Thursday, May 20, 2021

రెప్ప చాటు ఉప్పెన - ఛానెల్ 24X 7 - చేబ్రోలు సుజాత

 


చేబ్రోలు సుజాత గారు సుదీర్ఘకాలం పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి ఇప్పుడు విశ్రాంతజీవితం లో ఉన్నారు పూర్తి స్థాయి ఉద్యోగం నుంచి మాత్రం; పని పూర్తిగా మానలేదు. ఫేస్బుక్లో సుజాత గారు పరిచయమైనప్పటి నుంచీ ఒక గౌరవ భావం వుంది. చిన్న చిన్న పోస్టులు చూసిన సినిమాల మీద; చదివిన, కదిలించిన విషయాలమీద పెడుతుంటారు. ముఖ్యంగా ఈ లాక్డౌన్ కాలంలో సుజాత గారు పరిచయం చేసినన్ని విభిన్నమైన జీవితకథల సినిమాల పరిచయం చేసినవారు చాల తక్కువ. రాసే చిన్న పరిచయంలో కూడా ఆవిడ దైన పరిణితి చెందిన ఆలోచన తెలుస్తుంది. శోభానాయుడు గారి ప్రయాణం ముగిసిన సందర్భంలో సుజాతగారు పెట్టిన ఒక పోస్టులో సుస్మితతో మాటల్లో ఆవిడ రాసిన ‘ఛానెల్ 24X 7’ పుస్తకం గురించి తెలిసింది. ఆవిడ మంచి రచనలు క్రితంలో చేసి ఉన్నారని తెలిసినా ఇప్పటివరకూ ఏదీ చదవలేకపొయాను. ఈ పుస్తకం గురించి వారిని అడగగానే వెంటనే దాంతో పాటు ‘రెప్ప చాటు ఉప్పెన’ కూడా కలిపి పంపారు చాల ప్రేమతో మాట్లాడి మరీ.

మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ‘ఛానెల్ 24X 7’ పుస్తకం మొత్తం ఒక్కసారిగా చదివేసాను. చిన్న పుస్తకం కానీ ఎలక్ట్రానిక్ మీడియా తీరుతెన్నులమీద పూర్తి అవగాహనతో రాసిన పుస్తకం. ఆవిడకి ఆ రంగం మీద ఉన్న పట్టు పూర్తిగా తెలుస్తుంది. చదువరిని మమేకం చేసుకోవడానికి అవసరమైనంత నాటకీయత మాత్రం కల్పించి ఒక్కరోజులో జరిగే సంఘటనల నేపథ్యంలో మీడియా రంగంలోని రాజకీయాల్ని, మనుషుల మనస్తత్వాలని, మంచిచెడుల్ని, కొన్ని ఆలోచనల్లోని లోతులనీ, ఊబిలో కూరుకుపోయేలా చేసే లుకలుకలని ప్రభావవంతంగా చూపించారు. నిజ జీవితంలో అంత తేలిక ముగింపులు కుదరవని తెలిసినా సుజాత గారి ఆశావహదృక్పథాన్ని మాత్రం బోలెడు ఇష్టపడ్డాను. ఈ పుస్తకంలో ఆహ్లాదాన్నిచ్చిన ఒక విషయం సుజాత గారి అబ్బాయిలు ఇద్దరూ రాసిన ముందుమాటలు. వాళ్ళ మాటల్లో ఆవిడపట్ల అపారమైన ప్రేమ అంతకుమించి ఆవిడ దృఢమైన వ్యక్తిత్వం పట్ల గొప్ప ఆరాధన కనపడుతుంది.
తరువాతి పుస్తకం ‘రెప్పచాటు ఉప్పెన’, ఈ పుస్తకము ఆవిడతో ప్రేమలో పడేలా చేసిన పుస్తకం. ఇదిమాత్రం ఒక్కసారిగా చదవగలిగే పుస్తకం కాదు, ఆ కథలు ఒక్కొక్కటి తట్టుకోవాలంటే ఒక్కసారిగా చాలా కష్టం. ఒక్కోటీ చదవాలి. అన్నికథల్లో ముఖ్యసూత్రం ఒకటే. ఆడవాళ్లంటే ఆవిడకు ప్రేమ, వాళ్ళ జీవితాలంటే ఆమెకు ఇష్టం, కోపం; నమ్మకం, అపనమ్మకం; ఆరాధన, అంతులేనిఆవేదన. ఆవిడ నిజాలుచెప్పడానికి భయపడరు, తన పాఠకుల్ని ఊహల్లో ముంచెత్తరు. మాతృత్వం , ఇల్లాలిపదవి చుట్టూ కట్టిన ఆరాధనాముసుగులోని అతిశీతలమైన, కర్కశమైన ఏడు నిలువులెత్తు మంచుగోడల్నినిర్దాక్షిణ్యంగా బద్దలుకొడతారు. మార్మికంగా చెప్పడం హాయిగా చాల చక్కగా చేతనవును (వెలుగుపూలు) కానీ మొహంమీద కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే ఎక్కువగా కనపడుతుంది. ఎట్లాగైనా తన చదువరిలో కొంచెంఆలోచనవికసిస్తే ఆవిడకి చాలు.
స్త్రీల పక్షపాతి అని ముద్రవెయ్యడం తేలిక, కానీ ఆవిడ అంతర్గతంగా అణచివేతకు వ్యతిరేకం. స్త్రీల జీవితాల్లోని కల్లోలపు పార్శ్వాలు అన్నిటినీ తడిమిచూసారు. ఒక సగటు మధ్యతరగతిఇల్లాలిపాత్ర కావచ్చు, మసకవెలుతురులో దీపస్తంభాలకు దూరంగా చీకట్లో నిలబడే కుమారి కావచ్చు, కష్టంలో ఒకలాగా తర్వాత ఇంకోలాగా ప్రవర్తించిన కిరణ్ని చూసి బెంబేలుపడ్డ డాక్టర్ వనజాక్షికావచ్చు, తనకు బిడ్డ మాత్రం చాలు వేరే బంధాలు లేకుండా అని అనుకోగలిన పరిమళ కావచ్చు, తన ఇంటికేఅంకితమైపోయి పని చేసిన అమృతం చనిపోతే, అమృతం మూడేళ్ళ చంటోడిని దగ్గరకుతీయాలంటే ఉన్న అడ్డుగోడల్ని దాటాల్సిన జానకికావచ్చు అందరివీ చూసిన కథలే, జరిగిన కథలే, జరుగుతున్న కథలే. అట్లాంటి కథలు ఏమీ లేవని కళ్ళు మూసుకుని హాయిగా కాలక్షేపం చేయడమంత నిజం ఆ కథలు ఉండటం. ఇప్పుడు ఈకథలు చదివితే ఇలాంటివి మనం చదివామే అనిపించొచ్చు కానీ ఈ కథలు సుజాత గారు తొంభైల్లో రాసారు. చాలావిషయాల్లో రెండు దశాబ్దాల తర్వాతకూడా పెద్ద మార్పేమీ వుండకపోవడమే ఆవిడ ఆలోచన పదునుకు నిదర్శనం.
ఈ పుస్తకానికి శీర్షికనిచ్చిన కథ ‘రెప్పచాటు ఉప్పెన’; కాస్త తిండిదొరికితే అన్నీఉన్నట్టే అని నమ్మి ముసలిమగణ్ణి కట్టుకున్న వరలక్ష్మి బాధనుచిత్రించిన కథను మించిన బోల్డ్ కథలు ఏముంటాయ్. బొరుసు కథలోని క్లుప్తమైన వ్యంగ్యంపు వాక్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. మిస్సెస్ గౌతమ్, చందన ఇద్దర్నీ పావులుగా చేసి మిస్టర్ గౌతమ్ ఆడిన మూడు స్తంభాలాట తక్కువది కాదు. అన్ని కథలూ చదవవలసినవే, ఆలోచింపజేసేవే. వాక్యాల్లో క్లుప్తత, అంశాల్లో గాఢత, చదువరి పట్ల అక్కర సుజాత గారి కథల్లోని మేలిమి లక్షణం. బహుశా ఈ కథల వాల్యూమ్ కథ నిలయంలో ఉన్నట్టుంది, చదవండి. ఆడవాళ్ళ కథలు అని మగవాళ్ళు పక్కన పెడతారేమో అసలు చదవవలసింది మీరే 🙂
థాంక్యూ సుజాతగారూ, ఇక్కడ ‘గారు’ అని రాసేసాను గానీ, మాట్లాడగానే అమ్మ అనే పిలవాలనిపించింది, ఇంక అంతే పిలవడం.

