అనగనగా ఒక ఊరు.... కాదు కాదు ఒక నాన్న ..... ఊహూ!! ఒక నాన్న ఒక పిల్లాడు, ఇంకా వాళ్ళ కుటుంబం. అది చాలా పాతకాలం, డివ్ లు( మన బ్రహ్మరాక్షసుల మాదిరి జీవులు), జీనీలు హాయిగా తిరిగిన కాలం....
నాన్న భలే పనిమంతుడైన మనిషి. ఆరుగాలం పనిచెయ్యడమే ఆ బలహీనంగా ఉన్న పిస్తా తోటలకు. ఉత్తరాన ఊళ్లలో మేలిమి పచ్చదనమే, ఇక్కడేమో నీళ్ళూ కరువే; అయినా నాన్న తిప్పలు పడాల్సిందేగా. నాన్నకో భార్య. ఆ చుట్టుపక్కల మగవాళ్ళంతా వారి భార్యలతో వ్యవహరించినట్టు కొడుతూ తిడుతూ వుండటం నాన్న తీరు కాదు, ఆవిడకీ ఓ మెదడు వుంది, ఆ మెదడుతో ఏదైనా సలహా ఇస్తే వినొచ్చు అనుకునే నాన్న. ఈ అమ్మా నాన్నలకి చేతికి అయిదు వేళ్లలాగా ఐదుమంది పిల్లలు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. కెస్ (Qais వీలు కోసం ఇలా రాసా) చిన్న చిటికెనవేలు. నాన్నకు పిల్లలందరూ ప్రాణమే వీడు కొంచెం ఎక్కువ. కెస్ కి ఒక చిత్రమైన అలవాటు... నిద్రలో నడవడం. వాడు అట్లా వెళ్ళిపోయి ఏ చిక్కుల్లో పడతాడో అని ఒక మేక మెళ్ళో గంట వాడి మెళ్ళో కట్టారు. రాత్రి గంట మోగగానే ఎవరో ఒకరు లేచి వాణ్ణి పట్టేసుకుంటారు భలే తెలివిగా. రోజూ నాన్న ఇంటికి రాగానే గణగణా మోగుతూ కెస్ ఎదురువస్తాడు, నాన్న వాణ్ణి ఎత్తుకుముద్దుచేసి మిగిలిన పనులకు వెళ్తాడు. రోజులన్నీ ఇట్లాగే గడిస్తే మన కథ ముందుకు ఎట్లా!? పైగా డివ్ లు ఖాళీగా లేవూ!!
అప్పట్లో అమాసకు పున్నమికి అన్నట్లు డివ్ ఏదో ఒక ఊరికి పోయేది. అది వచ్చిందంటే ఇంకేం బ్రహ్మప్రళయం. ఊరంతా బిక్కచిక్కిపోయి, పిల్లాజెల్లని కట్టకట్టుకుని దగ్గరగా పెట్టుకుని, ఇళ్లలో నక్కిఉంటారు...ఒక్క రవ్వ సడి లేకుండా. ఆ డివ్ ఎవరింటి కప్పు మీద మెల్లగా తడుతుందో ఆ ఇంటివాళ్ళు ఒక పిల్లనో, పిల్లవాణ్ణో ఇచ్చేయాలి తెల్లారేలోపు. అట్లా ఇస్తే ఆ ఒక్కళ్ళని తీసుకుని వెళుతుంది లేదంటే ఇంట్లో పిల్లలంతా మటాష్... వీళ్ళది తిండిలేని ఊరు కదా! కండలేని పిల్లలు... అందుకే చాన్నాళ్లయి డివ్ ఈ ఊరి గడప తొక్కలేదు. మరి ఎన్నాళ్ళు వదిలేస్తుంది, రానే వచ్చింది. నాన్న ఇంటికప్పు తట్టనే తట్టింది. నాన్నా అమ్మా ఒకటే ఏడుపు, పిల్లలకు ఇదేమీ తెలీదు, వాళ్ళు హాయిగానే... సమయం గడుస్తూ వుంది.... సూర్యోదయం కాబోతుంది... అమ్మా నాన్నా తేల్చుకోవాలి... ఒక వేలా, మొత్తం చెయ్యా? సరే! చెయ్యి కోసం ఒక వేలు అని గుండెదిటవు చేసుకున్నారు. మరి ఎవర్ని!? మళ్లీ పోరాటం. నాన్న అయిదు రాళ్లు ఏరుకొచ్చి పిల్లల పేర్లు రాసి అమ్మని ఎంచమన్నాడు, ఇంకా నయం అమ్మ ఎట్లా చేయగలదు ఇట్లాంటి ఎంపిక. నాన్నే తీసాడు, ఇంకెవరు కెస్.....
