Monday, May 23, 2022

దమయంతి కూతురు – పి. సత్యవతి – కథ 2012

 పోయినేడాది మొదట్లో శృతకీర్తి తలపెట్టిన ఒక ప్రాజెక్టు కోసం రాసిన వ్యాసం, కరోనా కోరలకు చిక్కి చిక్కుపడిపోయింది. మీకు బోలెడు ధన్యవాదాలు శృతా

🙂 మీరు గట్టిగా చెప్పకుంటే ఈ మాత్రం పొందికగా ఎప్పటికీ రాసేదాన్ని కాదు. రాయడం ఒకేసారి పూర్తి చేసినా చదివింది తక్కువ కాదు, నాకు ఆన్లైన్ లో అప్పటికి అందుబాటులో వుండి దొరికినవన్నీ చదివాను. ఇది వాళ్ళందరి భుజాలమీదుగా చూసి రాసిందే కనుక వారందరికీ ధన్యవాదాలు.
ఇది రాసినప్పటికి నేను సత్యవతి గారి కథలు ఎక్కువ చదవలేదు. ఇప్పటికీ మొత్తం చదవలేదు, కానీ ఇంకాస్త మెరుగ్గా వచ్చి వుండేది ఇప్పుడు రాస్తే. ఇప్పుడొక సందర్భం వచ్చింది కాబట్టి వేడుకల్ని ఆవిడ కథతోనే పొడిగిస్తూ ఈ వ్యాసం పోస్ట్ చేస్తున్నా (అవును నేనే వ్యాసం అంటున్నా 🙂 పెద్దదే, చదవడం మీ ఇష్టం).
సత్యవతి గారూ, మీరు ఇవన్నీ రాసినందుకు నాలాటి ఎందరి ఆలోచనలనో ప్రభావితం చేసినందుకు మీకు అనేక నమస్కారాలతో ధన్యవాదాలు.
దమయంతి కూతురు – పి. సత్యవతి – కథ 2012
కథకురాలి పరిచయం:
పి. సత్యవతి బలమైన కథకురాలిగా రెండు మూడు తరాలకు పరిచయమైన ప్రసిద్ద కథకురాలు. పంతొమ్మిదివందల అరవై నాలుగు నుంచి ఇప్పటివరకూ కథలూ, అనువాదాలు, సాహిత్య వ్యాసాలతో తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. అతి కొద్దిగా నవలలు కూడా రాసారు. అన్ని రకాల రచనలు చేస్తున్నప్పటికీ కథా రచన పట్లనే సత్యవతి గారికి మక్కువ ఎక్కువ. తన సాహితీవ్యాసంగంలో అరవైకి పైగా కథలూ, ఆరు నవలలూ, అనేక ప్రసిద్ద అనువాదాలతో పాటు ఎన్నో సాహితీ వ్యాసాలను వెలువరించారు. వీరి సాహిత్యం పైన సమీక్ష చేసిన సమీక్షకులు తప్పకుండా చెప్పే ఒకమాట, రాశిలో తక్కువైనా వాసిలో మన్నికైన కథలు అందించారని. సత్యవతి కథలలో ప్రధాన పాత్ర స్త్రీ నే. స్త్రీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం ప్రాతిపదికగా ఆవిడ రచనలు చేస్తారు. మొదటినుంచి స్త్రీ ప్రధాన కథలే రాస్తున్నా రచయిత్రి ఓల్గా ని చదివిన తరువాత స్త్రీవాదం గురించి తన అధ్యయనం మొదలైందని ఈ విషయంలో ఓల్గా ప్రభావం తన మీద వుందని ఆవిడ చెప్తారు. మొదట్లో మధ్య తరగతి వర్గాల స్త్రీ ప్రతి నిత్యం చేస్తుండే పోరాటాల పట్ల ఎక్కువగా దృష్టి పెట్టిన రచయిత్రి ఇటీవల అణగారిన వర్గాల స్త్రీల కథలు చెప్పవలసిన కచ్చితమైన అవసరాన్ని గుర్తించి ఆ వర్గాల కథల్ని ఎక్కువగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. స్త్రీవాద సాహిత్యం అంటే స్త్రీలని పీడితవర్గంగా గుర్తించి వారి వ్యధల్ని, వెతల్ని చెప్పి ఆగే కథల కంటే ఆశావహదృక్పథంతో సాగే కథల్ని ఆవిడ ఇష్టపడతారు. ఆఫ్రో అమెరికన్ రచయిత్రులు చెప్పిన కథలు ఈ సంతులనాన్ని సాధించాయని, ఆ మార్గంలో తెలుగు స్త్రీవాద సాహిత్యం కూడా నడిస్తే పాఠకులకు అసలైన మేలు జరుగుతుందని ఆవిడ ఉద్దేశ్యం. అందుకే వీరి కథల్లో స్త్రీల సమస్యల గురించిన చర్చ చేసినా ఒక ఆశావహ మలుపు లేక ఆలోచన దగ్గరే కథల్ని ముగిస్తారు. వేదనల్ని రికార్డు చేయడం పట్ల తనకు సహానుభూతి వున్నా రచయిత బాధ్యత అంతకుమించినదని ఆవిడ నమ్మకం.
కథకురాలిగా సత్యవతిపై మొదటినుంచీ మాలతీచందూర్ ప్రభావం ఎక్కువగా వుందని ఆవిడే చెప్పుకున్నారు. మాలతీచందూర్ పరిచయం చేసిన నవలలను డిక్షనరీ దగ్గర పెట్టుకుని చదవడంతో తన సారస్వతానికి పునాదులు పడ్డాయని సత్యవతి చెబుతారు. తరువాత అంత ప్రభావితం చేసిన రచయితలు కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి గార్లు. ఈ రచయితల ప్రభావం వల్లనే సత్యవతికి తన కథలు పొరల్లో దాయడం కన్నా సూటిగా చెప్పడం ఇష్టం. తన కథల్లో ప్రసిద్దమైన ‘సూపర్ మామ్ సిండ్రోమ్’ లాంటి కథల్లో మేజిక్ రియలిజం ఛాయలు కనపడ్డా దానిని ఆవిడ తెచ్చి పెట్టిన శిల్పంలా కాక తన ఆలోచనల్లోని మెటాఫోర్ అట్లా రూపుదాల్చిందని చెబుతారు. వాస్తవికతకు దగ్గరగా వుండే కథనం ఆవిడ కథల్లోని బలం.
కథ లోకి వద్దాం.
ప్రస్తుతం మనం విశ్లేషించుకోబోతున్న కథ ‘దమయంతి కూతురు’. 2012లో వచ్చిన ఈ కథ పాఠకుల నుంచి ప్రశంసని, విమర్శని అందుకున్న కథ. వివాదాస్పదం అనడం కన్నా ఎక్కువ ఆలోచన రేకెత్తించిన కథగా పరిగణించవచ్చు. మహమ్మద్ ఖదీర్ బాబు రీ టెల్లింగ్ కోసం ఎంచుకున్న యాభై స్త్రీల కథల్లో ‘దమయంతి కూతురు’ కూడా ఒకటి. మామూలుగా కథ వివాదాస్పదం ఐయితే ఆ కథ మీద విమర్శ ఎక్కువగా చూస్తాం, కానీ ఈ కథకి విమర్శగా మరొక ప్రతికథ కూడా రావడం కథ యొక్క విశేష ప్రభావంగానే చెప్పవచ్చు. సరే, కథ విషయానికొస్తే ఇది పూర్తిగా దమయంతి కూతురి కథ, కొంచెం దమయంతి కొడుకు కథ, ఇంకా కొంచెం దమయంతి భర్త కథ. కథలో కనపడని దమయంతి తీసుకున్నఒక్క నిర్ణయం మిగిలిన పాత్రలన్నింటినీ ఎట్లా ప్రభావితం చేసిందన్నదే ఈ కథ.
