గమనిక: పెద్దపోస్టు. అవసరం అనిపించబట్టే రాసా, అవసరం అనుకుంటే చదవండి.
ఇది ఎప్పటినుంచో రాయాలనుకున్న పోస్ట్. ముందు నా పనులు, తర్వాత చదవడంలో పడడంతో చాన్నాళ్లు పక్కనపెట్టా. ఇప్పుడు నేను రాయకుంటే ఏదో మునుగుతుందని కాదు, ఒక గోడు. అంతే.
తెలుగు సాహిత్యం చచ్చిపోతుంది, రచయితను బతికించండి, తెలుగు పుస్తకాన్ని బతికించండి అనే మాటలు పోస్టులు ఈమధ్య కాలంలో కొన్ని పదులు చూసాం. అన్నీ న్యాయమైనవే, రాసినవాళ్లు పబ్లిషర్లు, లేదా పుస్తకాన్ని సొంతగా వేయించుకున్న రచయితలూ; ఆ ఆవేదనలో వంద శాతం న్యాయం వుంది. లెక్కప్రకారం, వాటిని చదివేసి ఒక కేర్ ఎమోజీ ఇచ్చేసి ఒకటో రెండో పుస్తకాలు కొనేసి హమ్మయ్య మనం చేసేది చేసాం అని గుండెలమీద చేతులు వేసుకుని పక్కకి వెళ్లొచ్చు. కానీ సమస్యకి మూల కారణం ఏమిటి, అసలు ఇది ఇప్పుడు వేసేసి అమ్ముడుకాని 500, వెయ్యి కాపీల సమస్యేనా? ఇట్లా వెయ్యి కాపీలు వేసినవాళ్లు వాటిని మాత్రం అమ్ముకోగలిగితే ఇండస్ట్రీ భవిష్యత్తు బావుంటుందా? అసలు తెలుగు పుస్తకాల మార్కెట్ సైజు ఎంత? లెక్కలున్నాయా? ఇండియాలోనే బుక్ పబ్లిషింగ్ ఇండస్ట్రీ స్టాటిస్టిక్స్ సరిగా లేవు. కాస్త పెద్ద పబ్లిషింగ్ హౌసెస్ కి వాళ్ళ లెక్కలు వాళ్ళకి ఉండొచ్చు. Statista లో రిపోర్టులు వెతికితే మిగిలిన అన్ని భాషలకి అంటే అస్సామీస్ సహా కనీసం ఒకట్రెండు లైన్ల బ్రీఫ్లు వున్నాయి, తెలుగు ఒక లెక్కలోవున్న భాష కాదు అంతే, నిష్టూరంగా ఉన్నా నమ్మక తప్పదు. IBEF లో పబ్లిషింగ్ ఇండస్ట్రీ ఊసు కూడా లేదు, ఇది మహత్తరం. మిగిలిన రిపోర్టులు దాదాపు ఇంతే. 2015 నీల్సన్ రిపోర్ట్ ప్రకారం భారతీయ పుస్తకాల మార్కెట్ సైజు దగ్గర దగ్గర మూడొందల బిలియన్ రూపాయలు. 2020 కి అప్పట్లో వాళ్ళు వేసిన అంచనా దాదాపు రెట్టింపు. ఇంకా లెక్కలు బయటికి ఇవ్వలేదు. ఇందులో మనం ఎక్కడ ఉన్నాం? రోజుకో రచయితో పబ్లిషరో ఇంక మేము రాయడం మానేస్తాం, పుస్తకాలు వేయడం మానేస్తాం అనవలసిన దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు.