నాన్న, అమ్మ కెస్ ని పట్టుకు ఏడ్చారు. వాడికేమి తెలుసు.... ఇంకెంత సూర్యోదయమే. నాన్న కెస్ ని ఎత్తుకున్నాడు, వాడు ధైర్యంగా పట్టుకున్నాడు నాన్నని, వాడికేమి లెక్క నాన్న ఉన్నాక.... నాన్న వాడిని గడపబయట వదిలిపెట్టి లోపలికితిరిగి గడియ వేసాడు. వాడికేమీ తోచలేదు. కాసేపటికి ఏడుపు మొదలయ్యింది.... వాడి మెళ్ళో గంట గణగణ మోగింది... లోపల నాన్న ఏడుపు, బయట వాడిది.... కాసేపటికి గంట శబ్దం దూరమై అంతా నిశ్శబ్దం..... నాన్న పొగిలి పొగిలి ఏడ్చాడు. నలభై రోజుల శోకం చెల్లిపోయింది వాడికోసం.... అందరూ కాస్త కాస్త తేరుకున్నారు, గాడిలో తిరగక తప్పని బతుకులు కదా!! నాన్న మాత్రం అంతే ఉన్నాడు. మిగిలిన పిల్లలు పని అందుకున్నారు. ఊరివాళ్ళు నాన్నని పిచ్చోడు అన్నారు. అట్లా కొన్నాళ్ళు, కొన్నేళ్ళు గడిచాక నాన్న ఇంక తట్టుకోలేక పోయాడు. ఓరోజు పొద్దున్నే బయలుదేరాడు.
నాన్న ఊళ్ళు దాటాడు, వాగులు దాటాడు, వంకలు దాటాడు, గుట్టలూ.. లోయలూ అన్నీ.... దారిపొడవునా అందరూ ఏమిటీ పిచ్చి, వెళ్లగలవనేనా!! అని ఆశ్చర్యపోయారు, బుగ్గలు నొక్కుకున్నారు. ఒకరోజు చేరనే చేరాడు డివ్ ఉన్న కొండ గుహ ముందుకి. ఒక పెద్ద అరుపు అరిచాడు. బయటికి రా డివ్! నిన్ను చంపేసి నా కెస్ ని పట్టుకెళ్తా అని. డివ్ బయటకి వచ్చింది... ముందు ఆశ్చర్యపడింది... మొదటిసారి తన స్థావరం తెలుసుకుని ఒక మనిషి తనంతగా వచ్చింది ఇదే... తత్తరపడింది, అబ్బో! పోరాటమే అని. 'మొదటిసారి ఇంతదాకా రాగలిగింది నువ్వే నీకు బహుమతి ఇవ్వాలని ఉంది, ముందు నీకోకటి చూపిస్తా తర్వాత కావాలంటే పొట్లాడుదువులే' అంది. నాన్న నీతో మాటలేంటి అన్నాడు కానీ, కెస్ ని చూడొచ్చేమో అని ఒప్పుకున్నాడు.
నాన్న ఆలోచన నిజమే, డివ్ చూపించింది కెస్ నే. కెస్ లాగా బోలెడంత మంది పిల్లలు... అదేదో స్వర్గం అంటారు.. అట్లాంటి ఆనందలోకం. బోలెడు పళ్లచెట్లు, మిఠాయిలు, ఆటల సందళ్ళు. ఇవన్నీ అయ్యాక చదువులట. నాన్నకి ఇదంతా ఏమి పడుతుంది! కెస్, కెస్ అని గట్టిగా అరిచాడు. డివ్ చెప్పనే చెప్పింది నీ మాటలు వాడికి వినిపించవ్, నువ్వు కనపడవ్ అని. నా కొడుకు నాకు కావాలి, ఇంకేమీ వద్దు అన్నాడు నాన్న. డివ్ అడిగింది 'బహుమతి అన్నా కదా, మాట తప్పను. వాడిని ఇచ్చేస్తా, సరే!! ఇప్పుడు వాడు నిన్ను, కుటుంబాన్నీ అన్నీ మర్చిపోయాడు. ఇట్లా హాయిగా కడుపునిండా తిని, హాయిగా ఆడుకుని, పెద్ద పెద్ద చదువులు చదివి తర్వాత లోకాన్ని ఉద్ధరిస్తాడు. నువ్వు తీసుకెళ్లి వాడినేమి చెయ్యగలవ్!?'. నాన్న ఏం చెప్పగలడు!? 'అదేంటి! వాడికి నేను, అమ్మా, అన్నలూ, అక్కలూ వుంటారు అది చాలదా!!' అని. అంతలోనే గుర్తొచ్చింది డివ్ వచ్చి వెళ్ళాక, ఊరిని పట్టుకున్న కరువు... ఊళ్ళో తిండిలేక చచ్చిపోయిన బోలెడంతమంది పిల్లలు... ఏం చెయ్యాలి కెస్ ని తీసుకెళ్లి? వాడికేం పెట్టి పెంచాలి? ఇప్పుడు పండులాగా కనపడుతున్నాడు పిల్లాడు దూరం నుంచీ కూడా.... నాన్నకి మళ్లీ ఎంచుకోకతప్పని పరిస్థితి.
నాన్న ఇంక మాట్లాడలేదు, వెనక్కి తిరిగాడు... వెళ్లిపోసాగాడు. డివ్ ఆపాడు. నీకు ఇంకో బహుమతి ఇస్తున్నా ఈ మాత్ర తీసుకో, నీ ఊరికి చేరాక తిను; నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పింది. ఇంకేమి మంచి!! నిట్టూర్చి వెనక్కి తిరిగాడు నాన్న. ఊరు చేరాడు. మాత్ర మింగాడు. నాన్న మొత్తం మర్చిపోయాడు, డివ్, స్వర్గం, ఆనందలోకం, అంతంత ప్రయాణం అన్నీ... చివరికి కెస్ ని కూడా. వానలు కురిశాయి. పిస్తా చెట్లు బ్రహ్మాండంగా ఎదిగాయి. ఆ ఊరులో మళ్లీ కరువన్నది లేదు నాన్న 'ఆయూబ్' బతికిఉన్నన్నాళ్ళూ, డివ్ ఇచ్చిన ఇంకో బహుమతి కాబోలు....... ఒకటే లోటు... అప్పుడప్పుడూ గాలి తిరిగినప్పుడల్లా ఏవేవో శబ్దాలు వినవచ్చేవి నాన్నకు అన్నీ తెలిసేవి.... ఒక్క సన్నగా మోగే గణగణ గంట శబ్దం తప్ప!! ఏమిటో అనుకునేవాడు..... ఎప్పుడూ తెలిసేది కాదు.... ఈ నాన్నకి మాత్రం నలుగురు పిల్లలే, అదే గుర్తు.
ఇంతే కథ.... ఈ కథ చెప్పింది ఇంకో నాన్న 'సబూర్'. కొడుకు 'అబ్దుల్లా' మొత్తం కథ విన్నాడు. కూతురు 'పరీ' సగమే విని నిద్ర పోయింది చిన్న పిల్ల కదా.... ఈ అన్నాచెల్లెళ్ల కథ ఎలా కంచికి చేరుతుందో ముందు సాగేది... అదే అసలు కథ. మన పురాణేతిహాసాల్లో కథకులు సాధించిన పంథా ఇదే కదా... ముఖ్యంగా మహాభారతం ఆదిపర్వం మొత్తం. ఒక యయాతి ఆఖ్యానం, ఒక వినత కద్రువ పోరాటం ముందు ముందు జరగబోయే గాథని అద్దంలో పట్టి చూపడమే కదా చేసింది.
ఖాలేద్ హుస్సేనీ నేను పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు. రాసింది నాలుగు పుస్తకాలు. గట్టిగా చెప్పాలంటే మూడు మీద పావలా. 'Sea Prayer' ఏ గాథ కు తగ్గని ఆధునిక కాలపు శరణార్థి విషాదగాథ అయినా హుస్సేనీ అందులో రాసింది పేజీన్నర మహావిషాదం మాత్రం, అందుకు పావలా అనడం. ఇక అమ్మింది రమారమి యాభై అయిదు మిలియన్ల కాపీలు. అన్ని కథల మూలం ఆఫ్ఘనిస్తాన్, ఆత్మ అఫ్ఘాన్. కథ విశ్వజనీనం. పుస్తకం గురించి నేనేమీ చెప్పలేదు. సోఫీ'స్ ఛాయిస్ నుంచి ఎన్ని గుర్తొచ్చాయో.... వేటితో పనిలేదు... చదవనివారు చదవండి. 'కైట్ రన్నర్' 'A Thousand Splendid Suns' గురించి మరెప్పుడైనా.....
No comments:
Post a Comment