సంక్షిప్తంగా కథా పరిచయం:
కథ ప్రస్తుతకాలంలో దమయంతి కూతురు చక్కని స్థాయి ఉద్యోగినిగా స్థిరపడింది. తనకో మంచి స్నేహితురాలు స్నేహ, పాత హిందీ పాటలు, పత్రికలతో ఆ అమ్మాయి స్నేహం. తనలో గూడు కట్టుకుపోయిన మౌనాన్ని కరిగించి జీవానానందాన్ని పరిచయం చేసిన స్నేహ తన అన్న తరువాత అంత ఆత్మ బంధువు. ఇంక తన జీవితంలో మరో ముఖ్యపాత్ర తన మేనత్త. తల్లి లేకుండా పోయిన పదేళ్ళు నిండని పిల్లని ఇంతదాకా చేసిన మేనత్తని తను నొప్పించలేదు. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది ఆ మేనత్త. ఒక సాయకాలం అట్లా పెళ్ళిచూపులకి ప్రొలోగ్ గా కలిసిన పెళ్ళికొడుకు సంతోష్ ఫ్రం సామర్లకోట. సంతోష్ కి అన్నిందాలా తను నచ్చినట్టే, కాకుంటే సంతోష్ తల్లికి ఇంకా కుటుంబానికి మాత్రం తన తల్లి ఏమయ్యింది అన్న నిజం కావాలి. పెద్ద మొహమాటం లేకుండానే సంతోష్ ఈ విషయాన్ని కదుపుతాడు, నిజంగా చనిపోయిందా లేక వెళ్లిపోయిందా అన్న మాటలు కాస్త లేకిగానే. తను తన తల్లి వెళ్ళిపోయిందని నిబ్బరంగా చెబుతుంది. ‘నేను మీ గురించి వాకబు చేశాను, మా వాళ్ళని కన్విన్స్ చేస్తాను’ అన్నసంతోష్ మాటల వెనక వున్న మతలబులన్నీ తేటతెల్లమై ఇంక ముందుకు వెళ్ళడం అక్కరలేదని చెప్పి సంతోష్ ని పంపేస్తుంది. అమ్మ వెళ్ళిపోయిందన్న మచ్చ ఒకటి తగిలించేస్తే జీవితం అంతా ఆ సామర్లకోట సంతోష్కి ఋణపడివుండటమే. తనకు అక్కర్లేదు అట్లాంటి పెళ్లి. మేనత్తకు ఏదో చెప్పుకుంటుంది.
ఓ రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నాన్న అగ్గిలా వున్నాడు, అన్న ఏడుస్తున్నాడు, అమ్మని అడుగుదాం అని లోపలికెళ్తే ఇంట్లో అమ్మలేదు. ఏడుస్తూనే ఉన్నారు పిల్లలు. తెల్లరేకల్లా మేనత్త ఇంటికి వచ్చింది. ఆ మేనత్త ఏట్లోకి వెళ్ళిందని చెప్పిన అమ్మ ఆ రోజూ రాలేదూ, మర్నాడు రాలేదు, ఇప్పటికీ రాలేదు. కొన్నాళ్ళు అమ్మ వస్తుందని తను ఎదురుచూసింది, కొన్నాళ్ళకు నాన్న పక్కన అమ్మ స్థానంలో ఇంకొక ఆవిడ వచ్చి చేరింది, అన్న హస్టలుకి చేరాడు, తను అత్తతో పాటు అత్త ఇంటికి చేరింది, చిన్నగా అమ్మ కొంగు స్థానంలోకి అత్తకొంగు వచ్చి చేరింది, బాగున్నట్టే వుంది కానీ అమ్మకొంగయితే కాదు. ఆ సొంతం రాదు. అత్తయ్య మంచిదే, అమ్మను తిట్టకుండా ఉండకూడదా!! ఇంకా మంచిదయ్యేది, అమ్మయ్యేదయితే కాదు. అన్నని అడిగేది అమ్మ మనల్ని ఎందుకు వదిలెయ్యాలి అని, అన్న చెప్పేవాడు ఇప్పుడు నీకు నాన్న పక్కనున్న ఇంకొక ఆమె ఎట్లానో అమ్మ పక్కన ఇంకో ఆయన కూడా అంతేగా అని. ఎందుకో అమ్మ మీద కోపం, ఉక్రోషం పూర్తిగా పోవు.
