Sunday, February 16, 2020

అనగనగగా ఒక చిత్రకారుడు – అన్వర్


అందంగా రాయబడ్డ అక్షరాలు అవును, నిజంగానే రాసినవే. లేత రంగుల బొమ్మలో కొమ్మమీద కూర్చున్న ఓ పిల్లోడు. ఇండియా పోస్ట్ వాళ్ళు ఇంకాస్త బుద్ధిగా రసీదు అంటించి ఉంటే నాకో మంచిబొమ్మ ఇంకా అందంగా మిగిలేది. రేఖాయత్ర ప్రచురణ అన్న అందమైన రంగుల అడ్రెస్ స్టికర్. అసలు కవర్ తెరవకముందే ఒక గొప్ప అనుభూతి, అడ్రస్ తీసుకుని పుస్తకం పంపడం అన్న పరమ యాంత్రికమైన బోరింగ్ పని ఇంత అందంగా చెయ్యొచ్చా అని. తెరిచాక ఒక అందమైన పసుపు అట్టపుస్తకం, నల్లటి ఎమ్బోజ్ చేసిన అక్షరాలతో ఒక పెన్సిల్ వీరుడు. ఒక చక్కని అభినందన లేఖ. అప్పటికి అనుక్షణికం మొదట్లో పెట్టిన ఇబ్బందుల్ని దాటేసి దారిలో పడ్డా, కానీ ఈ పుస్తకం చూశాక అట్లాగే పక్కన పెట్టెయ్యడానికి వల్లకాలేదు. ముందు పుస్తకం మొత్తం తిరగేస్తే అందమైన గొలుసుల శీర్షికలు. ఎర్రని తునకల excerpts. అవి చదివితే ఆ రాత చదవకుండా వదలలేము. సరే, అట్లా ఇట్లా చూద్దాం అని ‘అపురూపం’ పట్టుకున్నా. అన్వర్ గారికి బొమ్మలు ఎంత అపురూపమో, అనుభూతులు ఎంత అపురూపమో, మనుషులు ఎంత అపురూపమో, జీవితంలో మనం కృతజ్ఞతలు చెప్పుకోని సవాలక్ష అందివచ్చిన భాగ్యాలు ఎంత అపురూపమో భలే అపురూపంగా చెప్పారు. అసలాయనకి అక్షరం ఇంకా అపురూపం. బొమ్మలమీద ప్రాణం పెట్టుకునివుండకపోతే కచ్చితంగా అక్షరంతోనే నిండిపోయేది ఆ జీవితం. తర్వాతది ‘ప్రయాణం’, వున్న దగ్గర్నుంచి కదిలి బొమ్మ దగ్గరకు వెళ్లి బొమ్మను పట్టుకోవాలని మొదలెట్టి పిట్టంత భాగ్యంగా, చెట్టంత గంధంతో మనం బతుకుతున్నామా అన్న ప్రయాణం దాకా. ముందే చదివినా ‘సామజిక స్మగ్లర్లు’ భలే గొప్ప స్మగ్లర్ల కథ, ఇట్లాంటి ఒకళ్ళిద్దరు స్మగ్లర్లు నా స్నేహితుల్లో కూడా చిన్నతనంలో వున్నారుకదా, వాళ్ళు కూడా ఇప్పుడు అంతే వున్నారు. మా ఊరికెళ్ళినప్పుడు ఆ స్మగ్లర్ ఓ చాక్లెట్ ఐయినా ఊరకే ఇచ్చేమాటే, నేనుండేది రెండే నిమిషాలైనా. అమ్మయ్యో ఇట్లా ఈ మాయలో పడిపోతే చండీదాస్ సంగతేం కాను అని పక్కన పెట్టడమే, అంతకుమించి చదివింది జీర్ణం కావద్దూ. ఇంక అప్పట్నుంచీ రోజూ రెండు, మూడు చానా కదిలించేది ఒక్కటి చదివేదే గగనం అయ్యేది.

ఎన్ని మంచి కథల సంగతులో, గొప్ప సినిమాలు, పుస్తకాలు. అంత జ్ఞానం నేనే అట్టిపెట్టుకునేది ఎందుకు అని ఎంత ప్రేమగా పరిచయాలు రాసిపెట్టారో. అవ్వన్నీ చూట్టం చదవడం ఈ పుస్తకానికి మనం ఇవ్వగల అసలైన విలువ. ఈ పుస్తకం చదివీ, ఆ మనిషి అట్లా రాసాక కూడా ఆ ‘మహానగరంలో చిన్నబాలుడి’ని కలవాలని అనుకోకుంటే ఇంకేమి లాభం; గ్రీన్బూక్ లో రాసిన దారుల్ని చూడాలనుకోకుంటే ఇంకేం మనుషులం, పూనాచ్చి మేకపిల్లనీ, చిన్న పత్రికని నిలబెట్టుకున్న ఆ బంగారం లాంటి దంపతుల్ని, సత్యవతమ్మ కథల్ని తెలుసుకోవద్దూ, ఇవేనా ఇంకా యెన్నెన్ని వున్నాయో కదా. ఎంత మంది మనుషుల గురించిన కథలో. కళాకారుల అడ్డా మోహన్ గారేనా, పూనే మనిషైన గొప్ప బొమ్మలాయన రవి పరంజపేయేనా, ఎక్కడో మొదలై వేలాది మంది కళాకారుల్ని తయారుచేసిన ఆల్బర్ట్ డోర్న్యేనా, మన బాపేనా, బొమ్మయిల చంద్రనా, ఎర్రటి చిలుకల గురించి ఆరాటపడి వాటిని చూసాక గుండెలు పగిలేలా ఏడ్చిన వసుదేంధ్రనా, ఇంకెప్పుడూ అన్వర్కి ప్యాంటు షర్టు కుట్టలేని కిశోరేనా. ఎన్నెని కథలో.

చిన్నతనపు ఊసులూ, స్నేహితాలు, చిట్టి పొట్టి కోరికలు, పుట్టినరోజుకి సూపర్మాన్ కావాలనుకోవడాలు తీరా అయ్యేపోయాక ఇదేంటిరా నాయనా అనుకున్నా ముచ్చటే. అన్వర్లో చిన్నపిల్లాడు కనిపిస్తూనే వున్నా ఒక బెంగ పిల్లడు కూడా ఎప్పుడూ. అన్నకు తెచ్చిన షర్టు లాంటి అంగీ నాన్న తెచ్చివుంటే అమ్మ లేదన్న బెంగపిల్లాడు కొంచెం తక్కువే వుండేవాడేమో. ఇప్పుడింక ఒక భార్గవమ్మ బోలెడు చొక్కాలు కొనిపెట్టారట, అవి ఇంక వద్దనే చెప్పారు. ప్రేమ మాత్రం పంపమనికూడా.  ఆ పిల్లాడి ఇప్పటి బెంగలు కొంచెం వేరు మనం ఇంకాస్త మంచి మనుషులుగా ఎందుకు ఉండం, ఒక మంచి పుస్తకం ఎందుకు కొనుక్కొని చదవం, బోలెడంత కష్టపడి పక్క మనిషి చేసే ఒక పని మనకెందుకు వుచితంగా కావాలి, నిజ్జంగా మానవత్వంతో వున్న మనిషిని పిచ్చోడిగా ఎందుకు చేస్తారు, పిల్లల్ని ఎందుకు పిల్లలా వుండనివ్వం ఒక్క బెంగనా, ఇట్లాంటివి ఎన్నో. ఇవ్వి తీరేవా మరి!!

అన్వర్ రాత చదివించే రాత, కదిలించే రాత, లోపలున్న మనిషి రాసిన రాత, నేనిట్లా రాయొచ్చా లేదా అని ఆలోచించి రాయని రాత, స్వచ్చమైన రాత, మనిషిమీద బెంగపడ్డ రాత, అదే మనిషిని ప్రేమించకుండా వుండలేని రాత. ఓ అలౌకిక స్థితిలో మాత్రమే రాసేంత ఉద్వేగభరితమైన రాత. ముందు ఆ రాతకోసం చదవండి, తర్వాత మళ్ళీ మళ్ళీ ఓ పూనచ్చి చదువుతూ, ఓ గ్రీన్ బుక్ చూస్తూ.

ఒక్కటే కంప్లయింట్ అన్వర్ గారూ, పుస్తకం చేతిలోకి రాగానే ఒక మంచి బొమ్మలాయన రాసిన పుస్తకం అని మా మీనుకి చెప్పా, అదీ పుస్తకాన్ని తిరగేసి అమ్మా, బొమ్మలుబొమ్మలుగా వుంటే ఇంకా బావుండును కదా అన్నది. ఇంకో పుస్తకం వేసినప్పుడు మరి గుర్తుంచుకోండి ఆ మాట. సెలవుల్లో చదివిస్తాను దాని చేత. ఇంత మంచి పుస్తకాన్ని చాలా ప్రేమతో వేసి, అంతే గొప్పగా పాఠకులకు అందించినందుకు బోలెడు నమస్సులు మీకు🙏🙂

సిరా - రాజ్ మాదిరాజు

నవలలో చదివించే గుణం వుంది, 260 పేజీలు ఒకే సిట్టింగ్లో చదవడం చాన్నాళ్లకు (భవభవ బంధాలున్నా😉); ఇది వారి గురువుగారి ప్రభావమే నిస్సందేహంగా. తప్పక చర్చకు పెట్టవలసిన విషయం, అందులోనూ సందేహం లేదు. కానీ, (yeah, inevitable bit of poison) మాస్ మార్కెట్ ప్రొడక్ట్ చేయడం కోసం కొంచెం రాజీ పడ్డారు శక్తివంతమైన నవలగా రాయడంలో. పథేర్ పంచాలీ లకు అవార్డులు వస్తాయి గానీ ఎవరు చూస్తారు అనుకున్నారేమో. నిజమే ఐయినా. సినిమా ఫార్మాట్ లో ముందు ఆలోచించి తర్వాత నవలకు తెచ్చారు కాబట్టి ఎక్కువగా స్క్రీన్ ప్లే ఫార్మాట్లో వుంది నవలకన్నా, దీనివల్లే పైన నాకనిపించిన కంప్రోమైజ్ కూడా. మళ్లీ కానీ, ఈ విషయం పుస్తకం అవసరాన్ని ప్రాసంగికతను అస్సలు తగ్గించదు. It is highly relevant and a compelling read. 

విషయానికి వస్తే, పిల్లలు బతికుండి హాయిగా ఏదొకటి నచ్చింది చేయడం ముఖ్యమా వాళ్ళని రుద్ది రుద్ది ఏదో మనమనుకున్నది చెయ్యబోవడం, అందులో కొందరు ఊపిరాడని పిట్టల్లాగా రాలిపోవడం ముఖ్యమా అంటే నాతో సహా బుద్ది వున్న తల్లిదండ్రులు అందరూ మొదటిదే ఎంచుకుంటారని ఒక తప్పుడు నమ్మకమ్ ఒకప్పుడు వుండేది. ఇప్పుడస్సలు లేదు. రకరకాల కారణాలు చెప్పి పీర్ ప్రెషర్ తట్టుకోలేని తల్లిదండ్రులు పిల్లల్ని ఆ ఫ్యాక్టరీల్లోనే చేర్చుతున్నారు. వాళ్ళ కలల్ని పండించాల్సిన బాధ్యత పిల్లల భుజాలమీదే.  ఒకరకంగా మూర్తి ఆర్గుమెంట్ నిజం. 

రాజ్ గారూ, సిరాను సిరాలాంటి అనేక సంస్థలను ఆ ఇంజినీరింగ్ కాలేజీల్లా మూసేస్తే నేనూ చాలా సంతోషపడతాను. కానీ, అది నిజంగా అసలు సమస్యకు పరిష్కారమా!?  నేను అవుననలేను. తల్లిదండ్రులు ముఖ్యంగా మధ్యతరగతి తల్లిదండ్రుల పేరాశలు తుడిచిపెట్టుకుపోవాలి. ఐఐటీలో ఇంజినీరింగ్ విద్య అనే నిచ్చెనతో ఆకాశహర్మ్యాలు కట్టుకుంటున్న వాళ్ళకి అది కాని ఆల్టర్నేటివ్స్ తెలియాలి, వాటిమీద నమ్మకం కలగాలి. మీ పుస్తకంలో కూడా రాసారు ఆ కథలు, అట్లాంటివి ప్రచారంలోకి రావాలి. ముఖ్యంగా ఒక సమాజంగా విజేతని మాత్రమే నెత్తిన పెట్టుకునే సంప్రదాయం మారాలి. నిజమైన ప్రయత్నాన్ని అభినందించే గుణాత్మక మార్పు రావాలి.  అప్పటిదాకా సిరాని పాతిపెడితే అంతకుమించిన విషవృక్షాలు పుట్టుకొస్తాయి. సిరా కేవలం ఒక వ్యాపారసంస్థ. లాభం తప్ప ఇంకో ఆలోచన వాళ్లకు వుండదు, సిరాను ఎదగనిచ్చిన వ్యవస్థ మారాలి 'చైనా'లు, 'కోటా'లు వుండకుండా వుండాలంటే. 

మా యూనివర్సిటీకి కూడా మన పిల్లలూ ఎక్కువగానే వస్తారు. మీరు రాసినట్లుగానే అకాడమిక్ గా గొప్పగా వున్న పిల్లల్లో కూడా సాఫ్టుస్కిల్స్ శూన్యం. వాళ్ళు ఒక గుంపుగా చేరిపోయి ఇంక బయటకు రారు. మిగిలిన వాళ్ళతో కలవరు.  చొరవ వుండదు, కొత్త ఆలోచనకు తొందరగా స్వాగతం చెప్పలేరు. అసలు ప్రశ్నించడం చాలా తక్కువ. Individual గా మంచి performers ఎక్కువమంది. టీంలో కష్టం. ఆటల్లో పెద్దగా కనిపించరు. ఒక ఆన్సర్ స్క్రిప్ట్లో bookish డెఫినిషన్స్ ఉన్నాయంటే తొంభైశాతం మన పిల్లలే. నాతో పాటు నా కలీగ్స్ అందరూ ఈ ట్రెండ్స్ కనీసం రెండు మూడు సెమిస్టర్లకల్లా బ్రేక్ చెయ్యాలని చాలా ప్రయత్నం చేస్తాం. ఇక్కడి పిల్లలకు బుర్రలో శూన్యం వున్నా చొరవ, ప్రశ్నించడం, ఒకళ్ళతో పని చేయించడం, టీం గా పనిచేయడం బాగా తెలుసు. పని తెలివిగా పక్కన వాళ్లమీద వెయ్యడం తెలుసు. ముఖ్యంగా వాళ్ళు చాలా వరకూ ప్లస్ టూ లో కూడా బిజినెస్నే చదివి వస్తారు, మనవాళ్ళు దాదాపుగా 'చైనా'నే. తమిళనాడు, కేరళ, కర్ణాటక పిల్లల్లో మరీ ఇన్ని లక్షణాలు గంపగుత్తగా వుండవు. ముఖ్యంగా కేరళ పిల్లలు తొందరగా లీడర్షిప్ పొసిషన్స్కి వెళ్లగలరు చిన్న గ్రూపుల్లో అయినా. నార్త్ ఇండియన్ పిల్లలు కూడా వాళ్ళని టక్కున ఆక్సిప్ట్ చేసేస్తారు. ఇంత తెలివితేటలున్న మన పిల్లలు చిన్న చిన్న లైఫ్ స్కిల్స్ లేక వెనకపడుతున్నారనే దిగులు తగ్గనివ్వట్లేదు బ్యాచ్ తర్వాత బ్యాచ్. ఇవి వ్యవస్థాగత సమస్యలు. మౌలికమైన మార్పులు రావాలి, కంటితుడుపులు అస్సలు చెల్లవు. ఒక ఆశావహమైన మాట మా మీను అన్నది ఈ పుస్తకం గురించి దానితో మాట్లాడుతుంటే; అట్లాంటి కాలేజీలు పెట్టి ముప్పై ఏళ్ళు దాటాయంటే అందరూ వాటిల్లో చదివిన పేరెంట్స్ పిల్లల్ని అక్కడ చేర్చరేమో అని. నిజమేనా!! ఆ కాలేజీల్లో చదవడం ఆస్పిరేషనల్ విలువగా ఉన్న తల్లిదండ్రుల సంగతేంటీ? వీటికి ఆల్టర్నేటివ్ ఏంటి? చిక్కేమిటంటే, ఈ పుస్తకం చదవడం, ఈ మాత్రం ఆలోచన చెయ్యడం కూడా పిల్లల మీద ముందుగానే కాస్త ఎక్కువ కన్సర్న్ ఉన్న తల్లిదండ్రులే చేస్తారు. ఇది నిజంగా పెద్ద విషవలయం. ఏదేమైనా మీరు చేసింది చాలా అభినందనీయమైన ప్రయత్నం. మెయిన్ స్ట్రీమ్ లో చర్చకి రావలసిన అంశం. 

మీరు సినిమా చేయబోతున్నారు కనుక ఈ ఒక్క మాట రాస్తున్నాను, మనోహరమూర్తి వాచ్యంగా 'మాత్రమే' గొప్ప లాయర్గా కనపడ్డారు. సినిమాలో అట్లా చెప్పడానికి అంత నిడివి దొరకదని మీకు తెలుసు. పైగా, దాదాపుగా మొదటి ఇంటరాక్షన్ నుంచే he was in awe of Ram. ఇద్దర్నీ పోటాపోటీగా నిలబెట్టినప్పుడు రామ్ అతన్ని ఆల్మోస్ట్ తన దైవంగా భావిస్తున్నపుడు అతని బిల్టప్ ఇంకా ప్రత్యక్షంగా వుండాలి. రామ్ ఓడిపోతున్నట్టు కనపడ్డా నిజానికి అన్నిసార్లూ అతనే గెలిచాడన్న ధ్వని అంతర్లీనంగా వుంది. అది కొంచెం దెబ్బ మూర్తి పాత్రకి. రమ్య ఇంకాస్త గట్టిగా వుండొచ్చునండీ, మరీ అంత తెలుగు సినిమా హీరోయిన్ మల్లే వుండక్కరలేదు. నేను అట్లాంటి బ్రిలియంట్ పిల్లల్ని వందలమందిని రోజూ చూస్తున్నాను మరి. వాళ్ళల్లో క్లారిటీనే నాకు నచ్చే మొదటి అంశం 🙂 రామ్ తో సమానస్థాయి లేదా ఇంకాస్త ఎక్కువ బలంతో వీళ్లంతా వుంటేనే కదా అసలు కోర్టురూం డ్రామా మజా పండేది, రామ్ పాత్ర గట్టిగా నిలబడేది. ఇవేవీ మీకు తెలియనివి కావు. 

చివరగా పుస్తకంలో పరిశోధన, రీడబిలిటీ, సహజమైన భాష అమోఘంగా ఉన్నాయి. రెండవ ముద్రణలో ప్రూఫ్రీడింగ్ ఇంకాస్త క్లోస్గా చేయండి. తల్లిదండ్రులూ దయచేసి నిదానంగా చదవండి, ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. 

Raj గారూ, మీ గొప్ప మానవీయమైన ప్రయత్నానికి అనేకానేక అభినందనలు 💐

Thursday, January 30, 2020

ఈస్థేటిక్ స్పేస్

https://m.facebook.com/story.php?story_fbid=10221237459787672&id=1281734249

పుస్తకం

పుస్తకం బతకట్లేదు, చదవడం తగ్గిపోతుంది అని బాధపడేవాళ్లు నిశ్చింతగా వుండొచ్చు. ఇక్కడ నేను స్టాటిస్టిక్స్ రాయడం లేదు గానీ నేను చూసిన విషయం రాస్తున్నా. నిన్నటి వరల్డ్ బుక్ ఫెయిర్ లో నేను చూసిన వాళ్ళల్లో కనీసం 30 శాతం మంది 15 -25 సంవత్సరాల ఏజ్ సెగ్మెంట్. ఒక 50 శాతం రెండు మూడేళ్ల పిల్లలనుంచి 12-15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రుల సెగ్మెంట్. తక్కినవాళ్ళు మిగతా వర్గాలు. 

