చోళదిబ్బ నుంచి హైదరాబాద్ దాకా వొక ఇరవైఏళ్ల ప్రయాణం చేసింది నీల. జీవితంలో ప్రేమ స్థానం ఏమిటి, స్వేచ్ఛకు అర్థం ఏమిటి అన్న విషయాల్లో తనవైన ఎదుగుతున్న నిర్వచనాలు ఇచ్చుకుంది. నీల ప్రస్థానం పొడవునా అంతకింత ఎదుగుతూనే ఉన్నా ఇరవైఏళ్ల పిల్లగా వున్నప్పుడు చూపించిన స్థైర్యం, తన చుట్టూ ఉన్న మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఉన్న పరిణితి నన్ను ఆశ్చర్యపోయేలా చేసింది. అటుతర్వాత తను ఏమి చేసినా అలా చూస్తూ పోవడమే తప్ప, షాక్ కి గురి చెయ్యదు.
జీవితంలోని చిన్న చిన్న ఆనందాల్ని పొగుచేసుకోవడంలో తనకి ఉన్న ఆసక్తి వేరు విషయాల్లో తక్కువే. 'వనవాసి' లాగా ప్రకృతిని ఆరాధించడం మాటల్లో తెలియకపోయినా, ఓపెన్ స్పేసేస్ లో తప్ప గాలాడాని నీల, సముద్రాన్ని అప్పగా చేసుకున్న పైడితల్లిని ప్రేమించిన నీల జీవితంలో, ప్రకృతి ఓ సహజాతం అంతే.
అతి తీవ్రమైన సమ్మెటపోట్లు వేస్తూనే వున్నా, జీవితానికి నీల మీద కొంత దయ ఉందా!? సరైన మనుషులు తన జీవితంలో ప్రతీ మలుపులో తారసపడుతుండటం, 'నేను మంచి బతుకుకి, గొప్ప ప్రేమకి డిజర్వ్ అయి ఉన్నాను' అన్న నీల నమ్మకానికి జీవితం ఇచ్చిన జవాబా!! సూర్యం, ఆరంజ్యోతి, పాస్టరమ్మా, పాస్టర్ మామయ్య, వసుంధర, లలిత, సంపూర్ణ, అజిత, నీతాబాయి అందరికన్నా ముఖ్యంగా 'మినో'; జీవితం అందరికీ గుండుగుత్తగా ప్రసాదించే మనుషులేనా!? కానీ ఓ చిత్రం వుంది. వీళ్ళల్లో ఎక్కువమంది జీవితంలో మిగిలిన వారితో వ్యవహరించేతీరు కాస్త వేరే; సూర్యం, వసుంధరల లాగా మనుషుల్ని ప్రేమించడానికి మనిషి కావడం తప్ప వేరే కారణం అక్కర్లేని వాళ్ళు ఎక్స్ప్షన్స్. కానీ, మిగిలిన వాళ్ళు ఈ అమ్మాయిని అంత దగ్గర చేర్చుకోవడానికి కారణం, తనలో వెలుగుతున్న ఓ గొప్ప జీవితేచ్ఛ వుండబట్టేనేమో!!
ప్రసాద్ బలవంతంగా నీల జీవితంలోకి చొచ్చుకు వచ్చిన తోడు, తోడు కాలేకపోయిన తోడు. పరదేశి తొలియవ్వనంలో పుట్టేటంత గాఢమైన ప్రేమని పట్టుకొచ్చినా తోడుగా నిలవలేకపోయిన తోడు, తనకి సరైన కారణాలున్నా. సదాశివ తన ఆలోచనలతో కూడా చిన్న సర్దుబాట్లు చేసుకుని నీలని నిలుపుకున్నాడు, నీల అచ్చంగా ప్రేమించి సదాశివని నిలుపుకుంది. ఈ రిలేషన్స్ బాక్డ్రాప్ లో నడిచిన అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాల్ని పరిశీలనగా చూస్తూ నీల నేర్చుకున్న తీరు ఈ అతి పెద్ద నవలికని ఒక చక్కటి నవలగా మార్చింది.
నాకు కంప్లైంట్లు ఉంటాయని జాజిమల్లెమ్మకి ప్రగాఢ నమ్మకం ఉండటం చేత మాత్రమే కాదు ఈ పేరా నీలని లోపాల్లేకుండా ఏమీ తయారుచేయలేదు, అది గొప్ప విజయమే, దాంతోనే ఆ అమ్మాయి రక్తమాంసాలతో నిలబడింది బహుశా. నీలమ్మ బాగా చదువుకుని పెద్ద ఆఫీసరు కావాలన్న చంద్రకళ కోరిక నీలను కష్టాల్లో ఉన్నన్నాళ్లు ముందుకి తీసుకెళ్లింది. జీవితంలో కాస్త కుదురుకున్నాక ఎందుకు వదిలిపెట్టింది అంత గాఢమైన కోరికను!! ఇది అసంతృప్తిని మిగిల్చేదే. చదువునూ కొనసాగించలేదు, ఉద్యోగంలో ఎదుగుదల కోసమూ గట్టి ప్రయత్నం చేసినట్లు లేదు. ఇక్కడ నేనేమీ సినిమాటిక్ ఎదుగుదల కోరట్లేదు, కానీ కొంత కొరవ ఉంది. డిగ్రీల చదువును సమాజాన్ని చదవడానికి షిఫ్ట్ చేసుకుందనుకున్నా పూర్తిగా అంగీరించలేకున్నా.
లోకంలో తన వయసు పిల్లలందరికన్నా చాలా ముందే తన నేర్చుకోవడం మొదలైంది. కానీ ఆచరణలో కాస్త ఎక్కువ తడబాటుతోనే వుంది. భద్ర జీవితాల్లో పెరిగిన సదాశివ లాంటి వాళ్లతో పోల్చకుండానే ఈ మాట చెప్తున్నా, అజిత తక్కువ చూడలేదు జీవితంలో; తను తన జీవితంతో ఎలా డీల్ చెయ్యాలో, సమాజానికి ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో పూర్తి స్పష్టతతో కనిపించిన పాత్ర. సంపూర్ణ ఇంకా ఎక్కువ జవసత్వాలు ఉన్న పాత్ర. వీళ్ళ ముందు నీల కొంచెం తక్కువ బరువుతో నాకు కనిపించడం నా అభిప్రాయమే. జడ్జిమెంటల్ గా వుండొద్దనుకుంటూనే అలా ఉన్నానని తెలుసుకునే, అలా ఉండటాన్ని జయించలేకపోయింది. తీర్పులు చెప్పే తప్పు చేయొద్దని చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఒక రకంగా తన ఆలోచన తొందరగా బయటకు చెప్పకపోవడంవల్ల పరదేశి జీవితం నుంచి ప్రేమను ఒక్కసారిగా లాగిపారేసింది. పరదేశి పాత్ర మీద మొదట్నుంచీ నాకు కాస్త సహానుభూతి తక్కువే ఉన్నా (మరీ ఆరడుగుల రాజశేఖరం కావడం వల్ల ) నీల పరదేశికి చేసిన అన్యాయంతో చాలా పాపం అనిపించింది. అంత ప్రేమించిన మనిషిని మహా కష్టపెట్టినందుకు.
కానీ ఇందులో ఏవీ నీలను ప్రేమించకుండా ఆపవు. ఆ అమ్మాయి అతి చిన్నతనపు జీవితంలో చూసిన దానికి, అనుభవించినదానికి, వదులుకున్నదానికి తనకు నిజంగా ఇంకా బోలెడు దక్కవలసి ఉంది; మినో, సదాశివ, పాస్టరమ్మ నుంచే కాదు, ఈ లోకం నుంచి కూడా.
కవయిత్రి నవలను రాస్తే ఇలా వుంటుంది అనేటన్ని అందమైన వాక్యాలు. "అది ఎలా వుంటుందో చెప్పలేము" అని ఆవిడ ఒక్కసారీ అనరు. ఎంత చక్కని వర్ణనలు అవసరమైన ప్రతీచోట. కళ్ళకు కట్టే కథనం. అలాంటి వాక్యాలు పట్టి తేవాలంటే హీనపక్షం పేజీకి ఒకటి చొప్పున కనీసం 547 మాట్లు ఎత్తిరాయాలి. ఈ మాటలకు ఇంకాస్త ఇష్టమయ్యారు మీరు మల్లీశ్వరి గారూ. చదువుతూ మధ్యలో బోలెడుసార్లు మీకు మెసేజ్ చేయాలనుకున్న ఆరాటాన్ని చదవడంలోకి తిప్పుకున్నా. ఈ మాటలు మీ 'నీల' కు ఇష్టంగా రాసుకున్న ప్రేమలేఖ.
ఇంక 'మినో' కథ మొదలుకావడమే ఒక ఉన్నతమైన, విశాలమైన ప్లేన్ లో మొదలైంది. ఆ అమ్మాయి కథ చెప్తే ఓ గాథకు తక్కువుండదేమో.
నీల సముద్రం మీద కూడా ఒక "చెరగని సంతకం"
No comments:
Post a Comment