జీవితంలో బాగా నెమ్మదించాకా వోసారి నాన్ననడిగింది, అమ్మ ఎందుకు నాన్నా వెళ్ళింది అని. అప్పటికి వచ్చిన స్థిమితంతో నాన్న అన్నాడు, ‘నేను, భూలోకపు మనిషినమ్మా, ఆవిడ ఊర్ద్వ లోకపు మనిషి. అందుకే ఈ లోకంలో ఇమడలేక వెళ్ళిపోవడం’. అంతే నాన్న చెప్పింది. అన్నీ అర్థమైనట్లున్నా ఇప్పటికీ తను గింజుకులాడుతుంది ఒక్కోసారి అన్నతో మాట్లాడుతూ మనల్ని కూడా మర్చిపోవాలా, అట్లా వెళ్ళిపోవాలా అని. మళ్ళీ మళ్ళీ. తమ బాధ పట్టలేదే అమ్మకీ అని. ఒకటే అంటాడు అన్న. మళ్ళీ మళ్ళీ. వుండిపొతే ఆమె బాధ సంగతేంటి. అంతే ఆ కథ.
కథా విశ్లేషణ:
దమయంతి కూతురి దృక్కోణంలో సాగుతుంది పూర్తి కథ. వివాహేతర సంబంధంలో స్త్రీ పురుషులు అనుభవించే హింసను గురించిన కథలు ఎన్నో వచ్చాయి, ఇప్పటికీ చెబుతున్నారు కథకులు కొత్త కొత్త కోణాలతో. సత్యవతి గారే ‘గొడుగు’ నవల లోనూ, ఇంకా కొన్ని కథల్లో ఈ ప్రస్తావనతోనే కథ నడిపించారు. ఈ కథలో కొత్తదనం పిల్లల దృక్కోణంలో, మరీ ముఖ్యంగా కూతురి చూపులోంచి కథ చెప్పబూనడం. ‘గొడుగు’ లో భార్య ఎగువ మధ్య తరగతికి చెందిన యువతి, ఆమె జీవితంలో అన్నీ వున్నట్టే సమాజపు లెక్కల్లో. సౌందర్యస్పృహ లేని భర్త లోపమేమీ కాదు కదా!! ఈ భావుకత్వపు లోపాన్ని ఉపయోగించుకున్న చిన్ననాటి స్నేహితుడు ఆ అమ్మాయిని నమ్మించి లోబరుచుకొని వదిలేస్తాడు. భర్త తనతో వుండనిస్తాడు. రచయిత మాటల్లో చెప్పాలంటే అప్పటికి పరువు హత్యలతో కుటుంబపు పరువు తెచ్చుకోవడం అంత ప్రాచుర్యంలోకి రానందున సంసారపు ఉక్కపోతలో కుటుంబపు పరువుని కాపాడుకునేవాళ్ళు. అట్లా కొన్ని జీవితాలు గడిచిపోయాయి. ‘ఆవిడ’ కథ కూడా కొంత పోలికలతో ఉండే కథ, సూక్ష్మంగా చూస్తే. ఇక్కడా కూతురే కథ చెబుతుంది. కాకుంటే, ఇక్కడ తండ్రి జీవితంలోకి తల్లి పోయిన తరువాత ‘ఆవిడ’ వస్తుంది. ఇంతవరకే పోలిక.
‘నాన్న’ పూర్తిగా నాణెం అవతలివైపు కథ. ఇక్కడ వసంత నాన్నరామ్మోహనరావు వెళ్ళిపోతాడు పెళ్ళికి ముందే తను ప్రేమించిన లలిత కోసం, తప్పక పెళ్లి చేసుకున్నా తరువాత ఇష్టపడ్డ తల్లి మహాలక్ష్మిని వదిలిపెట్టి. ఇక్కడా కథ చెప్పింది కూతురే. తల్లిని పూర్తిగా ప్రేమిస్తున్న కూతురు, ఇష్టంతో తల్లిమీద ముచ్చటైన ఫిర్యాదులు మనతో చేసుకునే కూతురు. ఇక్కడ తండ్రికి వెళ్లిపోవడం మనస్పూర్తిగా ఇష్టం లేదనే ఆయన కథ చివర చెప్పుకున్నా అది అవసరంలేని సంజాయిషీగానే మిగిలిపోతుంది. తన మూడేళ్ళ వయసులో వదిలివెళ్ళిపోయిన తండ్రి నింపాదిగా జీవితం అంతా గడిపేసాకా అనుకోకుండా ఒంటరైన జీవన సంధ్యలో ఒకసారి తనను కలిసి వెళతాను అంటే సరే అనగలిగిన సంస్కారపు పెంపకంతో ఉన్న కూతురు. మహాలక్ష్మి పూర్తిగా నిర్లిప్తం దీనంతటిలో. ఈ కథ గురించి నాలుగు ఎక్కువ మాటలు రాయడానికి కారణం తల్లి వదిలివెళ్ళిపోయినప్పుడు, తండ్రి వదిలి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన మనిషి పిల్లల జీవితాన్ని ఎట్లా సంభాళిన్చారు అన్నది ఎదురెదురుగా నిలబెట్టి చూపించారు సత్యవతి గారు. దమయంతి కూతురికి మేనత్త ఆ మాత్రం అండగా దొరికి ఉండకుంటే ఆ అమ్మాయి జీవితం ఇంత స్థిమితపడేది కాదు. ఇప్పటికీ ఆ అమ్మాయికి ఒక చిన్న గింజులాట. వసంతకు వెళ్ళిపోయిన ఆ తండ్రితో సంబంధమే లేదు. కలవడానికి కూడా నిరాసక్తం. దమయంతి కూతురికి ఇప్పటికీ అమ్మ మీద ప్రాణమే, ఆమెని తిడుతుందన్న ఒక్క కారణం చేత అత్తని ఇప్పటికీ పూర్తిగా ప్రేమించలేక పోతుంది. వసంత జీవితంలో తండ్రి ఏమీ కాడు. ఈ వాన తొందరగా వెలిస్తే బావుండును, ఈయన వెళ్ళిపోతాడు కదా అనే అనుకుంటుంది. అమ్మ అన్న భావోద్వేగానికి నాన్న అన్న భావోద్వేగానికి అంత తేడా చూపించారు సత్యవతి. చినుకు సంపాదకులు నండూరి రాజగోపాల్ గారైతే ఈ ‘దమయంతి కూతురి’కి రెండు దశాబ్దాలుగా రంగం సిద్దం చేసారు సత్యవతి గారు అంటారు, తొంభైలలో వచ్చిన ‘అరుణ సంధ్య’ను , రెండు వేలలో వచ్చిన ‘వసుంధర’ ని ఉదాహరిస్తూ.
దమయంతి కూతురు చిన్నది అమ్మ వెళ్ళిపోయినప్పటికి. అమ్మ కనపడడం లేదన్నదిగులు, ఏమయ్యిందోనని ఏడుపు, బోలెడన్ని సందేహాలు, అమ్మ వస్తుందో రాదో అన్న బెంగ. నాన్నని అడిగితే కోపంలో విసిరికోట్టేలా వున్నాడు. అన్నని అడుగుదామంటే ఎంత పెద్దవాడు వాడు మాత్రం, అంతకీ అడుగుతుంది ఎందుకన్నా అమ్మ అలా వెళ్ళిపోవడం అని. వాడికి అప్పటికి ఏం తెలుసు. ఎందుకో వెళ్ళింది, అమ్మ ఇంక రాదు, మర్చిపో. నువ్వు ధైర్యంగా వుండి చదువుకో అని చెప్పగలుగుతాడు. వాడికీ బెంగ వున్నా చిత్రంగా తనకున్నంత కోపం లేదు. తను ఎట్లా మర్చిపోతుంది అమ్మను, అమ్మ మీద కోపాన్ని. రోజూ అద్దంలో తన ముఖంలో అమ్మ కనపడుతుంటే. సౌందర్య వాళ్ళింట్లో సంగీతం పాఠానికి వెళ్తే వాళ్ళమ్మ అమ్మని