్ప నిర్మాణం, భాష ఉన్న కథ కాదు, కానీ చదివాక పది రోజులైనా పదిహేను రోజులైనా మనసుని పట్టి వదలడం లేదు అందుకే ఈ రాయడం. ఇక్కడి అమ్మలో మా అమ్మమ్మ కనపడింది, ఒక్కో వాక్యంలో, వాక్యాలు మధ్య ఖాళీల్లో.
ఎంత ప్రేమతో చెట్లని పెంచుకునేదో ఈ అమ్మలాగే. ఆరుగురు పిల్లలు, డజనున్నర మనవలు, మనవరాళ్ల తర్వాత కూడా ఆ చెట్లని పిల్లల్లాగే చూసుకుంది. సూర్యాపేట ఇల్లు ఒక వనం లాగ పెంచుకుంది. కరివేపాకు తోటలాగా వుండేది. నిమ్మ, జామ, దానిమ్మ, సపోటా ఇంకెన్నో చెట్లు. ఖమ్మం రావడానికి ఎంత బాధ పడిందోనట ఆ ఇల్లు వదలడానికి. మళ్ళీ ఇక్కడా వీలైనన్ని చెట్లు పెంచింది. మామిడి చెట్టు ఎన్ని కాయలు కాస్తుందో ప్రతీ యేడాది. సిగలో పువ్వుల మాల లేకుండా చూసిన గుర్తు లేదు చివరి రోజు వరకూ అమ్మమ్మను. ఏ కాలానికి తగ్గ పూలు ఆ కాలంలో మల్లె, సన్నజాజి, విరజాజి, మందారం, కనకాంబరం, కాగడామల్లె. ఇవేవీ లేకుంటే నిత్యమల్లి పూలలో అయినా కాస్త మరువమో, దవనమో వేసి కట్టుకుని పెట్టుకునేది. అమ్మమ్మ ఓపిక, పొతం, పనితనం వచ్చిన మనవరాలు లేనట్టే, చాలా పాళ్ళు వాణి అక్క తప్ప. మొక్కల మీద ప్రేమకి కారణం మాత్రం ఆమె వేసిన మొలకే అందరికీ. ఈ కథ బహుశా ఆమె కోసమే మన భాషలోకి తెచ్చుకున్నా.
అమ్మమ్మకి ప్రేమతో.
నా పదకోశం పరిమితమైనది, కాబట్టి ఇంత చిన్న కథనైనా పట్టుకోవడం సాహసమే. తప్పులన్నీ నావే. తెలుగు పదాలు మాత్రం రాయాలన్న ఒక్క పంతం సాధించుకున్నా.
డిస్క్లైమర్: ఈ అనువాదం నేను ఊరికే నా ఆత్మతృప్తికోసం మాత్రమే చేశాను కాబట్టి, ఎవరివైనా కాపీరైట్లు ఉల్లంఘించే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేస్తే వెంటనే పోస్టు డిలీట్ చేస్తాను.

No comments: