Thursday, May 20, 2021

రెప్ప చాటు ఉప్పెన - ఛానెల్ 24X 7 - చేబ్రోలు సుజాత

 


చేబ్రోలు సుజాత గారు సుదీర్ఘకాలం పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి ఇప్పుడు విశ్రాంతజీవితం లో ఉన్నారు పూర్తి స్థాయి ఉద్యోగం నుంచి మాత్రం; పని పూర్తిగా మానలేదు. ఫేస్బుక్లో సుజాత గారు పరిచయమైనప్పటి నుంచీ ఒక గౌరవ భావం వుంది. చిన్న చిన్న పోస్టులు చూసిన సినిమాల మీద; చదివిన, కదిలించిన విషయాలమీద పెడుతుంటారు. ముఖ్యంగా ఈ లాక్డౌన్ కాలంలో సుజాత గారు పరిచయం చేసినన్ని విభిన్నమైన జీవితకథల సినిమాల పరిచయం చేసినవారు చాల తక్కువ. రాసే చిన్న పరిచయంలో కూడా ఆవిడ దైన పరిణితి చెందిన ఆలోచన తెలుస్తుంది. శోభానాయుడు గారి ప్రయాణం ముగిసిన సందర్భంలో సుజాతగారు పెట్టిన ఒక పోస్టులో సుస్మితతో మాటల్లో ఆవిడ రాసిన ‘ఛానెల్ 24X 7’ పుస్తకం గురించి తెలిసింది. ఆవిడ మంచి రచనలు క్రితంలో చేసి ఉన్నారని తెలిసినా ఇప్పటివరకూ ఏదీ చదవలేకపొయాను. ఈ పుస్తకం గురించి వారిని అడగగానే వెంటనే దాంతో పాటు ‘రెప్ప చాటు ఉప్పెన’ కూడా కలిపి పంపారు చాల ప్రేమతో మాట్లాడి మరీ.

మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ‘ఛానెల్ 24X 7’ పుస్తకం మొత్తం ఒక్కసారిగా చదివేసాను. చిన్న పుస్తకం కానీ ఎలక్ట్రానిక్ మీడియా తీరుతెన్నులమీద పూర్తి అవగాహనతో రాసిన పుస్తకం. ఆవిడకి ఆ రంగం మీద ఉన్న పట్టు పూర్తిగా తెలుస్తుంది. చదువరిని మమేకం చేసుకోవడానికి అవసరమైనంత నాటకీయత మాత్రం కల్పించి ఒక్కరోజులో జరిగే సంఘటనల నేపథ్యంలో మీడియా రంగంలోని రాజకీయాల్ని, మనుషుల మనస్తత్వాలని, మంచిచెడుల్ని, కొన్ని ఆలోచనల్లోని లోతులనీ, ఊబిలో కూరుకుపోయేలా చేసే లుకలుకలని ప్రభావవంతంగా చూపించారు. నిజ జీవితంలో అంత తేలిక ముగింపులు కుదరవని తెలిసినా సుజాత గారి ఆశావహదృక్పథాన్ని మాత్రం బోలెడు ఇష్టపడ్డాను. ఈ పుస్తకంలో ఆహ్లాదాన్నిచ్చిన ఒక విషయం సుజాత గారి అబ్బాయిలు ఇద్దరూ రాసిన ముందుమాటలు. వాళ్ళ మాటల్లో ఆవిడపట్ల అపారమైన ప్రేమ అంతకుమించి ఆవిడ దృఢమైన వ్యక్తిత్వం పట్ల గొప్ప ఆరాధన కనపడుతుంది.
తరువాతి పుస్తకం ‘రెప్పచాటు ఉప్పెన’, ఈ పుస్తకము ఆవిడతో ప్రేమలో పడేలా చేసిన పుస్తకం. ఇదిమాత్రం ఒక్కసారిగా చదవగలిగే పుస్తకం కాదు, ఆ కథలు ఒక్కొక్కటి తట్టుకోవాలంటే ఒక్కసారిగా చాలా కష్టం. ఒక్కోటీ చదవాలి. అన్నికథల్లో ముఖ్యసూత్రం ఒకటే. ఆడవాళ్లంటే ఆవిడకు ప్రేమ, వాళ్ళ జీవితాలంటే ఆమెకు ఇష్టం, కోపం; నమ్మకం, అపనమ్మకం; ఆరాధన, అంతులేనిఆవేదన. ఆవిడ నిజాలుచెప్పడానికి భయపడరు, తన పాఠకుల్ని ఊహల్లో ముంచెత్తరు. మాతృత్వం , ఇల్లాలిపదవి చుట్టూ కట్టిన ఆరాధనాముసుగులోని అతిశీతలమైన, కర్కశమైన ఏడు నిలువులెత్తు మంచుగోడల్నినిర్దాక్షిణ్యంగా బద్దలుకొడతారు. మార్మికంగా చెప్పడం హాయిగా చాల చక్కగా చేతనవును (వెలుగుపూలు) కానీ మొహంమీద కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే ఎక్కువగా కనపడుతుంది. ఎట్లాగైనా తన చదువరిలో కొంచెంఆలోచనవికసిస్తే ఆవిడకి చాలు.
స్త్రీల పక్షపాతి అని ముద్రవెయ్యడం తేలిక, కానీ ఆవిడ అంతర్గతంగా అణచివేతకు వ్యతిరేకం. స్త్రీల జీవితాల్లోని కల్లోలపు పార్శ్వాలు అన్నిటినీ తడిమిచూసారు. ఒక సగటు మధ్యతరగతిఇల్లాలిపాత్ర కావచ్చు, మసకవెలుతురులో దీపస్తంభాలకు దూరంగా చీకట్లో నిలబడే కుమారి కావచ్చు, కష్టంలో ఒకలాగా తర్వాత ఇంకోలాగా ప్రవర్తించిన కిరణ్ని చూసి బెంబేలుపడ్డ డాక్టర్ వనజాక్షికావచ్చు, తనకు బిడ్డ మాత్రం చాలు వేరే బంధాలు లేకుండా అని అనుకోగలిన పరిమళ కావచ్చు, తన ఇంటికేఅంకితమైపోయి పని చేసిన అమృతం చనిపోతే, అమృతం మూడేళ్ళ చంటోడిని దగ్గరకుతీయాలంటే ఉన్న అడ్డుగోడల్ని దాటాల్సిన జానకికావచ్చు అందరివీ చూసిన కథలే, జరిగిన కథలే, జరుగుతున్న కథలే. అట్లాంటి కథలు ఏమీ లేవని కళ్ళు మూసుకుని హాయిగా కాలక్షేపం చేయడమంత నిజం ఆ కథలు ఉండటం. ఇప్పుడు ఈకథలు చదివితే ఇలాంటివి మనం చదివామే అనిపించొచ్చు కానీ ఈ కథలు సుజాత గారు తొంభైల్లో రాసారు. చాలావిషయాల్లో రెండు దశాబ్దాల తర్వాతకూడా పెద్ద మార్పేమీ వుండకపోవడమే ఆవిడ ఆలోచన పదునుకు నిదర్శనం.
ఈ పుస్తకానికి శీర్షికనిచ్చిన కథ ‘రెప్పచాటు ఉప్పెన’; కాస్త తిండిదొరికితే అన్నీఉన్నట్టే అని నమ్మి ముసలిమగణ్ణి కట్టుకున్న వరలక్ష్మి బాధనుచిత్రించిన కథను మించిన బోల్డ్ కథలు ఏముంటాయ్. బొరుసు కథలోని క్లుప్తమైన వ్యంగ్యంపు వాక్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. మిస్సెస్ గౌతమ్, చందన ఇద్దర్నీ పావులుగా చేసి మిస్టర్ గౌతమ్ ఆడిన మూడు స్తంభాలాట తక్కువది కాదు. అన్ని కథలూ చదవవలసినవే, ఆలోచింపజేసేవే. వాక్యాల్లో క్లుప్తత, అంశాల్లో గాఢత, చదువరి పట్ల అక్కర సుజాత గారి కథల్లోని మేలిమి లక్షణం. బహుశా ఈ కథల వాల్యూమ్ కథ నిలయంలో ఉన్నట్టుంది, చదవండి. ఆడవాళ్ళ కథలు అని మగవాళ్ళు పక్కన పెడతారేమో అసలు చదవవలసింది మీరే 🙂
థాంక్యూ సుజాతగారూ, ఇక్కడ ‘గారు’ అని రాసేసాను గానీ, మాట్లాడగానే అమ్మ అనే పిలవాలనిపించింది, ఇంక అంతే పిలవడం.

No comments: