Monday, May 23, 2022

విషాద కామరూప

 అస్సాం లోని కామరూప జిల్లాలో జగాలియా నది దక్షిణ తీరాన ఉన్న ఒకానొక ‘సత్త్రా’ ఆమ్రోంగా కథ ఇది. అస్సాం ని వైదిక కాలపు గ్రంధాలలో కామరూప అనడం మనకు తెలిసిన విషయమే. మనకు ఇందిరా గోస్వామి గా తెలిసిన 'మమోనిరైసామ్ గోస్వామి' మనకు పెద్దగా పరిచయం లేని ఈశాన్య భారతాన్ని ఈ నూట పాతికేళ్ళ చరిత్ర శకలంలోనుంచి చూపించారు. కథ లోని ప్రముఖ భాగం దేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం లోపలి కథ. అల్లుకోవడం కథగా అయినా మొత్తం రచయిత్రి కుటుంబంలో తరాల కిందట నిజంగా జరిగిన విషయాల సమాహారమే. అయినప్పటికీ, కేవలం ఒక కుటుంబ కథగానో, ఒక జమిందారీ ప్రాభవపు క్షీణదశ రికార్డుగానో కాకుండా ఆ కాలపు అస్సాం జీవిత వైచిత్రిని, రకరకాల మనుషుల్ని, మనస్తత్వాలని ముఖ్యంగా ఈ విషాదంలో అతి విషాదాన్ని పంచుకున్న స్త్రీల స్తితిగతుల్ని అత్యంత ప్రతిభావంతంగా చూపించారు రచయిత్రి. ‘ఊనే ఖోవా హౌదా’ అని ఒకానొక కామరూప మాండలికంలో రాసిన ఈ కథను బయటి ప్రపంచానికి అందించడం కోసం ఇందిరా గోస్వామి స్వయంగా “ఎ సాగా ఆఫ్ సౌత్ కామరూప’ గా తర్జుమా చేసారు. ఇక గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి తెలుగు అనువాదం అచ్చు తెలుగు పుస్తకమంత చక్కని అనువాదం. ఈ పుస్తకానికి సంబంధించి ఈ మాట రాయడం కష్టమైన విషయమే. ఎంచేతనంటే, మూల రచన లోని సాంస్కృతిక, ప్రకృతి విశేషాలను ఆ మాటల్లోనే పరిచయం చేసినందున తెలియని పదాలు లెక్కకు మిక్కిలిగానే ఉన్నాయి. కానీ, కథలో కలిసిపోయేలా ఆ పదాల్లోని అర్థాన్ని వివరిస్తూ అనువాదకులు ఒక సఫలీకృతమైన ప్రయత్నాన్ని చేసారు.

కథలోకి వస్తే, ఇంద్రనాథ్ ఆ ‘సత్త్రా’ కి ఉత్తరాధికారి. గమనింపు, ఆలోచన ఎక్కువే కానీ ఆచరణ పెద్దగా కనిపించదు, తండ్రి చాటు మనిషే; తండ్రి చెప్పిందే చేయడం. పేరుకి సత్త్రా కి అధికారులే, స్వాతంత్ర్యానంతరం రాబోతున్న సీలింగ్ చట్టాల నీడ, దూరాన ఉన్న ఊళ్ళలోని పొలాల్లోకి వచ్చేసిన ఎర్ర జెండాల రెపరెపలు, తగ్గుతున్న జమీందారీ ప్రభావం అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. తల్లి గోసాయినీ, పినతల్లి చిన్న గోసాయినీ, మేనత్త దుర్గ, చెల్లెలు గిరి బాల ఇంకా ఎలిమన్ ఇంద్రనాథ్ జీవితంలో తక్కిన మనుషులు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ ఎక్కువ విషాదమే. అన్నిటికీ మూలం మాత్రం వాళ్ళు ఆడవాళ్ళు కావడం, మరీ ముఖ్యంగా కుటుంబ గౌరవాన్ని కాపాడవలసిన ఆడవాళ్ళు కావడం.