అణిగిన అహంకారం - శరత్



ఈ పెద్దకథను శరత్ ఫెమినిస్ట్ దృక్పథంతో మొదలుపెట్టినట్టు కనిపించినా ఇందుమతి పాత్రను మలిచిన విధానంలో ఆ పాత్ర విలువ పూర్తిగా తగ్గించారు. కథ మొదటిపేజీల్లో ఖచ్చితమైన ఆర్గ్యుమెంట్స్గా కనిపించిన మాటలు రాను రాను మొండితనంగా వితండవాదంగా కనిపిస్తాయి.
ఇందుమతి తండ్రిగారి కుటుంబం, విమల, గగన్ బాబు, అంబికా బాబు భార్య, మరీ ముఖ్యంగా నరేంద్ర; ఇందు పాత్ర, ఆ పాత్ర ప్రవర్తన పేలవంగా కనిపించడానికి వాడుకున్న పాత్రలు. ఇందు మీద చదువరికి సహనుభూతి లేకుండా చేయడంలో శరత్ చక్కగానే సఫలం అయ్యారు, టైటిల్తో మొదలుపెట్టి.
శరత్ కు ఆడవాళ్ళ నిస్సహాయత మీద, నిరంకుశ బానిసత్వం మీద జాలి వుంది. వాళ్ళ పరిస్థితి మెరుగుఅవ్వాలనే ఆశ వుంది; కానీ వాళ్ళు రొమాంటిసీజ్డ్ బానిసత్వం వదులుకోకుంటేనే గొప్పగా కనిపిస్తారు, విమల లాగా 😁
ఆయన కాలానికి ఇది సహజలక్షణంగానే నేను భావిస్తున్నాను. ఈ కథ చదివాక నాకొక లాజికల్ సమాధానం కావాల్సిందేనని వెతికాను. ఆసక్తి ఉన్నవారు ఈ పేపర్ చదవండి.
"Cultural Relativism and Femnst Discourse in Sharat" (Purkayastha, M. (2013))
In the final analysis it may be concluded that Sharat Chandra Chattopadhyay‘s vision of woman‘s liberty and her struggles for attaining selfhood was filtered through his consciousness of his own cultural, social and literary heritage in relation to the new idioms that were relentlessly influencing and shaping a creative
artist‘s imagination in that day and age.
Despite his exceptional empathy with women, his perception of an ideal‘ woman was still shaped and influenced by the prevailing feudal, patriarchal conception of woman as naturally the giver and the nurturer. While denouncing the double standards exercised by society in devaluing women, he also felt the need to represent the failure of an acquired western brand of feminism that threatened the dissolution of the family unit or the social structures, which were invested with so much of national emotions and which formed the very basis of Indian culture and tradition.
In challenging existing social biases, Sharat Chandra Chattopadhyay‘s women protagonists however could not address entrenched patriarchal values
within the social edifice. However, though they failed to emerge as role models for other women, they could at
least register strong statements of individual protest as admirably unconventional and forthright women who had the courage to think and act differently in an age and society that was conservative and delimiting.
Purkayastha, M. (2013). Cultural relativism and feminist discourse in Sharat Chandra Chattopadhyay’s fiction vis-à-vis his concepts of the worth of women. Journal of Humanities and Social Sciences, 16(2), 58-63.
May be an image of text that says 'అదిగినఅహాంకారం అణిగిన అహంకారం అణిగిన అహంకారం సాయంకాలం దాటిన తరువాత ఇందుమతి ప్రత్యేకంగా కొంచెం ముస్ాజై తన భర్త గదిలోకి ప్రవేశించి "ఏం చేస్తున్నారు?" అన్నది. నరేంద్రుడు మౌనంగా ఒక బెంగాలీ మాసపత్రిక చదువుతూ ముఖం పైకెత్తి మౌనంగా భార్యవైపు చూసి పత్రికను అరచేతిలో ఉన్నాడు. ఇందు తెరచి వున్న పేజీమీదికి దృష్టిని పరిగెత్తించి రెండు కనుబొమ్మలు ముడుచుకుని ఆశ్చర్యాన్ని వెల్లడించింది. "ఆహా! ఇక్కడ కవితను చూస్తున్నావే బాగానే వుంది. ఇది చూద్దాం... 'సరస్వతీ, స్వప్రకాష్' బహుశ అచ్చు వేయలేదనుకుంటాను?" ప్రశాంతంగా ఉన్న నరేంద్రుని దృష్టి వ్యధతో మలిన పడిపోయింది. ఇందు మళ్ళీ ప్రశ్నించింది. "స్వప్రకాష్" వెనక్కు తిప్పి పంపిందన కుంటాను?" "అక్కడకు నేను పంపించనేలేదు." "ఒకసారి ఎందుకు పంపించకూడదూ? "స్వప్రకాష్" సరస్వతి బైతన్యం గల పత్రిక. అందుకే కొంచెం నవ్వి ఇందు బాగా శ్రద్దగా చదవండి. "సరే, మీ రోజు శనివారం. నేను కూడా'
Nirmala Devi Tangella, Padmasri Dayana and 9 others
5 Comments
Like
Comment