తిడుతుంటే. తనకి పాలు ఇచ్చి, కొంగుకు మూతి తుడుచుకోనిచ్చి, జడ దువ్వి, రజస్వల అయ్యిందని తెలియగానే ముచ్చటగా వేడుక జరిపించి, ఇంక స్థిరపడింది అనుకున్న దగ్గర్నుంచి పెళ్లి సంబంధాలు చూసి అమ్మంత అమ్మ కావలసిన అత్త అమ్మను అస్తమానూ తిడుతూ వుంటే. అమ్మ మీద తనకు కోపం వుండొచ్చు, తనని వదిలిపెట్టి వెళ్ళింది అచ్చం ఈస్టర్ ప్రార్థన చేసుకోస్తా అని వెళ్ళిన మార్గరెట్ లాగ. ఆ మెర్మాన్, మార్గరెట్ ల పిల్లల్లాగే తనూ అమ్మకోసం ఏడిచింది, అరిచింది, మొత్తుకుంది. ఆ అనురాధ టీచర్ ఎందుకంత లీనమై చెప్పాలి. అమ్మ కూడా మార్గరెట్ లాగే వెళ్ళింది. అమ్మ కూడా మార్గరెట్ లాగే ఇంక రాదు అని తనకి అర్థమయింది. క్రూయల్ షీ అని తను అనుకుంది. అందరూ అంటే ఎట్లా. అమ్మ తనది. చిత్రంగా మెర్మాన్ లాగా నాన్న ఏడవడం లేదు అమ్మకోసం ఇంకో ఆవిణ్ణి తీసుకొచ్చాడు కొన్నాళ్లకే. ఇంక నా ఏడుపు నాదే అనుకుంది తను. చదువే లోకం అనుకుంది. ఇంకొకరి జాలి వద్దు అనుకుంది. గడ్డ కట్టిపోయింది లోపల్నుంచీ. ఆ స్నేహ స్నేహంతో గడ్డగా వున్న తనను కరిగించి కొంచెం కొంచెంగా నవ్వుని, ఆనందాన్ని, సంగీతాన్ని, జీవితాన్ని నేర్పుతుంది. ఇప్పుడింక ‘ఆయియే హుజూర్ ఆప్ కో సితారోన్ మే లే చలూ’ అంటే కాస్త తెలుస్తున్నట్టే వుంది తనకు.
అన్న కొంచెం పెద్దవాడు కదా, వాడికి తొందరగానే తెలిసింది ఇంక అమ్మ రాదని. హాస్టల్ కి వెళ్ళడం వల్ల అయితే ఏమీ, అబ్బాయి కావడం వల్ల అయితేనేమీ, అసలు అమ్మ ప్రభావం వల్లనే అయితేనేమి వాడు నిజంతో తొందరగా రాజీ పడ్డాడు. తర్వాత అమ్మను అందరికన్నా మిన్నగా అర్థం చేసుకున్నాడు. మన బాధ బాధే కానీ చెల్లీ, దుఃఖంతో అమ్మ మనతోనే ఉండిపోతే ఆమె సంగతేంటి అని చాలా తొందరగా అడగగలుగుతాడు. మన పితృస్వామ్య సమాజంలో ఈ అన్న అంత తొందరగా నిజంతో నిబ్బరంగా సమాధానపడడం, తనని కూడా సమాధానపరచగలగడం రచయిత్రి సమాజంలో కోరుకుంటున్న ఆశావహమైన మార్పు. తండ్రికీ అర్థమయింది, కానీ చాన్నాళ్ళు పట్టింది.
తప్పొప్పులు ఎంచకుండా సహానుభూతితో దమయంతిని, దమయంతి కూతురు అర్థం చేసుకున్నట్లే వుంది. అందుకే దమయంతిని మచ్చలాగా కాకుండా తల్లి లాగ చూడగలిగే మనిషి వుంటేనే దమయంతి కూతురు వివాహబంధంలోకి వెళుతుంది. అప్పటివరకూ సంతోష్ ఫ్రమ్ సామర్లకోట అయినా దుర్గేశ్ ఫ్రమ్ దుగ్గిరాల ఐయినా మరలిపోవలసిందే.
వివాహేతర సంబంధాలలోని సంక్లిష్టత పిల్లల జీవితాలపై ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది, పిల్లలు ఎంత నలిగిపోతారు అన్న విషయాల్నిబయటి పొరలో సమర్థంగా చిత్రిస్తూనే, ఆ తల్లి ఆ పిల్లలకు అంత చిన్నతనంలోనే నేర్పిన విచక్షణనూ, వివేకాన్ని, మానవ సంబంధాల్ని కాస్త ఓరిమితో అర్థం చేసుకోగలిగే చూపుకి పునాదిని లోపలి పొరలో చూపుతుంది ఈ ‘దమయంతి కూతురు’.

No comments: