చిత్రంగా వుంది కదా టైటిల్. అదేమరి లాక్కుపోయింది సాహిత్యానికి 'ఆలుగడ్డ తొక్క పై' కి సంబంధం ఏమిటా అని. Mary Ann Shaffer, Annie Barrows ఇదే పేరుతో రాసిన పుస్తకం ఆధారంగా తీసిన సినిమా.
మొదటి దృశ్యంలోనే బుక్ క్లబ్ కి ఆ పేరు ఎట్లా వచ్చేసిందో తెలుస్తుంది, దాంతోపాటు రెండో ప్రపంచయుద్ధం ఛాయల్లో నడిచే సినిమా అని. యుద్ధకాలపు సినిమా కాదు, అట్లా అని ఆ జాడల నుంచి దాదాపు తేరుకుని కుదురుకున్న జీవితాల తరం కాదు. అది 1946 వ సంవత్సరం. అప్పుడప్పుడే గాయాలు ఆరుతున్నాయి. గట్టిగా పాత విషయాలు తలుచుకోవడానికి కూడా ఉలిక్కిపడుతున్నారు మిగిలినవున్న అందరూ.
ఈ సెట్టింగ్ తీసి పక్కనపెడితే సినిమా పూర్తిగా రొమాంటిక్ డ్రామా జాన్రా అంచేత ఆ కాలమే బలం సినిమాకి.
జూలియట్ ఆస్టన్ టైమ్స్ లిటరరీ సప్లిమెంట్ కి రాస్తుంటుంది. పెద్ద పేరున్న రచయిత కాదు. తన పబ్లిషర్ సిడ్నీ స్టార్క్ లిటరేచర్ ప్రయోజనాల గురించి కథలు రాయమంటాడు. అదే సమయంలో "The Guernsey Literary and Potato Peel Pie Society" నుంచి డాసీ ఆడమ్స్ ఒక ఉత్తరం రాస్తాడు. జూలియట్, చార్లెస్ లాంబ్ గురించి రాసిన ఒక వ్యాసం చదివి ఆయన రాసిన ఇంకొక పుస్తకం ఎక్కడ దొరుకుందో అడ్రెస్ పంపమని. వాళ్ళ సొసైటీ గురించి రాసిన ఇంట్రోతో ముచ్చటపడిన జూలియట్ ఆ పుస్తకం కొని పంపుతుంది మరో ఉత్తరంతో పాటు. రోస్టెడ్ పిగ్ పార్టీ ఏంటి? ఆ పార్టీని దాచడం కోసం బుక్ క్లబ్ పెట్టుకోవడం ఏంటి? మళ్లీ దానికి 'పొటాటో పీల్ పై' పేరు ఏంటి అని (రోస్టెడ్ పిగ్ ఏమిటి అనుకోకండి, మామూలుగా నేనూ అదే అనుకునేదాన్నేమో కానీ సినిమాలో చాలా ఆనందోద్వేగాలతో హృద్యంగా కనిపించే సన్నివేశం). సమాధానాలు తెచ్చిన ఉత్తరంతో ఇంకాస్త ఆశ్చర్యపడతారు సిడ్నీ, జూలియట్. ఈ సొసైటీ గురించి కథ రాయడానికి Guernsey వస్తుంది జూలియట్ అప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకున్న తన బాయ్ఫ్రెండ్ ని కొన్నాళ్లపాటు వదిలి.
తర్వాత Guernsey లో జరిగే సంఘటనలు, లిటరరీ సొసైటీలోని మనుషుల కథలే మిగిలిన సినిమా. జూలియట్ తన జీవితంలోని కొన్ని భయాలకు కూడా సమాధానం దక్కించుకుంటుంది. రెండో ప్రపంచయుద్ధం నీడలు అంటే హాయిగా ఏమీ వుండదు కానీ, వీలైనంతలో తేలిక సినిమానే. నెట్ఫ్లిక్స్ లో వుంది చూడాలంటే.
No comments:
Post a Comment