సాహిత్యం మీకేమిచ్చింది


 

ఆకాశమే నీ హద్దురా

 మీను నువ్వు నాతో కలిసి సినిమాలు చూడవ్, ఎప్పుడూ ఆ వెధవతోనే చూస్తావ్ అని భీకరమైన కంప్లైంట్ చేస్తా ఉంటాది. అందుకని అప్పుడప్పుడు దాంతో కలిసి సినిమాలు చూసే విశ్వప్రయత్నం చేస్తుంటా. చాన్నాళ్ల తర్వాత ఓ పది రోజుల ముందు 'మిస్ ఇండియా'. ఓ పది నిమిషాల్లో టకటకా నాలుగు సుత్తి దెబ్బలు కొట్టించుకున్నాకా నా మొహం చూసి అమ్మా నీతో అయ్యేటట్టు లేదులే, ఇంకోసారి చూడు; నేనొక్కదాన్నీ చూస్తా అని నాకు ప్రాణదానం చేసింది. సినిమా అయ్యాక ఎట్లా వుంది అంటే అయిపోయింది అన్నది ఆ మహా భీకర కీర్తి ఫాన్స్యూ. నువ్వు చూడకులే అని కూడా చల్లని మాట చెప్పింది.

మళ్లీ మా వాడితో అవెంజరుల 'endgame' ప్లాన్ చెయ్యడం విని మళ్లీ మొన్నామధ్య గొణిగింది, నాతో చూడవ్ అని, మీరిద్దరూ మాత్రం మళ్లీ మళ్లీ చూస్తారు అని. సర్లే సూర్య సినిమా రిస్క్ తక్కువ కదా మహా అయితే అప్పుడప్పుడు పూనకం వచ్చి అరుస్తాడు, అరవవాళ్ళకది కామన్ అనుకుని ఒకసారి గట్టిగా శ్రీమన్నారాయణ అనుకుని మొదలెట్టామ్. మొదలు బాగానే అనిపించింది, ఆ పిల్ల కూడా మా పిల్ల లాగా వుంటాం చేత ఇద్దరికీ ఇంస్టాంట్ గా నచ్చేసింది వాగుడుతో సహా. కాకుంటే మొట్ట మొదటి సూర్య భీకర నృత్య ప్రదర్శన తదనంతర అరివీర భీకర డవిలాగు వినగానే ఏందమ్మా సెంటిమెంటుతో సమ్పిపూడిసేలాగా వుండాడుగా అంటూనే మెడ అనుకూలంగా చాపేసి కూర్చున్నా. ఇక వేటు మీద వేటు. ఏం చేస్తాం.
ఆ కారికేచర్ పాత్రల్ని పొత్రాల్లాగా వాడి చూసేవాళ్ళని రుబ్బేయడం మాత్రం అన్నేలం 😭 వీళ్ళ సెంటిమెంటు సంతకెళ్లా, మరీ ఇంత డ్రామానా సీను సీనుకీ. సినిమా మధ్యలోకి కాదు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సన్ట్ అయిపోయినా ఇంకా ఓ కొలిక్కి రాకుండా పాడిందే పాటరా అంటే తిక్కరాక ఏం చేస్తాది. నా లెక్క సింపుల్ సినిమా మొదలుపెట్టాక ఎప్పుడు ఆయుపోతుంది అని మిగిలిన టైమ్ చూస్తా కూర్చున్నామంటే ఇంక అంతే. నిండా ముంచేసినట్టు.
మంచి విషయాలు లేవా అంటే ఎందుకు వుండవు, బోలెడు. అసలు కథ ప్లాట్ చాలు, ఆ హీరోయిన్ చాలు (ఏ మాటకామాట మొదలు పెట్టినప్పుడు ఉన్నంత హై రేంజిలో కంటిన్యూ చెయ్యలా, మరీ హీరోకి పోటీ వస్తాదనేమో!), హీరో చనాసేపు నేలమీద నడిచే మనిషి కావడం చాలు, హీరో ఐయినా కొన్నిసార్లు ఓడిపోవడం చాలు. కానీ, వీటిల్లో దేనినీ లాభంగా మల్చుకున్నట్టు కనపళ్ళా అదే గోల. ఆ చివరి ఫ్లైట్ బయల్దేరితే శివయ్యకు కొబ్బరికాయ కొడతా అనుకున్నాక కూడా ఏదో మతలబుతో దాన్ని నేలమీదే ఉంచడం నాకు సరింగా అనిపించలే. పోన్లే ఒక మంచి వ్యాపార కథ అందరు జనాలకీ తెలిసింది అనీ అనుకోలేం వచ్చింది ఓటిటిలో కాబట్టి, ఇది నిజంగా థియేటర్ కి సరిపొయ్యే కథ. పాపమ్ సూర్య, సుధ కొంగర.
మళ్ళా మా గోలకొస్తే మా మీనమ్మాయి తెలుగమ్మాయి, వాళ్ళ నాన్న అరవబుద్ధి కూడా కొంచెం కలిసినట్టుంది. ఎంత సెంటిమెంటునైనా అవలీలగా జీర్ణించుకుంటుంది. ఈ సినిమా చివరికి వచ్చాక కూడా పో అమ్మా!! ఈ సీన్లో అసలైతే ఏడవాలి నీతో చూస్తుంటే నవ్వొస్తుంది అని చాలా విచారం వ్యక్తం చేసింది. అప్పుడు కలిగింది నాకు రియలైజేషన్. మా వాడూ నేను రాయి రప్పా, ఇవేవీ పడవ్. అందుకే మా టీం బ్రహ్మాండంగా సెట్ అయినట్టుంది. వాడు మరీ నిమిత్తమాత్రుడు. నేను ఐరన్ మాన్ చచ్చిపోయాడు అని పదే పదే గొణుగుతుంటే అమ్మా ఐరన్ మాన్ ని ఎందుకు చంపారో తెల్సు కదా అని నాకు బోధ చేస్తాడు. నిజ్జంగా it's a range of parenting 🙄🤦🤷

ఓ 'నీల' కథ



చోళదిబ్బ నుంచి హైదరాబాద్ దాకా వొక ఇరవైఏళ్ల ప్రయాణం చేసింది నీల. జీవితంలో ప్రేమ స్థానం ఏమిటి, స్వేచ్ఛకు అర్థం ఏమిటి అన్న విషయాల్లో తనవైన ఎదుగుతున్న నిర్వచనాలు ఇచ్చుకుంది. నీల ప్రస్థానం పొడవునా అంతకింత ఎదుగుతూనే ఉన్నా ఇరవైఏళ్ల పిల్లగా వున్నప్పుడు చూపించిన స్థైర్యం, తన చుట్టూ ఉన్న మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఉన్న పరిణితి నన్ను ఆశ్చర్యపోయేలా చేసింది. అటుతర్వాత తను ఏమి చేసినా అలా చూస్తూ పోవడమే తప్ప, షాక్ కి గురి చెయ్యదు.
జీవితంలోని చిన్న చిన్న ఆనందాల్ని పొగుచేసుకోవడంలో తనకి ఉన్న ఆసక్తి వేరు విషయాల్లో తక్కువే. 'వనవాసి' లాగా ప్రకృతిని ఆరాధించడం మాటల్లో తెలియకపోయినా, ఓపెన్ స్పేసేస్ లో తప్ప గాలాడాని నీల, సముద్రాన్ని అప్పగా చేసుకున్న పైడితల్లిని ప్రేమించిన నీల జీవితంలో, ప్రకృతి ఓ సహజాతం అంతే.
అతి తీవ్రమైన సమ్మెటపోట్లు వేస్తూనే వున్నా, జీవితానికి నీల మీద కొంత దయ ఉందా!? సరైన మనుషులు తన జీవితంలో ప్రతీ మలుపులో తారసపడుతుండటం, 'నేను మంచి బతుకుకి, గొప్ప ప్రేమకి డిజర్వ్ అయి ఉన్నాను' అన్న నీల నమ్మకానికి జీవితం ఇచ్చిన జవాబా!! సూర్యం, ఆరంజ్యోతి, పాస్టరమ్మా, పాస్టర్ మామయ్య, వసుంధర, లలిత, సంపూర్ణ, అజిత, నీతాబాయి అందరికన్నా ముఖ్యంగా 'మినో'; జీవితం అందరికీ గుండుగుత్తగా ప్రసాదించే మనుషులేనా!? కానీ ఓ చిత్రం వుంది. వీళ్ళల్లో ఎక్కువమంది జీవితంలో మిగిలిన వారితో వ్యవహరించేతీరు కాస్త వేరే; సూర్యం, వసుంధరల లాగా మనుషుల్ని ప్రేమించడానికి మనిషి కావడం తప్ప వేరే కారణం అక్కర్లేని వాళ్ళు ఎక్స్ప్షన్స్. కానీ, మిగిలిన వాళ్ళు ఈ అమ్మాయిని అంత దగ్గర చేర్చుకోవడానికి కారణం, తనలో వెలుగుతున్న ఓ గొప్ప జీవితేచ్ఛ వుండబట్టేనేమో!!
ప్రసాద్ బలవంతంగా నీల జీవితంలోకి చొచ్చుకు వచ్చిన తోడు, తోడు కాలేకపోయిన తోడు. పరదేశి తొలియవ్వనంలో పుట్టేటంత గాఢమైన ప్రేమని పట్టుకొచ్చినా తోడుగా నిలవలేకపోయిన తోడు, తనకి సరైన కారణాలున్నా. సదాశివ తన ఆలోచనలతో కూడా చిన్న సర్దుబాట్లు చేసుకుని నీలని నిలుపుకున్నాడు, నీల అచ్చంగా ప్రేమించి సదాశివని నిలుపుకుంది. ఈ రిలేషన్స్ బాక్డ్రాప్ లో నడిచిన అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాల్ని పరిశీలనగా చూస్తూ నీల నేర్చుకున్న తీరు ఈ అతి పెద్ద నవలికని ఒక చక్కటి నవలగా మార్చింది.
నాకు కంప్లైంట్లు ఉంటాయని జాజిమల్లెమ్మకి ప్రగాఢ నమ్మకం ఉండటం చేత మాత్రమే కాదు ఈ పేరా 😁 నీలని లోపాల్లేకుండా ఏమీ తయారుచేయలేదు, అది గొప్ప విజయమే, దాంతోనే ఆ అమ్మాయి రక్తమాంసాలతో నిలబడింది బహుశా. నీలమ్మ బాగా చదువుకుని పెద్ద ఆఫీసరు కావాలన్న చంద్రకళ కోరిక నీలను కష్టాల్లో ఉన్నన్నాళ్లు ముందుకి తీసుకెళ్లింది. జీవితంలో కాస్త కుదురుకున్నాక ఎందుకు వదిలిపెట్టింది అంత గాఢమైన కోరికను!! ఇది అసంతృప్తిని మిగిల్చేదే. చదువునూ కొనసాగించలేదు, ఉద్యోగంలో ఎదుగుదల కోసమూ గట్టి ప్రయత్నం చేసినట్లు లేదు. ఇక్కడ నేనేమీ సినిమాటిక్ ఎదుగుదల కోరట్లేదు, కానీ కొంత కొరవ ఉంది. డిగ్రీల చదువును సమాజాన్ని చదవడానికి షిఫ్ట్ చేసుకుందనుకున్నా పూర్తిగా అంగీరించలేకున్నా.
లోకంలో తన వయసు పిల్లలందరికన్నా చాలా ముందే తన నేర్చుకోవడం మొదలైంది. కానీ ఆచరణలో కాస్త ఎక్కువ తడబాటుతోనే వుంది. భద్ర జీవితాల్లో పెరిగిన సదాశివ లాంటి వాళ్లతో పోల్చకుండానే ఈ మాట చెప్తున్నా, అజిత తక్కువ చూడలేదు జీవితంలో; తను తన జీవితంతో ఎలా డీల్ చెయ్యాలో, సమాజానికి ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో పూర్తి స్పష్టతతో కనిపించిన పాత్ర. సంపూర్ణ ఇంకా ఎక్కువ జవసత్వాలు ఉన్న పాత్ర. వీళ్ళ ముందు నీల కొంచెం తక్కువ బరువుతో నాకు కనిపించడం నా అభిప్రాయమే. జడ్జిమెంటల్ గా వుండొద్దనుకుంటూనే అలా ఉన్నానని తెలుసుకునే, అలా ఉండటాన్ని జయించలేకపోయింది. తీర్పులు చెప్పే తప్పు చేయొద్దని చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఒక రకంగా తన ఆలోచన తొందరగా బయటకు చెప్పకపోవడంవల్ల పరదేశి జీవితం నుంచి ప్రేమను ఒక్కసారిగా లాగిపారేసింది. పరదేశి పాత్ర మీద మొదట్నుంచీ నాకు కాస్త సహానుభూతి తక్కువే ఉన్నా (మరీ ఆరడుగుల రాజశేఖరం కావడం వల్ల 😁) నీల పరదేశికి చేసిన అన్యాయంతో చాలా పాపం అనిపించింది. అంత ప్రేమించిన మనిషిని మహా కష్టపెట్టినందుకు.
కానీ ఇందులో ఏవీ నీలను ప్రేమించకుండా ఆపవు. ఆ అమ్మాయి అతి చిన్నతనపు జీవితంలో చూసిన దానికి, అనుభవించినదానికి, వదులుకున్నదానికి తనకు నిజంగా ఇంకా బోలెడు దక్కవలసి ఉంది; మినో, సదాశివ, పాస్టరమ్మ నుంచే కాదు, ఈ లోకం నుంచి కూడా.
కవయిత్రి నవలను రాస్తే ఇలా వుంటుంది అనేటన్ని అందమైన వాక్యాలు. "అది ఎలా వుంటుందో చెప్పలేము" అని ఆవిడ ఒక్కసారీ అనరు. ఎంత చక్కని వర్ణనలు అవసరమైన ప్రతీచోట. కళ్ళకు కట్టే కథనం. అలాంటి వాక్యాలు పట్టి తేవాలంటే హీనపక్షం పేజీకి ఒకటి చొప్పున కనీసం 547 మాట్లు ఎత్తిరాయాలి. ఈ మాటలకు ఇంకాస్త ఇష్టమయ్యారు మీరు మల్లీశ్వరి గారూ. చదువుతూ మధ్యలో బోలెడుసార్లు మీకు మెసేజ్ చేయాలనుకున్న ఆరాటాన్ని చదవడంలోకి తిప్పుకున్నా. ఈ మాటలు మీ 'నీల' కు ఇష్టంగా రాసుకున్న ప్రేమలేఖ.
ఇంక 'మినో' కథ మొదలుకావడమే ఒక ఉన్నతమైన, విశాలమైన ప్లేన్ లో మొదలైంది. ఆ అమ్మాయి కథ చెప్తే ఓ గాథకు తక్కువుండదేమో.
నీల సముద్రం మీద కూడా ఒక "చెరగని సంతకం"

నా హాలీవుడ్ డైరీ - శ్రీదేవి మురళీధర్




సాహిత్యం మన ఊహలకు రెక్కలు తొడిగితే సినిమా మనల్ని ఒక విమానంలో కూచోబెట్టేసి రాచమర్యాదలు చేస్తూ ఆ లోకాల్లో చాలా దగ్గరగా చూపిస్తూ తిప్పుకొస్తుంది. అన్నిసార్లూ ఆ విహంగ వీక్షణం నచ్చాలని లేదు, ఎన్నోసార్లు బోలెడు అద్భుతాల్ని కళ్ళముందు ఉంచుతుంది ఆట్టే ఊహతో పని లేకుండా. అట్లాంటి అద్భుతాల్లో ఒక యాభై ఐదింటిని గుదిగుచ్చి "ద కిడ్" తో మొదలెట్టి "సైకో" తో ముగిస్తూ ఈ మాల కట్టారు శ్రీదేవి గారు. పుస్తకం చేతికి రాగానే ముందు చేసింది లెక్క వేసుకోవడమే, పాతిక చూసిన సినిమాలు ఇంకో ముప్పై చూడాలి 😁
1931 నుంచి 1993 మధ్యలో వచ్చిన సినిమాలు ఇవన్నీ. ఎక్కువ సినిమాలు మాత్రం ముప్పై, నలభైల నుంచే. AFI లిస్టింగ్, BFI లాంటి లిస్టింగ్ లు, ర్యాంకింగ్ లు కాకుండా తాను చూసిన వందల వేల సినిమాల్లోంచి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు నిర్మించిన వాటిల్లో క్లాసిక్స్గా నిలిచిపోయిన యాభై అయిదు సినిమాలను ఈ పుస్తకం కోసం ఎంచుకున్నారు. టైటిల్ కింద కనీ కనపడకుండా మొదటి భాగం అని రాసిన సబ్ టైటిల్ నాకు ఇంకా నచ్చింది 🙂 నిజానికి ఇందులో కొన్ని వ్యాసాలు ముందు ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించినవేనట.
పుస్తకం విషయానికొస్తే, ఇవి సినిమాల కథా పరిచయాలు మాత్రమే కావు. చిత్ర నిర్మాణ విశేషాలున్నాయి; కథా నేపథ్యాలున్నాయి (చాలాసార్లు కథకు ముందు వెనుక ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్దపు నేపధ్య కథలన్నిటికీ బోలెడన్ని అవసరమైన విశేషాలను సేకరించి కలిపి రాసారు); తెరమీది కనిపించే బొమ్మల్లోని తారల వెనుక కథలు, వారు పాత్ర పోషణ కోసం పడే తాపత్రయాలు, వారి జిలుగుల వెనుక మసకలు, ఎదుగుదలలు, గొప్ప వ్యక్తిత్వాలు, కనపడని క్రీనీడలు ; హాలీవుడ్ ప్రపంచపు ఆదరణ, అనాదరణల కత్తిమీది సాము; సినిమా 24 కళల సమాహారం అనే అన్ని కళల మీద సాధ్యమైనంత సాధికారపు సమాచారం, దిగ్దర్శకుల ఉత్థానపతనాలు, వారు చెయ్యి వేసిన సినిమాలు అంతటి క్లాసిక్స్ ఎందుకు అయ్యాయి అన్న పరిశోధనాత్మక పరిశీలన; నిర్మాణ సంస్థల ప్రొఫెషనలిజం, సినిమా లోని అన్ని క్రాఫ్ట్స్ మీది సాధికారత, కనపడని పెత్తందారీతనం ఇట్లా శ్రీదేవి గారు వ్యాఖ్యానించని అంశం లేదు. కానీ, ముచ్చటైన విషయం ఏంటంటే గొప్ప రీడబిలిటీ. ఎన్ని విశేషాలు చెప్తున్నా హాయిగా చదివెయ్యగలం. కాఫీ టేబుల్ ఎడిషన్ అంత అందంగా వేశారు, కానీ బ్రహ్మాండమైన ఎడిషన్ పర్సనల్ లైబ్రరీలకు. ఇక్కడొక ఇంకొక మాట శ్రీదేవి గారికి పుస్తకాల మీద మామూలు ప్రేమ కాదు. ఏ పుస్తకాన్నీ మేటర్ అయ్యింది కదా అని వేసేయ్యరు. ఎంత నాణ్యమైన పుస్తకాలో నేను చదివినవీ చూసినవీ అన్నీ.
ప్రతీ సినిమా పోస్టర్తో మొదలయ్యి చిన్నగా కథలోని అతి ముఖ్యమైన సంగతులు, వెనుక సంగతులు చూసేసి, కథని సంగ్రహంగా చూపించి అప్పుడు చూపిస్తారు సినిమాలోని బోలెడు బొమ్మలు. ఎన్ని మంచి క్లిప్స్ సేకరించారో ప్రతీ సినిమాకు, వాటి వెనుక ఆ సినిమాల గురించి తెలుసుకోదగిన వివరాలన్నీ. శ్రీదేవి గారి ప్రత్యేకమైన ప్రేమలు (నటులు, దర్శకులు, జాన్ర) చెప్పకపోయినా పుస్తకం మొత్తం పూర్తయ్యేసరికి మనకే తెలిసిపోతాయ్ 🙂 ఎంచక్కటి తెలుగు. కొన్నిచోట్ల ఒరిజినల్ సంభాషణలు ఇచ్చాక దాన్ని తెలుగు చేస్తూ ప్రతి పదానికి వీలైనంత సమానార్థకపు తెలుగు మాటనే వాడారు. ఉద్దండులు లాంటి చాలా మాటలు చదివి నేను బోలెడు సంబరపడ్డాను.
ఇప్పుడు OTT ల కాలంలో అన్ని సినిమాలు, సినిమా వెంట సినిమా బింజ్ వాచ్ చేసేస్తాం, పుస్తకం పనేమిటి అని అడిగేవాళ్ల కోసం కాదు ఈ పుస్తకం. సినిమా మీద ఇష్టం వుండి మంచి సినిమాతో కొంత ప్రయాణించాలనుకునేవారు మిస్ కాకూడని పుస్తకం. పిల్లల సినిమాల నుంచి సైకో థ్రిల్లర్ సినిమాల దాకా అన్నీ ఉన్నాయి. ఇది వ్యక్తిగతమైన సెలెక్షన్ కాబట్టి ఇంకా బోలెడు గొప్ప చిత్రాలు మిగిలే ఉన్నాయి కనీసం ఇంకో రెండు డైరీలకు. ప్రపంచ సినిమాలోకి వెళ్తే ఇంకెన్నో. నేను ఎదురుచూస్తాను శ్రీదేవి గారూ 😉
ఇంత మంచి పుస్తకాన్ని అన్నిరకాలుగా నాణ్యంగా తెచ్చినందుకు
అభినందనలు
శ్రీదేవి గారూ. ఈ పుస్తకాన్ని గొప్ప సినిమా మనిషి సింగీతం గారికి అంకితం ఇవ్వడం ఇంకా ప్రేమించే విషయం.
ఈ పుస్తకం శ్రీదేవి గారి దగ్గర దొరుకుతుంది ప్రస్తుతానికి. ధర 550 రూపాయలు, పోస్టేజ్ తో సహా. GooglePay/PhonePay వివరాలు
98490 12166, Muralidhar.
పుస్తకం చదివాక అస్సలు ఎక్కువ కాదని మీరే అంటారు. సినిమాని ప్రేమించే వాళ్లయితే తప్పక కొని చదవండి. మీకు సినిమా మీద పెద్ద ఇష్టం లేకున్నా ఎవరన్నా సినిమా పిచ్చి ఫ్రెండ్స్ ఉన్నా ఇంతకుమించి మంచి బర్త్డే గిఫ్ట్ వుండదు మరి 😊 కంటెంట్స్ పేజీలో ఒకటి పెట్టా మిగిలినవి ఇంకా గొప్పవి

Year 2020 in Books and Movies

 ఈ సంవత్సరం అందరూ ఎప్పటికన్నా ఎక్కువ పుస్తకాలు, వందలకొద్దీ సినిమాలు చూసినట్టున్నారు. నావి రాశి పరంగా చాలా తగ్గేసాయి, నా పనిలో మార్పుల వల్ల. వాసిలో ఏ లోటు లేకపోవడమే ఇప్పటి సంతోషం. పుస్తకాల్లో తెలుగు పుస్తకాలు అన్న పంతం ఈ సంవత్సరం కూడా నిలుపుకున్నా కనీసం పూర్తి చేయడంలో. ఈ యేడాది చదివిన పుస్తకాల్లో చికాకు పెట్టినవి పెద్దగా లేనట్టే. కనీసం ఇరవై శాతం ఇంకొక్కసారన్నా చదవాల్సినవి. కొన్ని పుస్తకాలు బాగా వెతుక్కుని చదివినవి, ఇంకొన్ని అంచనాలు లేకుండా మొదలుపెట్టినా చక్కగా ముగిసినవి.

సినిమాలు మాత్రమ్ ఇంకాస్త ఏరుకుని చూసినవి. హాలీవుడ్ లో మొదలైనా చివరికి వచ్చేకల్లా ఓజు నామ సంవత్సరం. మళ్లీ చూసినవే ఎక్కువ కాబట్టి పెద్ద ఇబ్బంది పెట్టనివే అన్నీ. పోయిన సంవత్సరం లాగా అన్నీ పోస్టుల లింకులు కూడా కలిపి, పోస్టులు లేనివాటికి ఒక రెండు మాటలు కలిపి రాయాలనే అనుకున్నా కానీ ఇక ఈ యేడాదికి చేయలేను అట్లా రాయాలంటే. పనులు ఒక కొలిక్కి వచ్చాక చేసుకోవాలి నా ఫైలింగ్ కోసమన్నా.

పుస్తకాలు 2020
• కుముదిని - రవీంద్రనాథ్ టాగోర్
• గోడ ఇతర కథలు (సౌత్ ఆసియన్ కథలు) - అనువాదం - స్వాతి శ్రీపాద
• చిగురాకుల రెపరెపలు - మన్నెం శారద
• అనుక్షణికం - వడ్డెర చండీదాస్
• బుజ్జిగాడు - చలం
• అనగనగా ఒక చిత్రకారుడు - అన్వర్
• చిత్రకన్ను - నందిని సిధారెడ్డి
• వెలుగుదారుల్లో - నంబూరి పరిపూర్ణ
• సిరా - రాజ్ మాదిరాజు
• చీకట్లోంచి చీకట్లోకి - వడ్డెర చండీదాస్
• ఆ నేల, ఆ నీరు, ఆ గాలి - వేలూరి వెంకటేశ్వరరావు
• తేరా నామ్ ఏక్ సహారా - నరేష్ నున్నా
• మధుపం - పూడూరి రాజిరెడ్డి
• బతుకుపుస్తకం - ఉప్పల లక్ష్మణరావు
• విరాట్ - స్తెఫాన్ త్స్వైక్ - పొనుగోటి కృష్ణారెడ్డి
• ఆనందోబ్రహ్మ - యండమూరి వీరేంద్రనాథ్
• మైనా - శీలా వీర్రాజు
• విషాద కామరూప - ఇందిరా గోస్వామి - గంగిశెట్టి లక్ష్మీనారాయణ
• పర్వ - ఎస్ ఎల్ భైరప్ప
• చెంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి
• మాధవి - అనుపమా నిరంజన - కళ్యాణి నీలారంబం
• పడవ మునక - రవీంద్రనాథ్ టాగోర్ - కమలాసనుడు
• జీవితానికో సాఫ్టువేర్ - కే. ఎన్. మల్లీశ్వరి
• అంశుమతి - అడవి బాపిరాజు
• లీడర్ - బలభద్రపాత్రుని రమణి
• మరల సేద్యానికి - శివరాం కారంత - తిరుమల రామచంద్రుడు
• కొన్ని సమయాల్లో కొందరు మనుష్యులు - జయకాంతన్ - మాలతీచందూర్
• ఛానెల్ 24x7 - చేబ్రోలు సుజాత
• రెప్పచాటుఉప్పెన - చేబ్రోలు సుజాత
నా హాలీవుడ్ డైరీ - శ్రీదేవీ మురళీధర్
• A study in scarlet - Sir Arthur Conan Doyle
• ఇట్లసుత - వరిగొండ కాంతారావు
• నల్లగొండ కథలు - మల్లికార్జున్

