ఆన్ : ఇట్లాంటి విషయాలు ఎందుకు మాట్లాడతావ్?
పాల్: నేనేమన్నా!?
కాస్త ఆగి
ఆన్: అయినా సరి కాదు.
పాల్: ఆన్, నీ బాధ నాకు తెలుసు
ఆన్: లేదు, నీకేమీ తెలీదు
పాల్: కాదు, నాకు తెలుసు. నువ్వు ఆయన కోసం ఇంత చేస్తున్నావ్, అందుకు నిన్ను గౌరవిస్తాను. ఆయన్ని ఇక్కడికి తీసుకురావాలనుకున్నావ్, మంచి ఆలోచనే. కానీ... హ్మ్! ఎలా చెప్పాలి నీకు, నువ్వు వేరే పరిష్కారం వెతక్కతప్పదు ఆన్, ఆయనకు ఏదీ గుర్తు లేదు.
ఆన్: అలా మాట్లాడకు
పాల్: ఇంకెలా మాట్లాడమంటావ్? నేను నిజం మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకో రకమైన పరిష్కారం వెతక్క తప్పదు.
ఆన్: అంటే.....
పాల్: ఇన్స్టిట్యూషన్ లో పెట్టడం లాగా
ఆన్: 'హోమ్' లోనా?
పాల్: అవును, నర్సింగ్ హోమ్...... ఆయనకి అదే మంచిది.
ఆన్: ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నావ్? రేప్పొద్దున్న నుంచీ ఆయన్ని చూసుకోవడానికి ఆ అమ్మాయి వస్తుందిగా!! నువ్వు ఇప్పుడు....
పాల్: హ్మ్! నువ్వన్నది నిజమే, చూద్దాం. ఈ సారి ఈ అమ్మాయితో వర్క్ అవుతుందేమో. మంచమ్మాయిలాగా వుంది అన్నావుగా..
ఆంథోనీ గుమ్మం లోకి అప్పుడే వచ్చాడు తన చికెన్ పట్టుకుని. వీళ్లిద్దరి సంభాషణ వింటూ. వాళ్ళు గమనించలేదు.
పాల్: కానీ, నన్ను నమ్ము. డాక్టర్ చెప్పినట్టు... ఆ మొమెంట్ వస్తుంది. ఈ అమ్మాయి ఎంత బాగా చూసుకున్నా ఆయన ఆరోగ్యం సరిగా లేదు ఆన్. He is ill.
ఆంథోనీ గుమ్మంలో ఉన్నాడని అప్పుడే ఇద్దరూ గమనిస్తారు. ఒక చిన్న ఉలికిపాటు, కంగారు ఇద్దరిలో....
ఆన్: నాన్నా, ఏం చేస్తున్నావ్ అక్కడ నిలబడి? రా... ఇలా వచ్చి కూర్చో.
ఆంథోనీ స్పందించలేదు.
ఆన్: నాన్నా....
.......
రా ... నాన్నా....
.......
వచ్చి కూర్చో
ఆంథోనీ విభ్రాంతితో చూస్తుంటాడు. ఏం విన్నాడు తను! ఎవరికీ బాగా లేదు? ఆన్ లేచి ఆంథోనీ దగ్గరకు వస్తుంది. ఆంథోనీ ఈసారి తనతో పాటు టేబుల్ దగ్గరికి వెళ్ళడు. వాళ్లతో ఏమీ మాట్లాడకుండా తన బెడ్రూమ్ కేసి నడుస్తాడు.
"The Father" ఆంథోనీ హాప్కిన్స్ కి ఈసారి అకాడెమీ అవార్డు ఇప్పించిన సినిమా. ఆంథోనీ హాప్కిన్స్ తండ్రి; ఒలీవియా కోల్మన్ కూతురు. ఈ యిద్దరిదే ఈ సినిమా. మిగిలిన పాత్రలన్నీ కలిపి ఒక పిడికెడు. ఆంథోనీ డిమెన్షియా పేషెంట్. చాలా కొద్దీ విషయాలు మాత్రమే మెమరీలో మిగిలిపోయాయి. కథలోని ఏ విషయాలు చెప్పినా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుంది, అందుకే ఏమీ రాయడం లేదు. 80 ఏళ్ల పైబడి జీవించగల మనుషులు న్యూ నార్మల్ అవుతున్న సందర్భంలో ఇట్లాంటి పాత్రకి అకాడెమీ అవార్డు రావడం సముచితంగా వుంది. 'నోమాడ్ల్యాండ్' కి కూడా, అది పూర్తిగా వేరే కాంటెక్స్ట్ అయినా. హాప్కిన్స్ నటనని ఒక్క రవ్వ తక్కువ చేయడానికి కూడా ఈ మాట అనట్లేదు. ఏది నిజంగా చూస్తున్నాడో, ఎవరు మస్తిష్కంలోంచి పుట్టుకొచ్చి కళ్ళముందు ఆడుతున్న బొమ్మలో; తను ఉన్న ఇల్లు తనదో కాదో; కూతురు తనను నిజంగా ప్రేమగా చూసుకుంటుందో, అదాటున నిద్ర పోయినప్పుడు గొంతు పిసికేస్తుందో; జరుగుతున్నాయి అనిపిస్తున్న సంఘటనలు కలలోనో నిజంలోనో ఏదీ తెలియదు. కళ్ళు తెరిచిన ప్రతీసారి ఈ సవాలక్ష విషయాల్లోని ఎన్నో విషయాలు జ్ఞాపకంలో వుండవు. దగ్గరఉన్నవాళ్లు మళ్ళీ దయతో అన్నీ గుర్తు చెయ్యాల్సిందే. మెమరీలో లీలగా మిగిలిన జ్ఞాపకాలకు వీటితో సంఘర్షణ. ఈ భావోద్వేగాలను అన్నిటినీ పలికించడం ఇంకెవరు ఇంత బాగా చెయ్యగలరు అన్నంత గొప్ప నటన.
ఒలీవియా కోల్మన్ కి దొరికిన మరో మంచి పాత్ర, చాల చక్కగా ఇమిడిపోయింది ఆ నాన్నకు కూతురిగా. మినిమల్ సెట్టింగ్స్, డైలాగ్ ఇంటెన్సివ్ స్క్రిప్ట్, అతి కొద్ది లొకేషన్స్, పాత్రల్లో ఒదిగేపోయే నటులు సినిమాకి ఏమి ఇవ్వగలరో చెప్పే సినిమా. ప్రస్తుతం నాకు తెలిసి ఏ ప్లాట్ఫారం లోనూ ఉన్నట్టు లేదు. తొందరలోనే ప్రైమ్ లోనో, నెట్ఫ్లిక్స్ లోనో రావచ్చు. తప్పకుండా చూడండి.
మంచి సినిమా చూసాక నేను వెతికే వెతుకుడులో భాగంగా సినిమా స్క్రిప్ట్ దొరికింది. చదవాలి అనుకున్న వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/3tsBQA4
No comments:
Post a Comment