అసలు ప్రపంచంలో టాప్ టెన్ పుస్తకాలు ఎన్ని అమ్ముడుపోయాయో మన వెయ్యి పుస్తకాల సంభాషణల్లో మాట్లాడుకుంటున్నామా? అవి ఏ genre లో ఉన్నాయో మనకు తెలుసా? కాస్త చదువుకున్న వాళ్ళం అంతా తిట్టుకునే చేతన్ భగత్ ఎన్ని కాపీలు అమ్మగలిగాడో ఇప్పటిదాకా మనకు తెలుసా? ఏడూ మిలియన్ల పైన. మన దేశంలో మిలియన్ కాపీలు అన్న మార్క్ చూసిన రచయితలు ఉన్నారా?ఉంటే ఎందరు ఉన్నారు? ఏ భాషలో రాసారు? genre ఏంటి? ఎవరం పట్టించుకుంటున్నాం. చేతన్ భగత్ తర్వాత అమిష్ రెండున్నర మిలియన్లు ఒక 'శివ ట్రయాలజీ' నే అమ్మాడు. దాదాపు పదిమంది మిలియన్ దగ్గరలో అమ్మినవాళ్లున్నారు, అందరూ రాసింది ఇంగ్లిష్లోనే. తర్వాత మరాఠీ, బెంగాలీ, కన్నడ, మలయాళ, గుజరాతీ, ఇప్పుడు తమిళంలో రాస్తున్న వాళ్ళు కూడా పేరొందిన రచయితలు పుస్తకాలమీద హాయిగా బతకగలిగినంత సంపాదిస్తున్నారు. వీళ్ళవన్నీ ఇంగ్లీషులోకి వెళ్తున్నాయి దాదాపు. అక్కడ ప్రాంతీయ భాషకు మించిన కాపీలు నిస్సందేహంగా అమ్ముతున్నారు. మళ్ళీ మొదటి లెక్కకి వస్తే, ప్రస్తుతం వేస్తున్న లెక్కల్లోకి వచ్చి వంద మిలియన్ల పైన అమ్మిన సింగల్ టైటిల్స్ లో ఒకటి ఫ్రెంచ్, ఒకటి చైనీస్ మిగిలిన నాలుగూ ఇంగ్లీష్. ఇప్పుడు వేసేలాంటి లెక్కల్లోకి రాకుండా అంచనాల లెక్కల్లో ఎక్కువ కాపీలు అమ్మినవి ఇవి #1 – Don Quixote (500 million copies sold); #2 – A Tale of Two Cities (200 million copies sold); #3 – The Lord of the Rings (150 million copies sold); ఇక సిరీస్లు గ వంద మిలియన్ల పుస్తకాలు అమ్మిన పుస్తకాల్లో పదికి తొమ్మిది పిల్లలవే. మా పిల్లలు పుస్తకాలు చదవరు అన్న గొప్ప మన దగ్గర ఉన్నంత ఇంకోచోట వుండదేమో!? అసలు పిల్లలకి పుస్తకాలు అలవాటు చెయ్యాలని ప్రయత్నం మొదలుపెట్టే తల్లిదండ్రులకి మన దగ్గర ఉన్న రికమెండర్ సిస్టం ఏది? చందమామల కాలం తరవాత tinkle, అమర్చిత్రకథ తో సహా ఒకసారి చూసి చెక్ చేసుకోకుండా పిల్లలకి ఏజ్ రికమండేషన్ని బట్టి కళ్ళు మూసుకుని చేతికి ఇచ్చే పుస్తకాలు ఎన్ని? ofcourse చందమామతో అస్సలు పేచీలు లేవని కాదు, హరిపోటర్ కి సర్దుకున్నామంటే చందమామకు సర్దుకోవాలి అంతే. కాకుంటే మొదటి దాంట్లో అది ఫాంటసీ అని చదివే పిల్లలకి కచ్చితంగా తెలుసు. ఈ విషయంగా వ్యక్తిగత స్థాయిలో ఒక అనిల్ బత్తుల గారు చేస్తున్న ప్రయత్నం తెలుసు నాకు.
ఇప్పుడు పుస్తకాలు రాసి అమ్మేవాళ్ళు, వేసి అమ్మేవాళ్ళు భూతద్దంలో చూస్తున్న సమస్య పైరసీ. ఈ మాట అంటే అందరూ నన్ను తిడతారు, పర్వాలేదు, అయినా చెప్తా. పైరసీ సమస్య కాదు అననే అనను, అదే సమస్య అని ఆగిపోవడమే నాకు కొరుకుడు పడనిది. ఈ పైరసీ సమస్యకి గురికాని ఒక్క ఎంటర్టైన్మెంట్ వస్తువుని చూపించండి!! రచయితలకు మిలియన్ల డాలర్లు ముందే ఇచ్చేసి పుస్తకాలూ రాయించుకున్న పబ్లిషింగ్ హౌసులు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాయి. వాళ్ళకి ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి, పుస్తకాల హాకింగ్ సమూహాలతో. వాళ్ళు చేసే 'పుస్తకాలు జ్ఞానం, అది ఫ్రీగా పంచిపెట్టాలి' అన్న వాదన కొత్తదీ కాదు, దానికి ఉన్న ఆమోదం తక్కువ కాదు.