సినిమాలు 2020
1. The two popes
2. Shutter Island
3. Gaslight
4. Seven years itch
5. Marriage story
6. Ferris Bueller's day out
7. Roma
8. The big short
9. Her
10. Parasite
11. Pulpfiction
12. Knives out
13. Green book
14. The Great escape
15. Mr. Deeds goes to town
16. Papillon
17. 1917
18. Contagion
19. Ben-Hur
20. Ten commandments
21. Still walking (Japanese)
22. సమ్మోహనం
23. Tokyo story (Japanese, Ozu)
24. The call of the wild
25. Gone with the wind
26. Sanju
27. White Fang
28. Rope
29. Spellbound (Hitchcock)
30. When Marnie was there (Japanese)
31. A trip to the Moon
32. My neighbor Totoro (Japanese)
33. Spirited Away (Japanese)
34. Shall we dance
35. The tale of princess Kaguya (Japanese)
36. Princess Mononoke (Japanese)
37. Thappad
38. Arrietty (Japanese)
39. Jojo Rabbit
40. Stepmom
41. The ballad of Narayama (Japanese)
42. Inside Out
43. Paakeezah
44. The agony and the ecstasy
45. Coco
46. Kathanayakudu
47. Cleopatra
48. Your name (Japanese)
49. Darkest hour
50. The founder
51. Breakfast at Tiffany's
52. పెళ్లి చేసి చూడు
53. షావుకారు
54. The imitation Game
55. Moby Dick
56. కన్యాశుల్కం
57. Zootopia
58. Brave
59. Ralph breaks the Interne hit
60. సూఫీయుమ్ సుజాతయుమ్ (మళయాళం)
61. అయ్యప్పన్ కోశియుమ్ (మళయాళం)
62. డ్రైవింగ్ లైసెన్స్ (మళయాళం)
63. Breaking Away
64. Tommorowland
65. Around the world in 80 days
66. Greyhound
67. Ford vs. Ferrari
68. Shakuntala Devi
69. ఉమామహేశ్వరస్య ఉగ్రరూపస్య
70. Once upon a time in Anatolia
71. Koode (Malayalam)
72. The Secret Garden
73. Ohm Shanthi Oshana (Malayalam)
74. Premam (Malayalam)
75. Forrest Gump
76. Ustad Hotel (Malayalam)
77. Thondimuthalum Driksakshiyum
78. Trance ( Malayalam)
79. C U soon (Malayalam)
80. Ratatouille
81. Incendies (Canadian)
82. What's eating Gilbert Grape
83. How green was my valley (1941)
84. Vertigo
85. The spirit of the beehive
86. The theory of everything
87. Late Spring (Japanese, Ozu)
88. గ్యాంగ్ లీడర్ (నాని)
89. Early Summer (Japanese, Ozu)
90. An autumn afternoon (Japanese, Ozu)
91. There was a father (Japanese, Ozu)
92. Floating weeds (Japanese, Ozu)
93. An Inn in Tokyo (Japanese, Ozu)
94. కాదంబరి (బెంగాలీ)
95. Inji Iduppazhagi (Tamil)
96. Early Summer (Japanese, Ozu)
97. A Beautiful Mind
98. Putham Pudhu Kaalai (Tamil)
99. Enola Holmes
100. ఆకాశమే హద్దురా (Tamil)
101. Eat Pray Love
102. Sleepless in Seattle
103. Ludo
104. అమ్మోరు తల్లి (ముక్కుపుడక అమ్మవారు)
105. మిడిల్ క్లాస్ మెలోడీస్ (తెలుగు)
106. Mary Poppins
107. Notorious
108. మల్లేశం
109. నీది నాది ఒకే కథ
110. ఈ నగరానికి ఏమయింది
111. Mary Antoinette
112. Cape fear

Series
1. Mind hunter (season 1 and 2)
2. Money Heist (season 1,2)
3. Queen web series (season 1)
4. The crown (season 1, 2 , 3 and 4)
5. Anne with an "e" (season 1, 2 and 3)
6. A suitable boy
7. Stories by Ravindranath Tagore
8. Emily in Paris (season 1)

సుప్తభుజంగాలు

 


దొరకదనే అనుకున్నా ఈ పుస్తకం సుజాత గారి కథలు చదివినప్పటినుంచి చదవాలని ఉంది. అనుకోకుండా అమ్మ దగ్గర కనిపించింది తాతయ్య కలెక్షన్లోని పుస్తకం

💖. కొంచెం రిపేర్లు చేసి ఇవ్వాళ్లే చదివా, ఇంకాస్త బాగు చెయ్యాలి పుస్తకం కొన్నాళ్ళు వుండాలంటే.
సుజాత గారంటే 'సుప్తభుజంగాలు' ఎందుకు గుర్తోస్తుందో చదవగానే తెలిసింది. ఇష్టపడే సిద్ధాంతాలను నమ్మకంగా చక్కని కథ చేసి రాసారు. రీడబిలిటీ సహజగుణమైన రచయిత్రి, ఇంకోమాట లేదు, ఒకే సిట్టింగ్ లో పూర్తి చేసా.
ఈ యేడాది మొదలు

హమ్_suffer

 పాకిస్తానీ డ్రామాలను గంపగుత్తగానూ, #హమ్_suffer ని స్పెసిఫిక్ గానూ రికమెండ్ చేసినవాళ్ళంతా ఒకసారి ఇట్లా వచ్చి గోడ మీద నిలబడండమ్మా

😪😫😤 పన్నెండు పదమూడు పోనీ పదిహేనో ఎపిసోడ్లో అన్నా తేల్చిపారేయ్యక 23 ఎపిసోడ్లు సంపాలా, సరే మనోళ్లంత టాలెంట్ లెనోళ్లే 500 ఎట్లాగో తియ్యలేరు; అప్పుడు టకటకా పూర్తి చెయ్యొచ్చు కదా🤦 అంతమంది ఏడుస్తుంటే మనం కూడా ఏడిస్తే ఎట్లా అని ఆగడమే, #రక్త_కన్నీరు.
నీ మొఖానికి ఏం నచ్చుతాయ్ అనకండి, పదిహేనో ఎపిసోడ్లో ఆపిఉంటే బ్రహ్మాండంగా నచ్చేది. ఈ డ్రామాలు తట్టుకునే నరాలు తెగిపోయినట్టున్నాయ్ నాకు, పాపమ్ #నేను 😭😭😭
May be an image of 2 people, hair, people standing and outerwear
Shailaja Somaraju, Padmakar Daggumati and 63 others
22 Comments
Like
Comment
Share