తల్లి పాత సంప్రదాయాల్ని నిక్కచ్చిగా పాటించే మనిషి, మనుషుల పట్ల కొంత నెనరు ఉన్నా ఆమె హోదా అది ఎవరికీ కనపడనివ్వదు. తమ జమీందారీ పద్ధతుల్ని పాటించడంలోనే ఆమె సమయం గడవడం. భర్త సత్త్రా మొత్తానికి అధికారి, తన ప్రజలందరికీ ఏనుగు అంబారీలో ఎక్కి వెళ్లి మరీ దర్శనం అనుగ్రహించి శిష్యులు ఇచ్చేకానుకలు గ్రహించక తప్పదు మరి, రాశిలో తగ్గుతున్నా. ఇంక ఆయన ఇంటి పట్టున ఉండి పనులు చక్కబెట్టుకోవాలనుకోవడం ఆమెకు చెల్లదు.
దుర్గది ఇంకో కథ. తనూ చికార్ హాతి సత్ర్రా అధికారిణియే భర్త పోయేదాకా. భర్త పోయాక ఓ సారి ఏనుగుల బేరానికి వాళ్ళ ఊరికి వచ్చిన ఇంద్రనాథ్ కృషిన్చినట్లున్న దుర్గ ను కొన్నాళ్ళ కోసం ఆమ్రోంగా తీసుకు వస్తాడు. “యాత్ర’ అయ్యాక తనకోసం మామగారు పంపుతానన్న పల్లకీ ఎప్పటికీ రాదు. అక్కడే వుండి తన పాలు ఆస్థిని తెచ్చుకోకుండా ఇక్కడ శాశ్వతంగా ఉండిపోయిన దుర్గకి పెద్ద గౌరవం ఏమీ లేదు ఇక్కడా. జగన్నాథుని దర్శనం చేయించే పండాలతో పాటు ఒకసారి జగన్నాథ్ యాత్ర చేసి కాశీలో తన భర్త అస్థికలు కలపడమే ఆ ప్రాంతపు వితంతువులందరిలాగా దుర్గ కోరిక కూడా. పెద్ద గోసాయినీ ఆ యాత్రకు డబ్బు మాత్రం రాలనివ్వదు. ఆ ఒక్క యాత్ర కోసం ఎదురుచూస్తూ దుర్గ. చివరి ఆశగా మిగిలిన తన నగల్ని కూడా ఒక నమ్మకద్రోహానికి పోగొట్టుకుని ఇంక ఏ ఆశా మిగలక చిక్కి శల్యమై, క్షయ పాలయ్యి, తాను ఆస్పత్రి లో చేరుస్తానన్నా వినక, చికార్ హతి నుంచి పల్లకీ రాకున్నా తన భర్త ఊరిలోనే సమాధి కావాలని బయల్దేరిన దుర్గ ఇంద్రనాథ్ కళ్ళముందు నుంచి చాన్నాళ్ళ దాకా మెదులుతూనే ఉంటుంది.
గిరిబాల ఇంద్రనాథ్ చెల్లెలు. ఆడపిల్ల రజస్వల అయ్యేలోగానే పెళ్లి చెయ్యాలన్న ఆచారం వల్ల సరైన వరుడి కోసం వెతక్కుండా అంతస్థు మాత్రం చూసి చేసిన భర్త పేరుకే అధికారి కొడుకు. నల్లమందు, సారాయి తాగడం, ‘జాత్రా’ బృందాలతో తిరగడం, ఆడవాళ్ళతో తిరగడం ఇవే అతని ఆస్తులు. వీటితో తొందరగానే గతించిపోయాడు. కనీసం ఇరవై ఏళ్లన్నా నిండకముందే వైధవ్యం. దామోదరీయ గోసాయిల కుటుంబాల్లో వితంతువులు ఇంటి గడప కూడా సొంతంగా దాటరు, ఆహారంలో కావలసినన్ని నిషేధాలు. వీళ్ళు ఏమన్నా మీరి ప్రవర్తిస్తే సత్త్రా కే కీడు అని సత్ర్రా మొత్తం జనాల నమ్మకం. ఇంద్రనాథ్ కి చెల్లెలు అట్లా చావు కోసం ఎదురుచూస్తున్న శవపేటికలా బతకడం ఇష్టం ఉండదు, మించి నిర్ణయాలు చెయ్యలేడు. అక్కడి చరిత్ర శోధించడానికి వచ్చిన ఆంగ్లేయుడు మార్క్ కి సహాయకురాలిగా ఉండడం ఆ అమ్మాయికి మంచి చేస్తుంది అనుకుంటాడు, కానీ ఆ అమ్మాయి జీవితంలో అంత తేలిక ముగింపు రాసి లేదు.
చిన్న గోసాయినీ ఇంద్రనాథ్ బాబాయి భార్య. పచ్చటి పసుపుకొమ్ము లాంటి మనిషి. పినతండ్రి గతించిపోయినా తన వాటాకు వచ్చిన గ్రామాల్ని, శిష్యుల్ని జాగ్రత్త చేసుకునే చిన్న గోసాయినీ అంటే ఇంద్రనాథ్ కీ మిగతా అందరికీ కొంత ఎక్కువ గౌరవమే. కాకుంటే ఈ కాపాడడం చివరికి ఉత్త మాటగానే చేసేది చిన్న గోసాయినీ నమ్మిన మహీధర్ బాపూ. జంధ్యం పేరుకే ఉన్నా ఎంతో చాకచక్యంతో తనకు కనీసం పూట గడిచేటన్ని గింజలు రైతుల నుంచి సాధించిపెడుతున్నాడని అతని మీద గొప్ప నమ్మకం చిన్న గోసాయినీ కి. దానికి మించి భార్య ని చిన్న వయసులోనే పోగొట్టుకున్న ఆ బ్రహ్మడిపట్ల చెప్పలేని ఇష్టం. గీతలు దాటదు, ఆలోచన లేకుండా ఉండలేదు. మోసం బట్టబయలయ్యాక గుండె పగిలిపోయేది ఆమెకే.
ఇంద్రనాథ్ హృదయంలో ఒక పూల తీగ ఎలిమన్. సాధారణ బ్రాహ్మడు అదీ నల్లమందుకు బానిస అయిన పేద బ్రాహ్మడు తండ్రి. కలిసేది మహా ఐయితే రెండుసార్లు, కానీ ఆ అమ్మాయి పరిమళం ఇంద్రనాథ్ ని వదిలిపెట్టదు. ఆ అమ్మాయిదీ ఓ రకంగా గిరిబాల కథ లాంటిదే. రజస్వల కాలేదని ఆ అమ్మాయి దాది తండ్రిని నమ్మించడం వల్లనే కానీ, లేకుంటే అప్పటికే కోచ్ బీహార్ నల్లమందు అమ్మే బ్రాహ్మడితో పెళ్లి చేసుండేవాడు తండ్రి. ఇంద్రనాథ్ నూ, ఎలిమన్ నూ కలపాలని ఆ దాది యత్నం. ఇంద్రనాథ్ ఆ అమ్మాయిని నల్లమందు వ్యాపారితో పెళ్లి నుంచి మాత్రం తప్పించగలిగాడు గానీ తాను పెళ్లి చేసుకోగలిగేంత సంకెళ్ళు తెంచుకోలేదు. తను మహా గొప్ప ఆమ్రోంగా సత్త్రా ఉత్తరాధికారి, సాధారణ బ్రాహ్మల పిల్లని పెండ్లాడడానికి సత్త్రా పురోహితులూ ఒప్పరు, మిగతా జనాలు అంతే. అయితే ఇక్కడినుండే ఆ కాలంలో సామాన్య జనాల నుంచి అధికారుల దాకా నల్లమందు మనుషుల్ని ఎట్లా పట్టి పీడించింది, ప్రభుత్వం ఎందుకు నల్లమందు అమ్మకంలో ఉంది, బ్లాక్ లో నల్లమందు అమ్మడం పెద్ద నేరం ఎట్లా అని బోలెడు ప్రశ్నలకి సమాధానాలు. తెల్లని “కాథనా” పూల చెట్టు కింద నిలబడ్డ ఎలిమన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇంద్రనాథ్ కి ప్రియమైన ‘జగన్నాథ్’ ఆ సత్త్రా గౌరవం. దంతాలున్న ఏనుగు. ఆ ఏనుగు మీద అధికారి ఊరేగడం సత్త్రాకే మర్యాద. జగన్నాథ్ పిచ్చి పట్టి ప్రవర్తించడంతో మొదలైన సత్త్రా పతనం, జగన్నాథ్ తన వీపున మోసిన హౌదా నే ముక్కలుగా విరాగ్గోట్టడంతో మొదలై జగన్నాథ్ అంతం కావడంతో కూడా ముగియదు. చిట్ట చివరికి వేరొక ముసలి ఏనుగు మీద “చెదలు పట్టిన ఏనుగు అంబారీ” పైన ఆ సత్త్రా ఉత్తరాధికారి చివరి ప్రయాణం చేయడం ఇందిరా గోస్వామి వాడిన గొప్ప ప్రతీక. నిజానికి అస్సామీలోనూ, మొదట ఇంగ్లీషులోనూ నవలా శీర్హిక ఇదే.
వీళ్ళందరి కథ కంచికైతే చేరనిది. జమీందారీలు నశించడం ఇంకొక పెద్ద మంచికి జరిగినా ఈ జీవితాలూ తెలుసుకోవలసినవే. ఇంద్రనాథ్ తన ముందరి తరాలకన్నా చాలా ముందు ఆలోచన ఉన్న మనిషి, ఓ రకంగా మార్పును ఆహ్వానించడానికి ఒక మెట్టు ఎక్కువగానే అలోచించి తానే మార్పు అవ్వాలనుకున్నాడు కూడా. కానీ, మార్పు నదీ ప్రవాహంలా సాఫీగా తేలికగా రాదు, దానికొక ఘర్షణ కావాలి, సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున లేచి విరిగినంత వడి కావాలి; మొత్తంగా కొంత నెత్తురు చిందడం కావాలి.
ఈ పుస్తకం ఎందుకు చదవాలి!? ఇందిరా గోస్వామి రచనా శైలి కోసం, తను ఈ పుస్తకం రాయడం కోసం చేసిన పరిశోధన కోసం, బిభూతి భూషణ్ బందోపాద్యాయ “వనవాసి” ని లేశ మాత్రమైనా గుర్తుకుతెచ్చే అడవి వర్ణన కోసం, గంగంత పవిత్రమూ, బ్రహ్మపుత్రంత అఖండమూ కాకున్నా తనదైన ప్రత్యేక సైకత తీరాల ‘జగాలియా’ కోసం, మనకు పెద్దగా తెలియని అస్సామీ జీవిత చిత్రణ కోసం, ప్రాంతీయత తెలుసుకోవడం కోసం, ఈ పుస్తకం కోసం తయారు చేసిన పదకోశం కోసం, కొన్ని వేదనా భరిత జీవితాల మూలాలు ఒక్కలా ఉండడం తెలుసుకోవడం కోసం, ముఖ్యంగా ‘మమోనిరైసామ్’ గురించి తెలుసుకోవడం కోసం. ఈ పుస్తకం చదివాక తన జీవితం మీద దొరికిన నాణ్యమైన కొన్ని డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు చూసాను. జీవితాన్ని మించిన డ్రామా ఫిక్షన్ లో ఉండదు అన్నమాట మరోసారి రూఢీ అయ్యింది.

No comments: