ఆ పదేళ్ల అమ్మాయి అమ్మ వీణతో పాటు రికార్డులో తంబూర వాయించడానికి చిత్తూరు నుంచి మద్రాస్ వచ్చింది. అమ్మ రికార్డులు చేసే వాళ్ళని బతిమాలి ఆ అమ్మయితో కూడా రెండు పాటలు పాడించి రికార్డు వేసేందుకు ఒప్పించింది. ఏదో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాడుతుంది అనుకున్న పిల్ల "మరకత వడివం" పాడేసింది అలవోకగా. అక్కడ మొదలైన ఆ గళం ఎందరు వాగ్గేయకారుల కృతుల్నో, భజనలనో పాడింది; ఎన్నెన్ని పురస్కారాలు ఉన్నాయో అన్నీ పొందింది; గొప్ప గొప్ప పండితులు, దేశాధినేతలు, నాయకుల నుంచి పామరుల దాకా అందరినీ అలరించింది. పప్పు అన్నం ప్రతిరొజూ దొరికితే బావుణ్ను అన్న రోజుల్నుంచి కోట లాంటి ఇంట్లో పంచభక్ష్య పరమాన్నాలతో వందలమంది అతిథులకి ప్రతిరొజూ భోజనం పెట్టించేదాకా చూసింది. అంత వైభవాలు దానధర్మాలతో గతించి మళ్లీ ఒక నాలుగ్గదుల ఇంట్లో సర్దుకోవల్సివచ్చినా తనకెమీ తేడా లేదు. సంగీతప్రపంచంలో తిరుగులేని మహారాజ్ఞిగా పేరు పొందినా చివరిరోజువరకూ గంటలకొద్దీ సాధన ఆపిందికాదు. జీవితంలో ఎన్నెన్నోఉత్థానపతనాల్ని చూసినా ఒక విషయంలో మాత్రం ఏ మార్పూ లేదు, మొదట అమ్మనీడలో, తరువాత భర్త నీడలో. గాన రాగప్రస్తారంలో ఎన్నెన్ని లోకాలు స్వేఛ్చగా చూసినా చూపించినా పాట ముగిసిన వెంటనే రెక్కలు ముడుచుకోవడం ఎప్పుడూ మర్చిపోలేదు, అది ఆమె లోటుగానూ అనుకోలేదు.
మధురాంతకం నరేంద్ర గారు తన 'మనోధర్మపరాగం' లో ఎమ్మెస్ ను కాల్పనికలోకంలోకి పంపించే ఎత్తుగడ ఎంచుకుని జీవితచరిత్ర రాయడంలో దొరకని నాటకీయతను; సృజనాత్మకపు పాత్రల, లోకాల సృష్టిని సులువుగా చేయగలిగారు. మదురై నుంచి చిత్తూరు కు మారిన కథా ప్రారంభం వల్ల చిక్కనైన చిత్తూరు తమిళతెలుగు యాసలో ఎక్కువ పాత్రలు మాట్లాడటం కూడా నవలను భాషాపరంగా పరిపుష్టం చేసిన ఇంకొక ఎత్తుగడ. ఎమ్మెస్ జీవితం మీద ఇప్పటికే చాలా పుస్తకాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. TJS జార్జి రాసిన సాధికారికమైన బయోగ్రఫీ చాల గొప్ప పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎమ్మెస్ బయోగ్రఫీ అనటం కన్నా కర్ణాటకసంగీతపు ఒక శతాబ్దపు ప్రస్థానాన్ని పరిశోధనాత్మకంగా ఎమ్మెస్ జీవితపు శకలాలనించి నీడల నుంచి చూసే ప్రయత్నం అని చెప్పవచ్చు. కర్ణాటక సంగీతపు ప్రసిద్ధ వాగ్గేయకారుల త్రయం నుంచి, దేవదాసీ వ్యవస్థ మీదుగా ఆధునిక కాలపు సంగీతనాటక సభల కచ్చేరీలదాకా వచ్చిన మార్పులన్నిటినీ బయోగ్రాఫికల్ వ్యాసాలుగా రాసారు జార్జ్. నవల పోకడలు, సంభాషణలు ఉదహరించడం తక్కువ ఈ పుస్తకంలో. ఈ మధ్య కాలంలో 'పల్లవి' రాసిన 'సుస్వరాల లక్ష్మి సుబ్బలక్ష్మి' కొంత ఎక్కువ వివాదాస్పదమైన పుస్తకం. ఇందులో 'పల్లవి' ఆ గాంధర్వ గాయకురాలి వ్యక్తిగత జీవితాన్ని కూడా మానవీయ కోణంతో స్పృశించే ప్రయత్నం చేసారు. ఈ రెండు పుస్తకాలూ చదివిన వారికి అసలు రెండవ పుస్తకం అంత వివాదాస్పదం కావడం ఎందుకో అర్థం కాదు, ఎంచేతనంటే వివాదాస్పదమైన అన్ని అంశాలను జార్జి పుస్తకంనుంచే 'పల్లవి' తీసుకున్నారు, కాకుంటే కొంత ఎక్కువ వ్యావహారిక పద్దతిలో రాయడం వాళ్ళ ఎక్కువమంది దృష్టికి వచ్చి ఇలా జరిగి ఉండవచ్చు. బహుశా జార్జి రాసిన పుస్తకం అకాడమిక్ పుస్తకంగా వుండిపోవడం వల్లా, ఎమ్మెస్ అనధికార ఆమోదముద్ర పడటం వల్ల వివాదాలకు పెద్దగా కేంద్రం కాలేదు, పైగా ఆ పుస్తకం విమర్శకుల ప్రశంసని కూడా పొందింది. నరేంద్ర కథను కాల్పనికలోకంలోకి మరల్చడంతో అనవసర వివాదాలు తలెత్తవేమో.