మిలియన్ల డాలర్ల పెట్టుబడితో తీసే సినిమాలు కూడా ఈ పైరసీ తాకిడికి కుదేలు అయ్యాయి. అయినా అవి ఎట్లా నిలదొక్కుకున్నాయ్? కొత్త ఆలోచనలు చేసారు. బాక్స్ ఆఫీస్ డబ్బులు ఎంత తళతళలాడినా అవి మబ్బులో నీళ్లు, సినిమా పొతే అధోగతి. కుండలో నీళ్లు జాగ్రత్త చేసుకున్నారు. పెద్ద పెద్ద మీడియా హౌసులు కలిసి సినిమాలు తీయడం మొదలైంది, దీంతో కాస్త ధైర్యం పెరిగింది బడ్జెట్లకి. ఇన్ ఫిల్మ్ advertising, కో బ్రాండింగ్, టెలివిషన్ రైట్స్, ప్లాట్ఫారం రైట్స్ అమ్మడం, మ్యూజిక్ రైట్స్, ఫిల్మ్ బేస్డ్ merchandising, ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మడం ఇట్లా రకరకాల కొత్త పద్దతులతో, ముందే పెట్టుబడి గండం దాటేస్తున్నారు. పుస్తకాల్లో, ముఖ్యంగా తెలుగు పుస్తకాల్లో ఇట్లా ఏం చేస్తున్నాం!! సినిమాలు ఆడియో విసువల్ మీడియమ్ కాబట్టి తెలుగు సినిమాకి ఇప్పట్లో వచ్చిన భయమేమీ లేదు, తెలుగు పుస్తకం సంగతేంటి? తెలుగు చదివే పాఠకులు ఇప్పుడు ఉన్నవాళ్లలో నేను బహుశా మూడో తరం దాన్ని, నా తర్వాత రెండు మూడు తరాల వాళ్ళకి చదివే జ్ఞానం వుంది. ఆ తర్వాత? పబ్లిషర్లు దీనికి సిద్ధంగా ఉన్నారా? కావలసినంత ట్రాన్సలేషన్ జరుగుతుందా? ఆడియో పుస్తకాల గురించి ఆలోచిస్తున్నామా!! నాకు తెలిసి వ్యక్తిగత స్థాయిలోనే గొప్ప కృషి చేసి నిడదవోలు మాలతి గారు చాలా పని చేసారు తూలికతో. అట్లా వ్యక్తిగత స్థాయిలో ఎవరైనా ఎంత చేయగలరు? వ్యవస్థాగతంగా ఈ పని ఎందుకు జరగట్లేదు? సరే, వేసిన పుస్తకాలకే గతి లేదు ట్రాన్స్లేషన్ అంటావేంటమ్మా అని అడగొచ్చు న్యాయమే, ఇంకాస్త చూద్దాం.
ఇక్కడ ఫేసుబుక్లో ఒకటో రెండో పుస్తకాలు చదివి, నాలుగు మాటలు రాసే అందరూ మాట్లాడే ఒక విషయం గుర్తుందా? చిన్నతనంలో మా స్కూలు లైబ్రరీ, మా ఊళ్ళో, శాఖా గ్రంథాలయం, మా వీధి చివరి బడ్డీకొట్టులో అద్దెకు తెచ్చుకున్న పుస్తకాలు అని తలుచుకోని వాళ్ళు ఉన్నారా? ఇప్పుడవి ఎక్కడ? అప్పట్లో పుస్తకాలు చదివిన అందరూ అన్ని పుస్తకాలూ కొనే చదివారా? కొని చదివితేనే చదవగలిగేటట్లయితే అప్పటి జీతాలకి, అవసరాలకి పుస్తకాలు ఏ స్థానంలో వుండేవి? అప్పట్లో వందలకొద్దీ (సరైన లెక్క తెలియదు కాబట్టి వందలు అని ఆపుతున్నా, ప్రతీ మండలానికి శాఖా గ్రంథాలయం వుండేది, అసలైతే వేలు అనాలి.) ఉన్న గ్రంధాలయాల్లోకి కొంటేనే కొన్ని వందల కాపీలు సునాయాసంగా అమ్ముడుపోయినట్టు, సర్క్యూలేషన్ కనీసం పదుల వేలు. ఇప్పటికీ చాల కొన్ని కొంటున్నారట, నాకు ఆ డీటెయిల్స్ కోసం చూసినా దొరకలేదు. ఈ మాట కూడా గమనించాలి. ఈ పోస్టులో రాసిన ఒక్క విషయం కూడా నా సొంత సృష్టి కాదు, రకరకాల చోట్ల కాస్త శోధించి క్రోడీకరించా, కానీ ఈ విషయం దొరకలేదు.
అద్దె పుస్తకాలు తప్పనిసరిగా పరిశీలించాలి. తెలుగులో ఒక్క కినిగె వాళ్ళు ఈ సదుపాయం కలిగించారు నా పరిశీలనలో. ఇప్పుడు ఇంకా పుంజుకోకపోయినా, భవిష్యత్తు ఉన్నది దీనికే. అక్కడైనా నా లెక్క ప్రకారం మోడల్ మారాలి. పుస్తకానికి ఇంత అని కాకుండా కిండిల్ పద్దతిలో నెల, సంవత్సరం ప్లాన్లు తేవాలి. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే కిండిల్ లో నేను 169 రూపాయలు నెలకు కట్టి వెయ్యి రూపాయల పుస్తకాలు చదివే దాహం వుంటే తీర్చుకోవచ్చు, అంత కలెక్షన్, సెలక్షన్ అక్కడ వుంది. అందుకని నేను 169 రూపాయలు ప్రతీ నెలా ఊరకే కట్టేసి ఒకటిరెండు నెలలు గట్టిగా చదువుకున్నా పెద్ద బాధ వుండదు . సామాన్య పాఠకుల గురించి ఆలోచించాలి కదా? నేను ఇవ్వాళ్ళ కావాలి అన్న పుస్తకం కొనుక్కోగలిగి వుండవచ్చు , అట్లా లేనప్పుడు అసలే చదవొద్దా!! ఇంకో మార్గం వుండొద్దా నాకోసం? ఇంకో న్యాయమైన మార్గం లేకుంటే ఎక్కడా చట్టపరంగా బాధ్యతగా చెయ్యాల్సిన పనులక్కూడా వేరే మార్గాలు వెతికే సగటు మనిషి పుస్తకాలు ఫ్రీగా దొరికించుకోవాలి అనుకోడా? ఇది నేను పైరసీ సమర్థించడానికి అస్సలు చెప్పట్లేదు, కారణం కోసం చెప్తున్నా. ఇంకొక సంగతి పబ్లిషర్లు గమనించాల్సింది ఏంటంటే ఈ పుస్తకాల హోర్డర్లు ఊరికే డౌన్లోడ్ చేసి అబ్బో మా దగ్గర ఇన్ని పుస్తకాలు వున్నాయి అని మురిసేవాళ్ళే, ఒక్కశాతం కూడా కనీసం వాటిని తెరిచి చూడరు. వీళ్ళలో అరశాతం మందిని ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్లలోకి తేగలిగినా మామూలు మార్పు వుండదు. డబ్బులు కడితే ఏదో ఒకనాడు కచ్చితంగా చదువుతారు. అందుకే వీలైనంత తక్కువ నెలసరి ఛార్జీతో వీలైనన్ని మంచి పుస్తకాలు చదవగలిగే అవకాశం రావాలి.
పబ్లిషర్లు చెయ్యగలిగే ఇంకొక పని పుస్తకాల క్లబ్లు. చందాదారులకు నెలకొకటి రెండు పుస్తకాలు పంపడం సరిగ్గా చేస్తే బోలెడు కొత్త పుస్తకాలు తీసుకురావచ్చు. మా తాతయ్య ఎమెస్కో బుక్ క్లబ్ సభ్యుడిగా వుండేవాడు. నెలనెలా ఒక పుస్తకం వచ్చేది నాకు గుర్తున్నంతలో. మామూలుగా అయితే ఆ పుస్తకాలు దాదాపు వెతికి కొని మోడల్లో అయితే కొనేవాడు కాదు ఆయన. పుస్తకాల గురించి మాట్లాడుకునే క్లబ్లను ప్రోత్సహించవచ్చు. xist పబ్లిషింగ్ లాంటి సంస్థలు ఎంత మంచి guidelines తయారుచేసాయో ఈ విషయంలో. నేను గమనించినంతలో బుక్ రీడర్స్ క్లబ్ మొదలెట్టి శ్రీశైల్ రెడ్డి పంజుగుల, బి పి పడాల గార్లు కూడా ఒక చక్కని వాతావరణం తయారుచేసారు కనీసపు చర్చకి. ఇట్లాంటివి పెద్ద స్థాయిలో offlinelo కూడా జరగాలి. ఇది రాస్తుంటే అనిపిస్తుంది లైబ్రరీలు ఎన్ని బంగారంలాంటి పనులు చేసేవో ఇట్లాంటివి. దాదాపు చంపేసుకున్నాం అంత మంచి వ్యవస్థని.
