ఆడవాళ్లు తమ చుట్టూ గీసిన పరిధి దాటి జీవితాల, కథల కంట్రోల్ తమ చేతిలోకి తీసుకుంటే ఎట్లా వుంటుంది అన్న ఆలోచనతో అమెజాన్ వాడు తీసుకువచ్చిన షార్ట్ స్టోరీస్ కలెక్షన్ 'Out of line' సిరీస్. ఏడు చిన్న పుస్తకాలు. రాయించిన అందరూ బెస్ట్ సెల్లింగ్ authors. బహుశా రెణ్ణెల్ల ముందు చదివా, రాయడానికి కుదరలేదు. ఇప్పుడైనా కనీసం అవి ఒకటి ఉన్నాయని చెప్పడానికే ఈ పోస్ట్.
టీనేజ్ ప్రేమఫలాన్ని అమ్మాయి మాత్రమే స్వీకరించవలసి రావడం ఎక్కడైనా అదే చరిత్ర, ఆ పరిస్థితిని కొంత కొత్తరకంగా డీల్ చెయ్యడం ఓ కథ. పెరిగిన జనాభాతో వచ్చే సమస్యలు పడలేక రాజ్యం మాతృత్వాధికారాన్ని, పిల్లల పెంపకాన్ని చేతిలోకి తీసుకుంటే, పిల్లలు కావాలి అనుకునే సామాన్య జనాల గోల ఇంకో కథ. ఇట్లాంటి నేపథ్యంలోనే పిల్లల్ని కంటే పూర్తిగా హక్కులు కోల్పోయే పరిస్థితిలో బోలెడన్ని తర్జనభర్జనల తర్వాత ఈ రాడార్ నుంచి తప్పించుకుని బయటకు వెళ్లయినా మనిషి సహజమైన లక్షణం కాపాడుకోవాలనే ఇంకో జంట.
మధ్య వయసు దాటాక బాధ్యతలు తీరి ఇంక హాయిగా ఉండాలనుకునే టైమ్ కి భర్త ఇంకో అమ్మాయిలో ఇక్కడ చచ్చిపోయిన భావోద్వేగం చూసుకోవడం తదనంతర వ్యవహారాలు మరో కథ. మేధోలోకపు కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాస్ట్ ఒక సౌత్ కొరియన్ అమ్మాయి, ఇంకో అమెరికన్ అమ్మాయిని మాధ్యమంగా పెట్టుకుని.
చివరిది మాత్రం దారుణమైన కథ. పిల్లలు అందరూ ఒక రకమైన ఆలోచనలతో వుండరు, వాళ్ళు ఎట్లా పెరుగుతున్నది చూసుకోకుంటే ఎవరినైనా కాటువెయ్యగలరు అన్నది ఆలోచనకే వణుకు వస్తుంది.
గొప్ప కథలు అన్నీ అని చెప్పను, కొన్ని నాకు బాగా నచ్చాయి. కొన్ని ఇంకాస్త కచ్చితంగా చెప్పొచ్చు, కొన్ని మంచి పాయింట్ని అనవసర నేపథ్యంతో పెంచడం కనిపించింది, కొన్ని మంచి ప్రారంభాన్ని కొంచెంలో పోగొట్టుకున్నాయి. కానీ, అన్నీ అవసరమైన కథలు ఇప్పుడో, ఒకప్పుడో.... డిస్టోపియన్ కథలతో సహా. వీళ్ళు ఏమి రాస్తున్నారు అని తెలుసుకోవడానికైనా ఒకసారి చదవొచ్చు. Kindle unlimited లో అన్ని పుస్తకాలు లభ్యం.
No comments:
Post a Comment