నాగలక్ష్మికి సంగీతం నేర్చుకోవడం ఇష్టం. పాటలు పాడటం ఇష్టం. అమ్మ కొంగులో తలదాచుకుని లోకపు చిత్రాలు చూడడం ఇష్టం. ఒక అన్న, ఒక చెల్లి. అందరు దేవదాసీల పిల్లల్లాగే నాన్న ఎవరో తెలిసినా అమ్మ పేరుతోనే గుర్తింపు. తండ్రితో దగ్గరగా మసలగలిగేది తమ ఇంటికి వచ్చినప్పుడే, బయట ఎప్పుడైనా కనపడితే తండ్రి దగ్గరకు తీస్తేనే చెంతచేరగలగడం. అమ్మంటే ఎంత ఇష్టమో అంతకు మించి నాన్న ప్రాణం నాగలక్ష్మికి . ఇంట్లో 'నా చిన్నమారాణి' అని మురిపెంగా చూసే తండ్రితో ఎప్పుడూ అట్లా వుండలేకపోవడం నాగలక్ష్మికి పెద్ద లోటు. తండ్రిని కోల్పోయాక ఆ లోటు ఇంక పూడ్చలేనిది అయ్యింది. తల్లి కడుపులో ఉన్నప్పటినుంచి వింటున్న వీణావాదనతో, పుట్టుకతోనే అబ్బిన సంగీతజ్ఞానం, మధురమీనాక్షి కటాక్షించిన తియ్యని స్వరం తో, గురువుల శిష్యరికంలో చిన్నతనమునుంచే వయసుకు మించిన పరిజ్ఞానంతో చక్కగా పాడటం మొదలుపెట్టింది. కూతురికి సంగీతంలో మంచి శిక్షణ ఇప్పించి కచ్చేరీలు, రికార్డులు చేసే స్థాయికి తీసుకువచ్చి ఒక గొప్ప పోషకుడి అండకు చేర్చాలని తల్లి కుముదవల్లి సంకల్పం. తన జీవితంలో ఎదురైన ఆర్ధిక ఇబ్బందులు కూతుర్లకు ఎదురుకావద్దని తన ఆలోచన. కొడుకుకి మృదంగం, పెద్ద కూతురికి గానం, చిన్న కూతురికి తనకుమల్లే వీణలో శిక్షణ మొదలుపెట్టింది. పెద్ద కూతురు అసాధారణమైన ప్రతిభాపాటవాలు గమనించాకా సహజంగా తనమీద కొంత ఎక్కువ దృష్టి పెట్టింది. మద్రాసులో రికార్డు ఇవ్వడంతో మొదలైన ప్రయాణం మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ లో కచ్చేరీ ఇచ్చేదాకా ఇక ఆగలేదు. కొత్తగా వెలుగులోకి వచ్చిన నాగలక్ష్మిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన విశ్వనాథన్ పరిచయం నాగలక్ష్మి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఇక ఆ జీవితంలో తన గతానికి, తన మూలానికి, తన రక్తసంబంధాలకీ ఆఖరికి తన ఉనికికీ సంబంధం లేకుండా పోయింది. తన సంగీతం మాత్రమే మిగిలింది, ఆ సంగీతంతోనే ఈ ప్రపంచంలో పొందగలిగినంత గుర్తింపునూ, గౌరవాన్ని, అపారమైన ప్రేమను, అన్ని పురస్కారాలను పొందింది. ఈ దారిలో తాను పొందినదేమిటి పోగొట్టున్నదేమిటి అన్న చింతనే 'మనోధర్మపరాగం'.
కథ తెలిసినది అయినప్పుడు కథకుడికి ఒక ప్రయోజనం తను మొత్తం ప్రణాళిక రచించాల్సిన అవసరం లేదు. ముఖ్య పాత్ర జీవితం, ప్రముఖమైన సంఘటనలు, అవసరమైన మలుపులు అన్ని కళ్ళముందే వుంటాయి, ఇదే కథకుడి సమస్య కూడా అవుతుంది. పాఠకుడికి ఎంతో కొంత తెలిసిన కథను తనదైన బాణీలో చెప్పి ఒప్పించగలగాలి. ఇక్కడ ఈ కథకుడి గొప్ప సామర్థ్యం చూపించారు. కథకుడు కథను చెప్పివుంటే ఇప్పటికే ఉన్న బయోగ్రఫీలకి ఇంకొకటి చేరి వుండేది. కానీ ఇక్కడ కథకుడు పూర్తిగా సాక్షిగా వుండి నాగలక్ష్మి జీవితంలోని తన చుట్టూరా ఉన్న స్త్రీల గొంతులని తన కథ చెప్పడానికి ఉపయోగించుకోవడం ఈ కథకి చేరిన గొప్ప బలం. మొగ పాత్రలకి గొంతులేకపోవడం నా వరకూ చాల నచ్చిన విషయం, నాగలక్మి మునిమనవరాలి గొంతులో కథ చెపుతున్నప్పుడు అనిరుధ్ మాటల్లోని ఒక పేలవపు మగస్వరం వినపడటంతో రచయిత ఎత్తుగడ ప్రభావం చక్కగా అర్థమవుతుంది. (ఇవే మాటలు 'పల్లవి' చాలా మానవీయంగా చెప్తారు, జార్జ్ చరిత్రను రికార్డు చేస్తున్న తటస్థ స్వరంతో). ముఖ్యంగా కథకి మూలసంభమైన నాగలక్ష్మి కి, తన ఆవరణగా నిలిచిన విశ్వనాధానికి తమ సొంత గొంతులు వుండవు. మిగిలిన అందరూ మాట్లాడిన మాటల్ని బట్టి పాఠకుడు తనదైన అభిప్రాయం ఏర్పరుచుకోగలుగుతాడు, పాఠకుడికి కావలసినంత స్పేస్ ఇవ్వడం ఒక మంచి కథకుడు చెయ్యవలసిన పని కదా!! ఎమ్మెస్ జీవితంలో పజిల్ గా మిగిలిపోయిన ప్రతి చాప్టర్లో ఒక స్త్రీ వచ్చి మనకు ఆ కథ చెపుతుంది ఒక నమ్మకమైన స్వరంలో, ఏది నమ్మటం ఏది కథగా ఆనందించడం అన్నది కూడా పాఠకుడికి దొరికే అవకాశమే.
విస్తృతమైన నవలగా రాయాలన్న ప్రణాళిక తో కథకుడు కథను మొదలుపెట్టినట్టు మొదటే తెలుస్తుంది, అందుకే నిదానంగా మొదలవుతుంది. దానికితోడు పాత్రలచేతనే కథ చెప్పించే ఎత్తుగడ మొదట్లో కొందరు పాఠకులని ఇబ్బందికి గురి చేయవచ్చు; కానీ, ఆ అందం అర్థమయ్యాక మాత్రం చక్కగా సాగిపోతుంది. నాలుగైదు పాత్రలు ఒకే విషయాన్ని మళ్ళీ తమ దృష్టికోణంలో చెప్పడం సబ్జెక్టివిటీ లోంచి ఆబ్జెక్ట్విటి వెతుక్కోవడానికి ఉపకరణంగా వాడుకోవచ్చు లేదా రిపీటీషన్ కి చిరాకుపడొచ్చు, మళ్ళీ పాఠకుల ఛాయిస్. కథకన్నా కథనంకోసం చదవవలసిన పుస్తకంగా నాకు తోచింది.
మళ్ళీ ఎమ్మెస్ కథకి వస్తే, నిత్యం సుప్రభాతం, వీలు కుదిరినప్పుడల్లా బాలాజీ పంచరత్నాలు, త్యాగరాజకీర్తనలు క్యాసెట్లలో వింటూ పెరిగిన తరానికి చెందిన దాన్ని కావడం వల్ల ఎప్పటికీ ఆవిడ ఎమ్మెస్ అమ్మే. ఆవిడ డోలాయంచాల అని పాడినప్పుడు డోలలాడకుండాను; మధురాష్టకం పాడినప్పుడు ఆ మాధుర్యాన్ని అనుభవించకుండానూ; నానాటి బతుకు నాటకంలోని వైరాగ్యపు వీచిక ఒక లిప్తపాటైనా అనుభవంలోకి రాకుండానూ; రంగపురవిహార లోని నోట్స్ తో పాటూ వెళ్లిపోకుండానూ; మీరా భజనల్లోని భక్తి అనుభవంలోకి రాకుండానూ; జో అచ్యుతానంద అని దేవాధిదేవుడికే జోల పాడుతున్నప్పుడు మళ్ళీ యశోదగా మారిన ఎమ్మెస్ అమ్మ కనపడకుండాను వుండదు. ప్రతీ నిత్యం సుప్రభాతం, సహస్రనామం ప్రతీఇంట్లో పాడుతున్న ఎమ్మెస్ అమ్మ ఎప్పటికీ అలాగే వుంటుంది. కానీ, ఈ పుస్తకాలు చదవడం వల్ల దేవదాసీ మూలాలు అంత గంధర్వగాయనినీ ఇబ్బంది పెట్టకుండా వదలేదని; ఒక రక్షణ కోసం, ఒక కుదురైన స్థిరమైన కుటుంబంకోసం ఆమె తన స్వేచ్ఛను పక్కనపెట్టడానికీ వెరవలేదనీ, స్త్రీ కావడంవల్ల వుండే వివక్షని అన్ని స్థాయిల్లోనూ ఎదుర్కొందని, ప్రపంచం మొత్తం కీర్తిస్తున్నా పుల్లవిరుపు మాటల మనుషులు తన సంగీతాన్ని సంపూర్ణం కాదు అన్న మాటల్ని ఎదుర్కోవడానికి మాటలు కాకుండా డెబ్భైరెండేళ్ల వయసులో డెబ్భైరెండు జన్యరాగాలతో డెబ్బై రెండు వరసలుగా మహా వైద్యనాథ్ అయ్యర్ విరచిత మేళకర్తరాగమాలికని నేర్చుకుని మహాస్వామి ముందర పాడి సూర్యచంద్రులున్నంతవరకూ తనపేరు నిలిచిపోయే ఆశీర్వాదం పొందిన నిత్య విద్యార్ధి అని తెలియడం ఆ అమ్మని ఇంకాస్త ప్రేమించేలా మాత్రమే చేస్తుంది. సదాశివం మన అందరిలాగే అనేక లోపాలు ఉన్న మనిషి, ఆ లోపాలన్నిటితో ఆవిడ ఆయన్ని స్వీకరించింది, అనుగమించింది. ఆయనకు ఆవిడ, ఆవిడ సంగీతాన్ని విశ్వవిఖ్యాతం చేయడం మాత్రమే మొదటి ప్రాధాన్యం. అంత రాజకీయ వాతావరణంలో మునిగితేలుతూ రాజకీయాల వికృతక్రీడల్లో మునిగిపోకుండా తన గురువు రాజాజీ మార్గంలో నడిచి సంపాదించడం కూడబెట్టడానికి కాదని పూర్తిగా తెలుసుకున్న మనిషి ఆయన, తామరాకు మీది నీటిబొట్టులాగా పూర్తి జీవితాన్ని గడపగలిగిన జ్ఞాని ఆవిడ. తీర్పులు ఇవ్వకుండా ఇద్దరి జీవితాల్ని గమనించడం మనకు మనం చేసుకోగల గొప్ప మేలు. ఈ పుస్తకాలు నాకు ఆ మేలు చేసినట్లే వుంది. ఈవిడ కథలో ఇంకాస్త దగ్గరిగా తెలిసిన బాలసరస్వతి, బెంగుళూరు నాగరత్నమ్మ మరో రకం మెరుపులు, ఒక వంద పేజీలు రాసినా నాకే సరిపోనంత ధార ఉన్నా ఒక దగ్గర ఆపడంలో మంచి తెలుసు కనక ఇక్కడికి సరి.
ఈ మాటలు 'పల్లవి' రాసిన పుస్తకంలోని చివరి మాటలు.
"నిన్ను కాంచిన వారి అదృష్టమే అదృష్టం
నీతో మసలిన వారి పుణ్యమే పుణ్యం
నీ పాట వినే భాగ్యం కలిగిన వారి భాగ్యమే భాగ్యం.
కురై ఒండ్రుమ్ ఇల్లై మరైమూర్తి కణ్ణా.
తల్లీ ఇక మాకు ఏ కోరికలూ లేవు.
నీ పాటలు విన్నందుకు, ఎప్పటికీ వినగలిగే భాగ్యం ఉన్నందుకు ఇక మాకు ఎలాంటి కోరికలూ లేవు. నీవు ఎక్కడ ఉన్నా సుఖసంతోషాలతో వర్ధిల్లు"
1. మనోధర్మపరాగం - మధురాంతకం నరేంద్ర
2. M.S. Subbulakshmi: The Definitive Biography - TJS జార్జ్
3. సుస్వరాల లక్ష్మి సుబ్బలక్ష్మి - 'పల్లవి'
No comments:
Post a Comment