తరువాత వంద రూపాయల పుస్తకాలు, యాభై రూపాయలైతే ఇంకా మంచిది . తిట్టుకుంటారని తెలుసు, కానీ వాల్యూం పెరగాలంటే ఇదే సూత్రం. ఇక్కడ చెప్పిన ఏడు మిలియన్ల అమ్మిన చేతన్ భగత్ పుస్తకాలూ, అమిష్ పుస్తకాలూ అతి ఎక్కువగా వంద నూట పాతిక లోపులోనే. అమెజాన్లో దొరికినంత తేలికగా ఆల్ ఇండియా బుక్ ఎక్సిబిషన్ లోపలా, బయట ఫుట్ పాత్ మీద, ఝాన్సీ రైల్వే ప్లాట్ఫారం మీద హాయిగా దొరుకుతాయి. అదీ కావలసింది, గొప్ప సాహిత్యానికి ఆదరణ దొరకాలంటే దానికి మొదలు ఒప్పుకోకపోయినా ఈ పల్ప్ లోనే వుంటుంది. తర్వాత విరివిగా పంపిణీ జరగాలి. మొన్నామధ్య కథాప్రపంచం కిరణ్ గారు తిరుపతిలో రోజుకొక దగ్గర స్టాల్ పెట్టి పుస్తకాలు అమ్మారు. తోపుడుబండి సాధిక్ అలీ గారి కృషి నాకన్నా మీ అందరికీ ఎక్కువ పరిచయం.
పుస్తకాలు అమ్మడానికి కొత్త మార్గాలు వెతక్క తప్పదు. బోలెడంతమంది రచయితలు సొంతగా పోస్టేజ్ పనులు చూసుకుని పుస్తకాలు పంపుతున్నారు, అది కొత్త మార్గమే కానీ పనిచేస్తుంది, పబ్లిషర్ పుస్తకాలు అమ్మి నా డబ్బులు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇస్తే చాలు అనుకునే కాలం చెల్లిపోయినట్టే వుంది.
అన్నిటికంటే ముఖ్యం అని నేను అనుకునేది ఆడియో పుస్తకాలు, ఆడియో పుస్తకాలు, ఆడియో పుస్తకాలు. రెండవ పేరాలో రాసినట్టు తెలుగు పుస్తకాల భవిష్యత్తు అంటే కచ్చితంగా ఆడియో పుస్తకాల్లోనే వుంది. తెలుగు చదవడం తెలిసిన తరాలు మనం ఎవరం అంగీకరించకున్నా తగ్గిపోతున్నాయి. నా పిల్లలే చిన్నతనం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వుండకపోవడంచేత తెలుగుకి దూరమయ్యారు. మీను సొంత ప్రయత్నంతో చదవడం నేర్చుకుంది, అయినా వ్యవహారికమే చదవగలుగుతుంది. రిషి కి రాదు, పీరియడ్. వీళ్ళు ఇంతకుమించి తెలుగు నేర్చుకోకుంటే నాకున్న అతిచిన్న వ్యక్తిగత లైబ్రరీని చూసి కూడా పాపినేని శివశంకర్ గారి మాటలు తల్చుకొని బాధ పడాల్సిందే, 'సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి'. భవిష్యత్తులో నేర్చుకుంటే సంతోషం. ఎంత ప్రయత్నం చేసినా కొన్ని ఇంపోజ్ చెయ్యలేం ఫార్మల్గా చదువుకుంటే తప్ప. ఇంగ్లీషు పుస్తకం వాడి చేతికిస్తే మామూలు మోస్తరుది ఒక రోజులో చదివేస్తాడు, రాక్షస జీర్ణశక్తి వుండే వయసు. తల్లులారా, తండ్రులారా పుస్తకం పట్టించండి పిల్లలచేత మొహమాటంలేకుండా, అంత చిన్నతనం అయితే ఎవరికీ చెప్పకండి