Thursday, May 20, 2021

Bohemian Rhapsody


ఫరూక్ బుల్సారా, జాంజిబార్ నుంచి రెఫ్యుజిగా వచ్చి ఇంగ్లండ్లో స్థిరపడ్డ సంప్రదాయ పార్శీ కుటుంబంలోని పిల్లాడు. సంప్రదాయాలకు తిలోదకాలివ్వడం సరదా ఐన పిల్లాడు. సంగీతం మీద మొహం. యాదృచ్చికంగా ఒక బ్యాండ్ని కలుస్తాడు వాళ్ళ లీడ్ సింగర్ వెళ్ళిపోయిన రోజే. ఆ ఛాన్స్ నాకివ్వొచ్చు కదా అని ఆ పిల్లాడు పాడినపాటకి నచ్చేసి తమతో చేర్చుకుంటారు డ్రమ్మర్ రోజర్ టేలర్, గిటారిస్ట్ బ్రియాన్ మే. జాన్ డికన్ ని బాస్ మీద కలుపుకుని బ్యాండ్ గా ప్రదర్శనలు మొదలు పెడతారు బ్రిటన్ మొత్తం తిరుగుతూ. ఇదే సమయంలో మేరీ ఆస్టిన్ ని చూస్తాడు, ఇద్దరూ పరస్పరం ఇష్టపడతారు. సంగీతంలో ఇంకాస్త ఎదగాలని ఈ ఫరూక్ బ్యాండ్ని ఒప్పించి ఆల్బం తయారీ మొదలుపెడతాడు. ఈ ప్రయత్నాలు EMI రికార్డ్స్ ప్రతినిధి కంటపడి వీళ్ళతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ఫరూక్ యే మన కథకు, ‘క్వీన్’ గా ప్రపంచ ప్రఖ్యాతమైన బ్యాండ్ కు నాయకుడైన ఫ్రెడ్డీ మెర్క్యురీ.

ఫ్రెడ్డి మెర్క్యురీ సంగీత జీవితంతో పాటు నిజ జీవితంలోని ఉత్థాన పతనాలే ఈ సినిమా కథ. మ్యూజిక్ చేయడంలో ఎంత అన్కన్వెన్శనల్గా వుంటాడో జీవితంలో అంతకన్నా. సినిమాకి శీర్షికగా తీసుకున్న ‘బోహేమియన్ రాఫ్సోడి’ చేసింది అట్లాగే కంచెలన్నీ ఛేదించే. సంగీత ప్రపంచంలో ఎదుగతునపుడే తన హోమోసెక్సువాలిటీని గమనిస్తాడు. దానితో ప్రాణంగా ఇష్టపడ్డ మేరీతో బ్రేకప్, తను జీవితాంతం మంచి స్నేహితురాలిగా కొనసాగినా. రకరకాల సంబంధాలు, రకరకాల ఆకర్షణలు, రకరకాల బంధనాలు. కొన్ని పరిస్తితుల్లో బ్యాండ్ నుంచి కూడా బయటికి వచ్చేస్తాడు. మేరీ సహాయంతో అక్కర్లేని బంధనాలు తెన్చుకున్నాక మళ్ళీ బ్యాండ్ తో కలుస్తాడు. అందరూ కలిసి ఇథియోపియన్ క్షామబాధితులకోసం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన బాండ్లు, సంగీతకారులు అన్నిటినీ, అందరినీ కలిపి ఒక తాటి మీదకు తెచ్చి బోలెడు స్టేజీల మీద ఒకేసారి ప్రదర్శించిన ‘లైవ్ ఎయిడ్’ కార్యక్రమంలో మళ్ళీ క్వీన్ గా పాల్గొంటారు. బోహేమియన్ రాఫ్సోడి నుంచి చిన్న బిట్ తో మొదలుపెట్టి సరిగ్గా ఇరవై నిమిషాల ప్రదర్శన. ప్రేక్షకులతో ఇంత మమేకమైన సింగర్స్ చాలా తక్కువేమో చరిత్రలో. ఆ ఇరవై నిముషాలు అడ్రినలిన్ రష్ అని అనుకుని వదిలేయవచ్చు, సంగీతంతో ఒక్కసారి ఒకటిన్నర బిలియన్ల మంది చేసిన తపస్సూ అనుకోవచ్చు, ఎంత దొరికితే అంత. ఈ ప్రదర్శన తర్వాత ఆరేళ్ళకు, అంతకుముందే వచ్చిన ఎయిడ్స్ తో 1991 లో ఫ్రెడ్డి ప్రయాణం ముగుస్తుంది. ఎయిడ్స్ తో చనిపోయిన మొదటి సెలబ్రిటీ ఇతనే అని ఒక న్యూస్ రిపోర్ట్ లో చదివాను. ఆ తరువాత ఎయిడ్స్ మీద అవగాహన ఇంకాస్త పెరిగింది ప్రపంచానికి.
సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్న ఇద్దరిలో ఒకరైన జిమ్ బీచ్ ‘క్వీన్’ తో లాయర్ గా ప్రయాణం మొదలుపెట్టి మేనేజర్గా పనిచేసిన మనిషి. అందుకే అత్యంత అన్కన్వెన్శనల్గా బతికాడు అన్న పేరున్న R రేటెడ్ ఫ్రెడ్డి జీవితాన్ని స్ట్రిక్ట్ గా PG-13 సినిమాగా చూపించడం కోసం చాలా సంప్రదాయబద్దంగా తీసారని ముఖ్యమైన ఆరోపణ. ఆస్కార్ కి నామినేట్ అయిన ఆ స్థాయి రేటింగ్ లేని సినిమాగా కూడా పేరు పొందింది. కానీ చిత్రమేమిటంటే, సినిమా ఎట్లా ఉన్నా ఫ్రెడ్డి గా నటించిన రెమీ మాలెక్ మాత్రం తన అత్యున్నతస్థాయి నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసి మరీ ఆస్కార్ గెలుచుకున్నాడు.
ఫరూక్ నుంచి ఫ్రెడ్డి గా మారడం, తండ్రితో ఎప్పుడూ ఒక కనపడని ఘర్షణ, కుటుంబంలో తను ఒక సంప్రదాయపాత్రలో ఇమడలేకపోవడం, మేరీని వదులుకోలేకపోవడం, కుటుంబంతో ఉన్న మిత్రుల్ని చూసి సంతోషపడ్డా అంతలోనే తన ఒంటరితనంతో ఏదో పొల్లు మాట అనెయ్యడం, అందరిలో ఉన్నా, అందరూ ప్రేమించేవాళ్ళు చుట్టూ ఉన్నా ఒంటరిగా ఉండాల్సిరావడం, ఈ ఒంటరితనంలో తప్పు స్నేహాలు పట్టడం, అందరినీ దూరం చేసుకోవడం, చివరికి ఎట్లా అయినా వాళ్ళు accept చేస్తే చాలుననుకోవడం; ఓహ్!! ఒక్క మాటలో చెప్పాలంటే రెమీ మాలెక్ కనిపించడు, ఫ్రెడ్డీ మెర్క్యురీ తప్ప. ఒమర్ షెరీఫ్ తర్వాత నాకు తెలిసిన ఈజిప్షియన్ నటుడు ఇతనే. ఆ స్థాయి నటన కూడా, కొంత మించే. నాకు తెలిసి ఇక్కడ బోలెడంతమంది ‘క్వీనాభిమానులు’ ఉన్నారు. వాళ్ళెవరికీ ఇవేవీ కొత్త విషయాలు కాకపోవచ్చు, మిగిలిన వాళ్ళు మాత్రం ఎప్పుడైనా ఈ సినిమా కనపడితే వదిలేసి వెళ్ళకండి. రెమీ మాలెక్ కోసమైనా, క్వీన్ పాటలకోసమైన చూడాల్సిన సినిమా. HBO లో వస్తూ ఉంటుందట. సినిమా సంగతి వదిలెయ్యండి, ఇక్కడ లైవ్ ఎయిడ్ కోసం బ్యాండ్ చేసిన ఒరిజినల్ పెర్ఫార్మన్స్ తో పాటు ఈ కథను పోల్చి చేసిన వీడియో జత చేస్తున్నాను. అంతవరకైనా చూడండి. రెమీ మాలెక్ గురించి నేను ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పలేదని మీకే తెలుస్తుంది.
చివరిగా ఒక మాట; ఇది సినిమాకు కానీ, ఫ్రెడ్డీ మెర్క్యురీ జీవితానికి కానీ సమీక్ష కాదు కదా, కనీసం పరచయం కూడా కాదు.

No comments: