పురాణాల రీటెల్లింగ్ పై నాక్కొన్ని అభ్యన్తరాలున్నాయి. ఎక్కువమంది తమ సొంత ఆలోచనలు పురాణపాత్రల ముఖతా చెప్పిచ్చినట్టు, ఆ పాత్రల ప్రాభవం మార్కెటింగ్ సాధనంగా మాత్రమే వాడుకున్నట్టు అనిపించేవే ఎక్కువ.
అందుకే ఆ పునః కథనాలలో కొన్నిటిని మాత్రమే కొంత అప్రీషియేట్ చేయగలిగా. ఐరావతి కార్వే 'యుగాంత' చాలా వరకు నచ్చింది. ప్రతిభారాయ్ 'యాజ్ఞసేని' కొంతవరకూ. ఆనంద్ నీలకంఠన్ ‘అసుర' కొంచెం. దేవదత్పట్నాయక్ 'జయ' పూర్తిగా రీటేల్లింగ్ అనలేము కాబట్టి పక్కనపెడదాం. యార్లగడ్డ 'ద్రౌపది' అసహ్యం. వోల్గా కథల్లో 'యశోబుద్ధ' తప్ప తక్కినవి కొంచెం గందరగోళమే నాకు, పాత్ర ఔచిత్యం పూర్తిగా వదిలేసినట్టుగా అనిపిస్తాయి. కవితా కానే ‘సీత’స్ సిస్టర్’, ‘కర్ణా’స్ వైఫ్’ కూడా కొంతవరకూ వోల్గా గారి దారిలోని పుస్తకాలే. అమీష్ పూర్తిగా ఫిక్షన్ లాగా రాసారు కాబట్టి పేచీ లేదు. ఈ ఇష్టాలు అయిష్టాలు పూర్తిగా వ్యక్తిగతం ఐనప్పటికీ కొన్ని ఆబ్జెక్టివ్అంశాలు ఉన్నాయి. పాత్ర ఔచిత్యం దెబ్బతినకపోవడం, మూల రచయిత ఆలోచనని సమూలంగా మార్చేయ్యకపోవడమ్, కొత్త దృక్పథంతో చూస్తున్నా రచన హృదయాన్ని దగ్గరిగా అర్థం చేసుకోవడం. మీలో చాలా మందికి వేరు అభిప్రాయం వుండొచ్చు. ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ఆలోచనలు ఎందుకు పంచుకోవడం అంటే ప్రభాకర్ శ్రోత్రియ్ ‘ఇల’ చదివినప్పటి నుంచీ ఆలోచనలు తిరుగుతున్నా ఇప్పుడు రాసే తీరిక దొరికింది కాబట్టి. ‘ఇల’ ఒక గొప్ప ప్రయత్నంగా కనిపించింది నాకు.
మనువు వంశాన్ని నిలిపే పుత్రసంతానం కోసం కోరుకుంటాడు. శ్రద్ధ మనసులో ఆడపిల్లలపట్ల మనువుకున్న ప్రేమ మాత్రం నిలిచింది. వశిష్టుడు పుత్రకామేష్టి చేయించాడు. హోతకి శిశువు గుణగణాల్ని వర్ణించే అధికారం తల్లిది. భూమిలాగా ఓర్పు కలిగినది, కామధేనువు లాగా లోక కళ్యాణకారిణి, సరస్వతీదేవి వంటి మేధస్సు కలిగినది, వంశానికి ఆద్యుడు సూర్యుడివంటి తేజస్సుకల కూతుర్ని అడిగింది శ్రద్ధ. మనువు, శ్రద్ధలకు ఇష్టిఫలంగా ‘ఇల’ కలిగింది. రావటమే తండ్రి ఆశకు విరుద్ధంగా. మనువు ప్రజాశ్రేయస్సు, ప్రజలకు ధర్మం పట్ల నమ్మకం కొడుకులోనే చూశాడు. పుట్టిన కూతురు కొడుకు కావాలన్నాడు. తల్లిని ఈ ఇష్టంలేకపోవడం తల్లడిల్లిపోయేలా చేసింది. వశిష్టుడు నచ్చచెప్పి చూశాడు మనువుకి. శ్రద్ధ ఏమాత్రం కనికరం చూపని ప్రభువుని చూసి గుండె రాయిగా చేసుకుని ఇలని రసాయనిక ప్రక్రియతో సుద్యుమ్నుడిగా మార్చటానికి అనుమతి ఇచ్చింది, ఇంక ప్రభువుతో తన పత్నీసంబంధాన్ని తెంచేసుకుని.
అమ్మాయిగా వుంటే అద్వితీయమైన గుణగణాలతో ఉండవలసిన ఇల, సుద్యుమ్నుడిగా ఎప్పుడూ ద్వితీయశ్రేణి లక్షణాలే. శ్రేష్టత్వం కోల్పోయింది. మనువు ఆశించిన ధృఢత్వం అబ్బలేదు సుద్యుమ్నుడికి. తండ్రి ఆశకు అనుగుణంగా మారాలని ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తే అంత తీవ్రంగా వెనక్కి రావడం. పెళ్లి తర్వాత కూడా మార్పు లేనట్టే. భార్య సుమతికి మాత్రం మహాత్వాకాంక్షలు ఉన్నాయి. సుమతి మెచ్చాలని తనకు తగని వేటకు శరవణవనం దాకా వెళతాడు. అక్కడి మూలికల స్పర్శకి ఇల గా మారిపోతాడు. తారాచంద్రుల పుత్రుడు బుధుడితో మనఃపూర్వక ప్రేమా, వివాహం. పురూరవుడు వారి సంతానం. స్త్రీ శరీరంతో ఇంత సఖ్యత వుండి పురుషుడిగా ఉక్కిరిబిక్కిరికావడం ఏమిటో ఇలకు అర్థం కాదు. వశిష్టుడి ద్వారా జన్మ రహస్యాన్ని తెలుసుకుని తప్పక సుద్యుమ్నుడిగా రాజ్యానికి తిరిగివస్తాడు. ఇప్పుడిక పొసగని దేహంతో, కుదరని బుద్దితో పూర్తి అసంగత నిర్ణయాలు, అప్పటిదాకా తెలియని క్రూరత్వం కాదంటే నిష్క్రియాపరత్వం. ఈ వైరుధ్యాలతో ఇంక రాజ్యం చేయడం సాధ్యం కాదు. సుద్యుమ్నుడిగా కన్న పిల్లలు, ఇలగా కన్న పురూరవుడు; రాజుగా ఎవరిని ఎంచుకోవాలి!? పూర్ణత్వం ప్రకృతిగానే; కనుక పురూరవుడే వారసుడు.
నాటకంగా ఇంత సులువు కాదు. అసలు కథ ప్రకారం ఇలను సుద్యుమ్నుడిగా మార్చడం నుంచి చివరిదాకా శాప, ప్రతిశాపాలు దైవ ప్రమేయాలు వుంటాయి. నాటకంలో వశిష్టుడే కర్త. దైవ ప్రమేయం అంతా నమ్మగలిగే శాస్త్ర ప్రయోగాలుగా మారాయి. తారా చంద్రుల కొడుకైన బుధుని పుట్టుక ఉప కథని కూడా హృద్యంగా నాటకంలోకి తెచ్చారు.
ప్రభాకర్ శ్రోత్రియ్ ప్రతిభ అంతా శ్రద్ధ, వశిష్టుడు, ఇల, సుద్యుమ్నుల అంతరంగమధనం పట్టివ్వడంలో వుంది. రాణిగా తప్పని తప్పు నిర్ణయానికి ఆమోదం తెలిపినా సుద్యుమ్నుడి వేదన చూసి తట్టుకోలేని తల్లిగా, అసలువిషయం బయటకు చెప్పలేని రాజ్ఞిగా శ్రద్ధ పోరాటం మర్చిపోలేనిది. రాజరికానికి గురువుగా కట్టుబడిన నేరానికి తన మనస్తత్వానికి ఏమాత్రం పొసగని పనులు చేయాల్సివచ్చి ఋషిత్వం తో పెనుగులాటలు వశిష్టుడిని ఇంతకుముందుకన్నా రక్తమాంసాలతో నిలబడతాయి. ఇలగా పూర్ణజీవితపు అనుభవాన్ని చవిచూసినా ఆ రూపంలో ఉండలేకపోయిన వివశత్వం సుద్యుమ్నుడిది. నాన్న కోరికకి తగ్గట్టు ఎందుకులేను!? అమ్మ ఎందుకు ఎప్పుడూ దగ్గరిగా మాట్లాడినట్లు ఉండదు!? మనసు మెత్తగా ఉండడం తప్పు ఎట్లా!? ఈ శరీరం నాదిలా ఎందుకు అనిపించదు!? వేట ఎందుకు నరకాన్ని చూపిస్తుంది!? చిన్నతనం నుంచీ బోలెడు సమాధానం దొరకని ప్రశ్నలు, సమాధానాలు వెతుక్కునే గట్టి ధైర్యమూ లేదు. ఇట్లాంటి ఆ సుద్యుమ్నుడు పూర్తిగా మనిషిలాగ కనిపిస్తాడు.
నాటకంగా రాయడం వల్ల రచయితకి పెద్ద ఉపన్యాసాలు రాసే వీలు లేకపోవడం పుస్తకాన్ని చెక్కటానికి ఉపయోగపడినట్లుగా నాకు తోచింది. ప్రతీ సంఘటనకి శాస్త్రీయత కల్పించినందున ఇది గొప్ప ప్రయత్నంగా కనిపించలేదు నాకు, ఆయా పాత్రల ఆత్మధర్మం ఆ పరిస్థితిలో అంతకన్నా వేరుగా ఉండనట్లుగా చదువరికి నమ్మకం కలిగేలా రాయడం ప్రభాకర్ శ్రోత్రియ్ విజయం.
నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసిన పుస్తకం. జనపన లక్ష్మీరెడ్డి గారు తెలుగు చేసారు. ఇక్కడి పుస్తకాల ఎక్సిబిషన్కి వెళ్ళినప్పుడు దొరికిన రెండే తెలుగు పుస్తకాల్లో ఒకటి ఇది.
No comments:
Post a Comment