చదవడానికి అలవాటు పడితే ఎట్లాగూ ఆపరు. కానీ వీళ్ళకి తెలుగు పుస్తకాలు తెలియాలంటే, గొప్ప రచయితలు పరిచయం కావాలంటే ఆడియో మాత్రమే మార్గం. మళ్ళీ నా గమనంలోకి వచ్చి చక్కటి ఆడియో పుస్తకాలు చేస్తున్నది "దాసుభాషితం" వాళ్ళు. నెలవారీ ప్లాన్లు కూడా తెచ్చారు. కానీ ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి కంటెంట్ పెరగడానికి సమయం పడుతుంది. యూట్యూబ్ లో చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళయినా ఆడియో పుస్తకాలు చేసే వేరే ఎవరైనా వీలైనంత ఎక్కువ పుస్తకాలు తక్కువ ఛార్జెస్ కి ఇవ్వగలగాలి. కిండిల్ కన్నా audible కి అమెజాన్ ఎక్కువ ఛార్జ్ చేస్తుంది, కానీ విపరీతమైన కలెక్షన్. హచెట్ పబ్లిషర్స్ అయినా హార్పర్ కాలిన్స్ అయినా పెంగ్విన్, మాక్ మిలన్ అందరి దృష్టి ఇప్పుడు ఆడియో మీదనే.
వీటన్నిటికీ తోడు వీలైనన్ని కాపీరైట్ల ఇబ్బంది లేని పాతవి గొప్పవి అయిన పుస్తకాలని వీలైనంతగా ఓపెన్ ప్లాటుఫార్మ్స్ లోకి తీసుకురావాలి. ప్రాజెక్ట్ గూటెన్బెర్గ్ , ఇంటర్నెట్ ఆర్కైవ్ ఇంగ్లిష్ సాహిత్యానికి చేస్తున్న మేలు మామూలుది కాదు. చదవడం మొదలుపెడితే కొని చదువుతారు. కొన్ని మిలియల్న్ల కాపీలు డౌన్లోడ్ అవుతుంటాయి వీటిలో, ఆడియో కూడా. ఆర్కైవ్స్ లో తెలుగు పుస్తకాలూ బోలెడన్ని వున్నాయి అరుదైనవి, ఇండెక్స్ లో తేడాల వల్ల చాల దొరకవు. అక్కడ ఏమైనా సపోర్ట్ చెయ్యగలిగిన మంచిదే. ఇంక కారా మాష్టారు గారి "కథా నిలయం" గురించి మాట్లాడుకోకుంటే ఎలా. ఎన్ని అరుదైన కథలు దొరుకుతాయో అక్కడ. ఇట్లాంటివి విరివిగా రావాలి. ఫేస్బుక్ లో కొందరు యువకులు ప్రవేటుగా వాళ్ళ వ్యక్తిగత స్థాయిలో గ్రంథాలయో ద్యమం మళ్ళీ మొదలుపెట్టారు. అంత చేయలేకపోయినా కనీసం మన ఊరి లైబ్రరీలను రక్షించుకున్నా చాలు. పుస్తకానికి ఊపిరి పోయడం అంటే కొంతమంది పుస్తకాభిమానులు గోడు వెళ్లబోసుకుంటే చాలదు, ఆచరణాత్మకమైన ఆలోచనలను చేయాలి, వాటిని ఆచరణలోకి తేవాలి. నేను ఈ పోస్టు గురించి అనుకున్నప్పుడు చేసిన కొన్ని ఆలోచనలతోనే ఇది రాసేశా, పెద్ద పరిశోధన ఏమీ చెయ్యలేదు. కానీ, కొన్ని గట్టి మెదళ్ళు కలిసి కాస్త దీర్ఘంగా ఆలోచిస్తే ఇంకా వెయ్యి పనులు చెయ్యొచ్చు. ఇది నా గోడు. అంతే.
సినిమా డైలాగ్ అయినా వాడేస్తున్నా, నా మాటలు అర్థం కాకుంటే క్షమించండి, అసలు అర్థమే లేదనుకుంటే మన్నించండి :D
No comments:
Post a Comment