Hachette పబ్లిషర్స్ స్టాల్ లో ఓ సుమారు 20 ఏళ్ల అమ్మాయి ఒక డజను పుస్తకాల దొంతర పక్కన పెట్టుకుని బాసింపట్లు వేసుక్కూర్చుని ఇంకో పుస్తకం చదువుతుంది ఎంచడానికి. అంత రద్దీగా ఉన్నా ఆ అమ్మాయిని కదిలించకుండా జనాలు కదులుతున్నారు. ఇంకో దగ్గర ఓ పదమూడు పద్నాలుగేళ్ల పిల్ల 'ఇకిగై' ఉందాఅండీ అని స్టాల్ అతన్ని అడుగుతుంది. సగం మంది జనాలు ఉత్త చేతులతో కాదు చక్రాల బాగులతో మరీ వచ్చారు. రిషి అంత పిల్లలు సొంతంగా టైటిల్ చెప్పి పుస్తకాలు వెతుక్కుంటున్నారు. అన్ని వేల పుస్తకాల్లో వీడికి కావాల్సినవి వీడికి కనపడుతున్నాయి మిగిలిన పిల్లలకు లాగే. పిల్లల్లో రీడింగ్ హాబిట్ ఎట్లా డెవలప్ చేస్తున్నాం అని తల్లిదండ్రులు తమ చేస్తున్న ప్రయత్నాలను అక్కడ జరిగే ఒక వర్కుషాప్లో పంచుకుంటున్నారు. స్టోరీ టెల్లింగ్ వర్కుషాపులు, ఆథర్ మీట్లు, థీమ్ బేస్డ్ సెమినార్లు ఇంకెన్నో నడుస్తున్నాయి పార్లల్ గా. దగ్గర దగ్గర 500 స్టాల్ల్స్ మేము కనీసం చూడగలిగింది. ఆక్స్ఫర్డ్, మాక్ మిలన్, బ్లూమ్బరీ, హార్పర్ కాలిన్స్, సాహిత్య అకాడెమీ, NBT ఇత్యాది స్టాల్స్ స్టోర్స్ లాగే వున్నాయి. 

ఫ్లిప్ సైడ్ లేదా!? సగం పైన ఉన్నది ఇంగ్లీష్ పుస్తకాలే, బహుశా 70 శాతం. తెలుగు మాత్రమే కాదు మిగిలిన రీజినల్ భాషల స్టాల్ల్స్ కూడా లేనట్టే. హిందీ కొంత నయం. ఇంగ్లీషులో కూడా క్వాలిటీ రీడింగ్ ప్రాతినిధ్యం కొంచెం తక్కువే వుంది, స్టాల్స్ చూస్తూనే తెలుస్తుంది ఆ సంగతి. కాకుంటే చదవడం మొదలెట్టాక ఎలాగూ అప్గ్రేడ్ అవుతారు మెల్లగా.  

నా చివరి మాట, పుస్తకం నిలిచేవుంటుంది.

'రోమా'



ఒక సినిమా కథ మొత్తం రాయడం నాకు ఇష్టం లేని విషయం కానీ, ఈ సినిమా ఎక్కువమందికి అందుబాటులో లేకపోవడం వలన రాస్తున్నాను. నెట్ఫ్లిక్స్ సినిమా. చూడాలనుకున్న వాళ్ళు చూసాక చదవడమే నేను సజస్ట్ చేస్తాను.

మెక్సికో సిటీ సబర్బన్ అయిన కొలోనియా రోమాలోని ఒక సంపన్నకుటుంబంలో పనమ్మాయి క్లియో. సినిమాని ఎక్కువగా క్లియో కళ్ళ నుంచి చూపుతాడు దర్శకుడు అల్ఫాన్సో ఖ్వోరాన్. డెబ్భైల కాలం.

కుటుంబ యజమానులు సోఫియా ఆమె భర్త ఆంటోనియో. వాళ్ళ నలుగురు పిల్లలు (ఐదారేళ్ళ నుంచి పదకొండు పన్నెండేళ్ల పిల్లలు) సోఫియా తల్లి, క్లియో, ఇంకో పనమ్మాయి ఆడేలా ఆ ఇంట్లోని మొత్తం సభ్యులు. క్లియో ఆ ఇంటికి జీవనాడి. ఆ అమ్మాయి లేకుండా ఒక్క నిమిషం గడవదు. సోఫియాతో ముఖ్యంగా చిన్న పిల్లలతో తనకి చాలా సున్నితమైన సంబంధం వుంటుంది. ఆంటోనియో, సోఫియాల జీవితం ఒడిదుడుకులతో నిండి ఉందని చిన్నచిన్న సంభాషణల్లో తెలిసిపోతుంది. ఆంటోనియో రెండు మూడు సార్లు మాత్రమే కనపడతాడు మొత్తం సినిమాలో. 

క్లియో, ఆడేలా బయటకు వెళ్లిన ఒక సందర్భంలో క్లియోకి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న ఫెర్మీన్ తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారి ఆ అమ్మాయి గర్భం దాల్చుతుంది. ఈ విషయం తెలియగానే షరా మామూలుగా ఫెర్మిన్ తప్పుకుంటాడు. సోఫియాకి క్లియో భయం భయంగా 'నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారా' అంటూ ఈ సంగతి చెప్పగానే సోఫియా, క్లియో ని అక్కున చేర్చుకుంటుంది. ధైర్యం చెప్పి తనే దగ్గరుండి డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లి కావలసిన మందులు ఇప్పిస్తుంది. క్లియో, ఫెర్మీన్ ను మళ్లీ కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినా పెద్దగా లాభం వుండదు. ఈలోపు ఆంటోనియో, సోఫియాని వదిలేస్తున్నానని ఖాయంగా చెప్పేస్తాడు. సోఫియా ఈ సంగతి పిల్లలకీ, పనివాళ్లకు స్పష్టంగా తెలియనివ్వదు. క్లియో విషయాన్ని గ్రహిస్తుంది. సోఫియా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నా తను కాస్త దెబ్బతింటుంది. 

క్లియోకి నెలలు నిండుతాయి, పుట్టబోయే బిడ్డకోసం ఉయ్యాల కొనేందుకు క్లియోని తీసుకుని సోఫియా తల్లి షాపుకు వెళుతుంది. ఆ సమయంలో జరిగిన ఆందోళనల్లో క్లియో కి ఫెర్మీన్ గొడవ చేస్తున్న వ్యక్తుల్లో ఒకడిగా ఎదురుపడతాడు, ఎట్లాగో వీళ్ళకు హాని చేయకుండానే వెళ్ళిపోతాడు. ఈలోపు క్లియో ఉమ్మనీటి సంచీ పగలడం తో సోఫియా తల్లి, డ్రైవర్ క్లియోని తొందరగా హాస్పిటల్ కి చేర్చే ప్రయత్నం చేస్తారు, గొడవల నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యి రెండు గంటల తర్వాత కానీ హాస్పిటల్ చేరలేకపోతారు. డాక్టర్లు ఎంత చురుకుగా పనిచేసి తనకి డెలివరీ చేసినా క్లియో బిడ్డని కాపాడలేకపోతారు. 

సోఫియా పిల్లల్ని చిన్న వెకేషన్ కోసం బయలుదేరదీస్తుంది. వాళ్లతో పాటు క్లియోని కూడా వచ్చేందుకు ఒప్పిస్తుంది తనకు మార్పు కావాలని. అక్కడకు చేరాక పిల్లలకూ క్లియోకి చెప్పేస్తుంది ఆంటోనియో తనను వదిలేస్తున్న సంగతి, అతను తన సామాను తీసుకెళ్లిపోవడానికి వీలుగానే పిల్లల్ని ఈ వెకేషన్ కి తెచ్చిన సంగతి. అక్కడి బీచ్ లో ఆడుకుంటూ సోఫియా పిల్లల్లో మధ్యవాళ్ళు సముద్రంలో మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకుంటారు. క్లియో ఈత రానిదైనా పడుతూ లేస్తూ వెళ్లి ఆ పిల్లల్ని ఒడ్డుకి తెస్తుంది. ఈ లోపు అక్కడికివచ్చిన సోఫియాతో తనలో ఇన్నాళ్లు దాచుకున్న సంగతి చెప్పేసి ఏడుస్తుంది. తను, తన బిడ్డ బతకాలని కోరుకోలేదన్నదే ఆ విషయం. ఎంత క్షోభ ఫలితమో అంత విషాదపుకోరిక. 

టూకీగా కథ ఇది, కానీ కథకు మించిందే ఈ సినిమాలో ముఖ్యం. నలుపుతెలుపుల్లో తీసిన ఈ సినిమా దృశ్యాల్లోని అందం చెప్పనలవి కాదు. ఇంట్లో చూసే మామూలు దృశ్యాలు మెట్లెక్కడాలు, బట్టలు ఉతకడాలు, నేల కడగడాల్లాంటి అతి సాధారణ దృశ్యాలు కాన్వాస్లలాగా ఉంటాయి. పూర్తిగా సహజమైన పరిసరాలు, ఆ కాలపు వాతావరణం, ఎక్కువగా ఆ ఇంటి పరిసరాల్లోనే కథ నడిచినా మొనాటని ఉండదు. నటన అపూర్వమైన నటన అని ఎవరిదీ చెప్పలేం. చాలా సహజంగా ఆయా పరిస్థితుల్లో సాధారణ మనుషులు ఎలా స్పందిస్తారో దానికి ఒక స్థాయి తక్కువగానే వీళ్ళ స్పందనలు వుంటాయి. 

విడిపోవడాలు, బిడ్డని పోగొట్టుకోవడం, జీవితం నడుస్తున్న అంతస్తులో ఆకస్మికంగా మార్పు రావటంలాంటి అసాధారణ సంఘటనలు నడుస్తున్నా ఈ ఆడవాళ్లు ధైర్యం కోల్పోరు. ఒకరికి తోడుగా ఒకరుంటారు. ఈ తోడుంటమే ఈ సినిమాలో అపురూపంగా తోచే విషయం. 
సోఫియాకి ఆమె తల్లి బలం. ఆవిడ చేసేది కనిపించడమే సినిమాలో, కానీ తెలిసిపోతుంది. కుటుంబం మొత్తానికి సోఫియా మూలస్తంభం. పిల్లలతో చక్కటి అనుబంధం తనకి, ఉద్యోగరీత్యా ఎక్కువగా క్లియో మీదే ఆధారపడి వున్నా కూడా. క్లియో తమ జీవితాల్లో ఒక ముఖ్యమైన ఇరుసు అన్న గ్రహింపు సోఫియాకు ఎప్పుడూ ఉంటుంది. క్లియో కి ఒక అడ్మిరేషన్ సోఫియా పట్ల. యజమాని పనివాళ్ళు అన్న తారతమ్యాలు వుంటాయి, ఆవేవీలేకుండా ఉత్త మనుషుల్లాగే కూడా వుంటారు. పనమ్మాయిలు ఇద్దరు వుండగానే తోచే పిచ్చి రాజకీయాలేవీ వుండవు. ఇద్దరూ తోడుతోడుగా ఒకరికొకరు చెయ్యందించుకుంటూ పనిచేసుకుంటారు. నీ పనీ, నా పనీ అన్న లెక్కలు కనపడవు. ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటారు పనుల్లోనే. 

క్లియో ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు సోఫియా కానీ, డాక్టర్ కానీ అవసరానికి మించి ఒక్క ప్రశ్నా వెయ్యరు. ఆడేలా ఎంత సహాయం చేయగలిగితే అంతా చేస్తుంది క్లియో కోసం చివరిదాకా. క్లియోని డెలివరీకోసం తీసుకువెళుతూ సోఫియా తల్లి పడే ఆరాటం తక్కువది కాదు. హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు ఒక చక్కటి వ్యవస్థలాగా కనపడడం ఎంతో బావుంది. ఎక్కడా నిర్లక్ష్యంగా వుండరు. ఆంటోనియో ఆ హాస్పిటల్లోనే డాక్టర్. ఆ సమయంలో తనూ వచ్చి క్లియోకి ధైర్యం చెప్పి వెళ్తాడు.  

చాలా చోట్ల మెటఫోరికల్ షాట్స్ షార్ప్ గా ఉపయోగించున్నాడు దర్శకుడు. తమ ఇంటి ముందున్న ఇరుకుగా ఉండే గ్యారేజ్లో పట్టనంత పెద్ద కారుని వదిలించుకుని హాయిగా పట్టే చిన్న కారుని సోఫియా తెచ్చుకోవడం తను జీవితాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే. మార్షల్ ఆర్ట్స్ గురువు చూపించే వృక్షసనం లాంటి ఆసనాన్ని ఆ గురువూ, క్లియో తప్ప ఎవ్వరూ చెయ్యలేకపోవడం ఆ అమ్మాయికి జీవితంలో ఉన్న నియంత్రణ ఇంకా సమన్వయానికి ఉదాహరణ. ఇట్లాంటివి కొన్నున్నాయ్. అర్థం కాగానే ఒక చిన్న మెచ్చుకోలు ఇచ్చేస్తాం దర్శకుడికి. పల్ప్ సినిమా చూసినట్టు ఫ్లీటింగ్ ఆడియన్స్లా కాకుండా కాస్త నిదానంగా తరచి చూడాల్సిన సినిమా. 

విమర్శ తక్కువగానే ఉన్నా పూర్తిగా అతీతమైన సినిమా కాదు ఇది. మెక్సికోలో జరిగిన అంతర్గత కల్లోలాల్ని నేపథ్యంలో ఉంచినా దాన్ని సరిగ్గా చెప్పలేదని కొందరు విమర్శించారు. తన సినిమాకి ఏది బాక్డ్రాప్లో ఉండాలో ఏది ఫోర్గ్రౌండ్లో ఉండాలో ఈ దర్శకుడికి తెలిసిందని నాకనిపించింది. క్లియో పరంగా కథ చెప్పినా క్లియో పాసివ్ గా వుందనేది ఇంకొక పెద్ద విమర్శ, ఇది విమర్శ కాదుగానీ ఆ అమ్మాయి ఆక్టివ్ వాయిస్ అయితే పనివాళ్ల దృక్పథం ఎక్కువ ఎలివేట్ అయ్యేదని ఆ విమర్శ ఉద్దేశ్యం. ఇది సరిగానే అనిపించినా క్లియో ఇంకోలా ఉంటే అది ఇంకో సినిమా, 'రోమా' కాదు. నాకైతే రోమా తలుచుకుంటే ఎప్పటికీ అతి తక్కువ ఎక్స్ప్రెషన్స్ తో వుండే క్లియో మొహం మాత్రం గుర్తుంటుందేమో ప్రస్ఫుటంగా. ఈ 'రోమా' కి ఈ క్లియో నే తగినదని నా ఉద్దేశ్యం. 

ఇంక బోలెడంత ప్రశంసను మూట కట్టుకుంది. ఏ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లినా అవార్డు తెచ్చుకోకుండా వెనక్కు రాలేదు. గోల్డెన్ లయన్లు, గోల్డెన్ గ్లోబులు అలవాటుగా గెలుచుకుంది. పది అకాడెమీ అవార్డులకి నామినేట్ అయ్యి మూడు విభాగాల్లో (సినిమాటోగ్రఫీ, ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, డైరెక్టర్) అవార్డులు గెలిచింది. చివరి విభాగంలో ఒక విదేశీచిత్రం అకాడెమీ అవార్డు గెలిచింది ఈ చిత్రానికే.

నిఖార్సయిన సినిమా మీద ఇష్టం వుండి అవకాశం ఉన్న అందరూ చూడమనే చెప్తాను.

చిగురాకు రెపరెపలు - మన్నెం శారద




బాల్యం అందరిదీ ఒక్కలాగే వుంటుంది ముచ్చటగా, ఇంకెందుకూ రాయడం అన్న శారద గారిని ఒప్పించి వారి చెల్లెలు ఈ పుస్తకం రాయించి ఎంతమంచి పని చేశారో. అందరి బాల్యంలో ఆనందకరమైన జ్ఞాపకాలుంటాయి, కానీ కొన్ని ప్రత్యేకంగా వుండేవి కూడా వుంటాయి. శారద గారి చిన్నతనంలోని కథల్లో అల్లరిని ఎక్కువ అల్లరి చేసిన పెద్దలంతా రిలేట్ చేసుకోగలరు. కానీ కొన్నిసార్లు గుండె గొంతుకలోకి వచ్చి కొట్టాడినట్లుండే చిన్న చిన్న సంఘటనలు చాలా కదిలించివేస్తాయి. 

ఈ పుస్తకంలోని చిన్నారి కథానాయకి శారద కుటుంబం చాలా పెద్దది, సొంత కుటుంబమూ, ఉమ్మడి కుటుంబమూ అన్నీ పెద్దవే. అసలు ఎవరు ఎవరి పిల్లల్లో అన్నంత తేడా తెలియని ఇష్టాలు పిల్లలమీద అప్పటి కుటుంబాల్లో. పెదనాన్నకు,నాన్నకు,అమ్మమ్మకు, అత్తలకూ, పెద్దమ్మకూ అందరికీ శారద అల్లరి పిల్లే కానీ చాలా ఇష్టమైన పిల్ల కూడా. మరీ ప్రాణం మీదకు తెచ్చుకునే అల్లరి చేసినప్పుడు తప్ప అన్నిసార్లు వెనకేసుకొచ్చేస్తారు.

తెలివైన పిల్ల, ఆలోచన ఉన్న పిల్ల, ప్రశ్న తెలిసిన పిల్ల,లోకం లెక్కలు అస్సలు తెలియని పిల్ల (తెలిసే వయసూ కాదు) మరి కొంచెం కష్టమే ఈ పిల్లతో వేగడం. నల్లగా వుండటం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇంగితం లేనివాళ్ళు సరే కన్నతల్లి కూడా కొద్దిగా దూరం పెడితే ఆ కష్టం చిన్నదెట్లా. అందుకే అంత అలవిమాలిన అల్లరి అయినా అవతలివాళ్ళని ఇబ్బంది పెట్టింది తక్కువ, తను ఇబ్బంది పడింది ఎక్కువ. అట్లా అల్లరితో ఐయినా అమ్మ తనను పట్టించుకోవాలని చిన్నపిల్ల శారద ప్రయత్నాలు చూస్తే అట్లాగే పేజీల్లోకి దూరిపోయి వాళ్ళ అమ్మమ్మలాగే నీ అంత కళ వున్న మొహం ఎవరికుందమ్మా, కృష్ణమ్మ లాగా ఉన్నావని చెప్పి దగ్గరకు తీసుకు బుగ్గలు పుణకాలనిపిస్తుంది. ఎన్ని కళలో అంత చిన్నతల్లికే 💖 
తల్లులు కారణాలు ఏవి ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని తేడాగా చూడకూడదు. ఇక్కడ ఈ చిట్టితల్లికి మిగిలిన అందరి ప్రేమా పుష్కలంగా దొరికినా ఎంత కొరవ ఉండిపోయిందో జీవితంలో!! ఇట్లా కూడా దొరకని పిల్లల మాటేమిటి!? 

ఎందరెందరు ప్రేమించేవాళ్లో శారద చుట్టూ. అమాయకమైన అల్లరీ, తెలివిడితో చేసే అల్లరీ, బంగారం లాంటి మంచితనం, పెద్దపిల్లలు వెనకుండి అల్లరి చేయిస్తే అమాయకంగా అమ్మతో దెబ్బలు తినడం, బోలెడన్ని ఊళ్ళు తిరగడం, పువ్వులు పిట్టలు చూసి మైమరిచిపోవడం, వద్దన్న డాన్సులో, బొమ్మలు వేయడంలో, రాయడంలో అన్నింట్లో మిన్న కావడం వెరసి ఒక అపురూపం 'మన్నెం శారద' గారు. 

బల్లికి చేసే శ్రాద్ధకర్మలూ, జైలు ఖైదీల కోసం దోసెలు వెయ్యడం, బావి మీద ఉయ్యాల ఊగడం, పిల్లల్ని సరిగా చూసుకోకుంటే నాటకం రాసి మరీ ఆ చుట్టాల బండారం బయటపెట్టడం అమ్మో!! ఇంకెవ్వరూ చేయలేరు 😁 శారద గారూ మీరు భలే గొప్పోళ్లండీ 😊🙏

భలే నవ్వొచ్చే ముచ్చట్లు అన్నీ. చిన్ని పుస్తకం. ముచ్చటైన చిన్నతనపు కథ. శారద గారి కథనానికి నేను చెప్పగలిగే మాటేముంటుంది, మీరు పుస్తకం పట్టుకుంటే చాలు, ఆవిడే చదివిస్తారు హాయిగా.

అనుక్షణికం - వడ్డెర చండీదాస్



సుమారు తొమ్మిది వందల పేజీల పుస్తకం. నూట ముప్పై నాలుగు చాప్టర్లు. కనీసం వంద పేజీల వరకూ ముఖ్య పాత్రల పరిచయాలు. తక్కువలో తక్కువ యాభై దాకా గుర్తుంచుకోవలసిన పాత్రలు. ప్రతి పాత్ర సమగ్రమైన పరిచయం. రూపురేఖావిలాసాల (ముఖ్యంగా స్త్రీ పాత్రలు) నుంచి వారి హావభావాలు, వ్యక్తిత్వం వరకూ. ఒక పాత్ర గురించి రాస్తూనే ఆ పాత్ర నుంచి ఇంకో పాత్రకు ప్రయాణం. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ పద్ధతిలో రాసిన నవల చాలా భాగాలలో. పదేళ్ల సామజిక, రాజకీయ, విప్లవ భావజాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన కథ. ఇన్ని పాత్రల్ని అతి తక్కువ వ్యవధిలో పరిచయం చేస్తూ రావడం వల్ల ఒక పది చాప్టర్లు చదివేకల్లా పాఠకుడు గందరగోళంలో పడిపోయి ఇంక ఆ పుస్తకాన్ని పక్కనపెట్టే ప్రమాదం ఎంతైనా వుంది. బహుశా నేను ఈ పుస్తకం చదవవలసిందే అన్న పట్టుదలతో మొదలుపెట్టడం మూలానా ఆ మొదటి ప్రతిబంధకాన్ని దాటగాలిగాను. ఒక పదిహేను ఇరవై చాప్టర్లు కష్టపడితే అప్పటికి ముఖ్య పాత్రలు కాస్త కుదురుకుని కథ నడవడం మొదలెట్టి పాఠకునికి కొంత ఆసక్తి కలుగుతుంది. కానీ, అందరు రచయితల్ని చదవడానికి అందరు పాఠకులూ ఇంత కష్టపడడానికి సిద్దంగా వుండకపోవచ్చు. కాబట్టి, కనీసం కొత్త రచయితలకూ ఈ పద్దతి ఎంత మాత్రం మార్గదర్శకం కాదు.  

ఇంకొక గమనింపు, అనుక్షణికం చదివేక ఓ నవలను సీరియల్గా రాసే రచయితల పరిమితులు నాకు కొంచెం అర్థం అయినట్లే ఉంది. ప్రతి వారం కొంత కథ చెప్పాలి, కావలసిన గుర్తులు చెప్పాలి పాత కథ నుంచి. కొత్త పాత్రలు పరిచయం చేయాలి, కొన్ని మలుపులు తిప్పాలి, కీలకంలో ఆపేయాలి. వీలైతే కొంత అప్పటి సమాచారం కలపాలి. వెరసి ఇప్పుడు నవలగా చదువుతున్న పాఠకులకి చాలా ఎక్కువ అనవసర సమాచారం కనపడటం. రచయితలు తమకు తెలిసిన సమచారం అంతా దట్టించి రాస్తున్నారని కొంచెం చిరాకుగా వుండేది. ఇప్పుడు అట్లా సీరియలైజ్ అయి నవలలుగా మారిన కథల్ని ఇంకాస్త సహనంతో చదువుకోగలను. 

అనుక్షణికం చదువుతున్నంతసేపూ చండీదాస్ కు వున్న బహుముఖీనమైన ప్రజ్ఞ గురించి ఆశ్చర్యపడకుండా ఉండలేము. కానీ రచయిత ప్రజ్ఞా ప్రదర్శనతోనే గొప్ప నవల సృష్టించవచ్చా అంటే అంత తేలిక సమాధానం ఇవ్వలేము. ఆ కథకు అవసరమైన పరిజ్ఞాన ప్రదర్శన మాత్రం చేస్తే కథలో ఇమిడిపోతుంది, లేనప్పుడు ఆ ఎక్కువలంతా బయటకు వచ్చి సరైన ఆకృతిలో కథ కనిపించదు. అనవసరమైనది అంతా నిర్దాక్షిణ్యంగా చెక్కివేయడమే శిల్పం అని నేను చదివిన అతి సులువైన నిర్వచనం ఉత్త శిల్పానికి సంబంధించి. చదివించే గుణం ఉండీ, పాఠకుని మనస్సులో చెరగని ముద్ర వేసిన కథ - మంచి శిల్పం ఉన్న కథే! అని విష్ణుభొట్ల లక్ష్మన్న గారు తేల్చేసారు. ఆ లెక్కలో కనక చూస్తే కొన్నిచోట్ల అనవసరాలు వున్నా, చదివించే గుణంలో కొంత కొరవ వున్నా కథగా అనుక్షణికం మంచికి కాస్త తక్కువలో ఆగుతుంది. సరే, ఇది నా అవగాహన కోసం రాసుకున్న పేరానే కాబట్టి మీరు సేరియస్గా తీసుకోనక్కరలేదు.

ఇంక కథ విషయానికి వస్తే డెబ్బైల కాలపు సుమారు ఒక పదిహేను, ఇరవై మంది ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కళాశాల విద్యార్థుల జీవితాల్లో పదేళ్ళ కాలంలో జరిగిన ఉత్థానపతనాల సంగ్రహమే ఈ కథ. నాయకుడు, నాయిక అని ఇద్దరిని చూపలేము కానీ, శ్రీపతి, స్వప్న రాగలీన ప్రస్ఫుటంగా మిగిలిన వారికంటే ఎత్తులో నిలబెట్టబడి కనిపిస్తారు నవల మొత్తం. చండీదాస్ వాచ్యంగా చెప్పకపోయినా ఈ పాత్రలు ఆయన అభిమాన పాత్రలు అని పాఠకుడికి తెలిసిపోతాయి. స్వప్న రాగలీన ను వొక ఎత్తైన దైవీ పీఠం మీదనే కూర్చోబెడతారు అయన స్పష్టంగా. శ్రీపతి చండీదాస్ కి కథలోని గొంతు, ఆయన ఎక్స్టెండెడ్ వాయిస్. ఒక విధంగా చెప్పాలంటే కథకుడికి కథను మించి చెప్పాలనుకున్న ప్రతీ మాటకి మైక్ శ్రీపతి. శ్రీవతి కూడా ఒక ఊర్థ్వ ప్లేన్ లోనే ఉంటాడు. కథలోని మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలూ అందరూ మూకుమ్మడిగా శ్రీపతిని గౌరవిస్తారు. శ్రీపతి చదవని చదువు లేదు, తనకి తెలియని విషయం లేదు, ఇష్టపడని మనుషులు దాదాపుగా లేరు. జమిందారీ వారసుడు, జమీల మీద ఆసక్తి లేదు. మంచితనం నిండుగా వున్న మనిషి. అవసరంలో వున్న వాళ్ళని ఆదుకునేందుకే ప్రయత్నం చేస్తుంటాడు. మిగిలిన వాళ్ళ కన్నా కొంత ఎక్కువ నయం అమ్మాయిలని సభ్యంగా చూసే విషయంలో.  ఈ విషయంలో మోహన్ రెడ్డి ఉత్తమంగా కనపడతాడు. ఒక పీజీ తర్వాత ఇంకొకటి చదువుతూ కథాకాలం పదేళ్ళూ దరిదాపుగా యూనివర్సిటీలోనే ఉంటాడు. కథా ప్రారంభం ముగింపూ ఇతనితోనే. 

మోహన్ రెడ్డి, గాయత్రి కథలోని ప్రముఖమైన విప్లవ స్వరాలు. విరసం సభ్యులు. గాయత్రి కి మెహర్బానీ విప్లవం అంటే చీదర. మోహన్ రెడ్డి అందరినీ ఓపికగా కలుపుకుపోవాలనే తత్త్వం వున్న మనిషి. ఇద్దరూ లా చదువుతారు. గాయత్రి చట్టాన్ని అడ్డుపెట్టి న్యాయానికి న్యాయం చెయ్యలేమని గ్రహించి చదువు పూర్తి చేయదు. మోహన్ రెడ్డి ప్లీడర్ గా అణగారిన వాళ్ళకి సహాయం చేస్తున్న క్రమంలో తనూ తెలుసుకుంటాడు. కథ మధ్యలో పెద్దలు కాదన్నాక సహజీవనం మొదలుపెడతారు, వారి జీవితం అనేక మలుపులు తిరిగి చివరికి అడివిని చేరుతారు ఇద్దరూ. 

స్వప్న రాగలీన ను పరిచయం చేసిన దగ్గర్నుంచి ఆవిడ చుట్టూ వున్న అందరూ తన మాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావంలో పడ్డట్టుగానే చూపిస్తారు చండీదాస్. ఈ పాత్ర ఆయన స్వప్న సుందరి బహుశా, నిస్సందేహంగా అధిలోకపు జీవి. స్వప్న రాగలీనని వర్ణించడానికి చండీదాస్ వాడుకున్న ఉపమానాల దగ్గరనుంచి మొత్తం ఆవిడ శారీరక లక్షణాలు, గుణగణాల వర్ణన దాకా అన్నీ భౌతికతకు పై స్థాయిలోనే వుంటాయి. ఆవిడ ప్రేమించిన అనంత రెడ్డి చదువులోనూ, తన కళ లోనూ జీనియస్; రూపంలో స్వప్నకు తగినవాడు. పెద్ద అడ్డంకులుఏవీ లేకుండా కొంత కాలపు అవసరమైన ఎడబాటు మాత్రమే అనంత్ రెడ్డి చదువు రూపేణా అడ్డంకిగా వుండి కలిసిన ఒకే ఒక ముఖ్యమైన జంట వీళ్ళది. కానీ, స్వప్న ఈ లోకపు జీవి కాదని చండీదాస్ తీర్మానం కావున తను ఈ లోకానికి చెందదు. అచ్చంగా ప్రేమించిన అనంత్ రెడ్డి స్వప్నను కోల్పోయి మతిలేని లోకానికి చేరతాడు. 

నిజాం కాలేజీలో చదివే రవి తన ఇష్టాన్ని లెక్కచెయ్యకుండా కూతురితో వివాహం నిర్ణయించిన మామను ఎదిరించి ఆయన డబ్బుతో ఇంక చదవడం ఇష్టంలేక చదువు మానేసి ఒక కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి రాష్ట్ర మంత్రిగా ఎదిగేదాక ప్రయాణిస్తాడు. ఎన్నో మెట్లు ఎక్కుతాడు, అంతకు మించిన లోయల్లోకి జారిపోతాడు. గంగి తనకు నాణ్యంగా మొదలైన తోడు. రవిని మించిన అగాథాల్లోకి రవి కంటే ముందే ప్రయాణించి తనతో పాటు లాక్కువెళుతుంది. రవిని ప్రేమించిన నళిని దొరికిన అంకినీడు తో సర్దుకుని అతనిలోని దౌర్బల్యాలన్నింటినీ సమూలంగా నరికి పారేస్తుంది ఏమాత్రం కారుణ్యం చూపకుండా, తనకు కావలసిన మనిషిగా తయారయ్యే దాకా. 

తార ప్రస్థానం వస్తు వ్యామోహంతో, పై స్థాయి సమాజపు గుర్తింపు కాంక్షతో తనతో పాటు భర్తను కూడా కిందికి లాగుతూ   నీచంగా చూడబడే పాత్రగా మొదలయ్యి చివరికి తనని చూసి లోకం జాలిపడవలసిన స్థితిలోకి చేరి జీవితాన్ని అంతం చేసుకుంటుంది.  రామ్మూర్తి కథాగమనం మొత్తం కనపడుతున్నా ఎంతమాత్రం ప్రభావశీలమైన పాత్ర కాదు. అన్నాచెల్లెళ్ళు వరాహ శాస్త్రి, చారుమతి పెద్దగా చెదరని ప్రశాంత జీవులు కథ మొత్తంలో. విజయకుమార్ పరమ దౌర్భాగ్యపు ప్రవర్తనతో మొదటి భార్య చావుకు కారణమై, కాస్త గట్టిగా నిలబడ్డ రెండవ భార్య చేతిలో పూర్తిగా వంగుతాడు. ఇట్లా చెప్పుకుంటూ పొతే ఎన్ని పాత్రలో. దానికన్నా ముఖ్యం ఆలోచనలు కదా!!

ఈ పుస్తకం మీద వున్న ప్రధాన విమర్శ స్త్రీ పురుష సంబంధాల్లోని లైంగికత గురించి విపరీతమైన ప్రాసంగికత. లైంగిక సంబంధాలను గురించి పుస్తకంలో రాయడం తప్పు కాకపోవచ్చు, కానీ కథకు ఎంత అవసరం అన్న అదుపు రచయిత నిర్ణయించుకోవలసినదే. చండీదాస్ తను ఇచ్చిన పాఠకుల ప్రశ్నలకు సమాధానాల్లో తనని తాను ఎంతయినా  సమర్థించుకుని వుండవచ్చు గాక, నాకు మాత్రం ఆయనతో ఏకీభావం లేదు ఈ విషయంలో. మళ్ళీ భాష విషయంలో నేను రచయితని నెత్తిన పెట్టుకోగలను. అనుక్షణికంలో ఆయన అన్ని మాండలికాలకు చోటు కల్పించారు. రాసిన అన్ని యాసల మీదా ఆయనకు మంచి పట్టు వుంది. మళ్ళీ ఇందులో చెడ్డ పాత్రలు వ్యావహారిక తెలుగు మాట్లాడకపోవడం కొంచెం ఆలోచనలో పడవేసే విషయమే  చెడ్డ పాత్రలన్నీ గుండు గుత్తగా ఒక ప్రాంతపు యాసనే వాడతాయి. మంచి పాత్రలు దాదాపుగా ఒక ప్రాంతం నుంచే వచ్చాయి. ఏదేమైనా అసలంటూ రకరకాల యాసల్ని రాయటం మంచి విషయమే. 

వీటికి మించి నాకు ప్రధాన సమస్య గా కనిపించిన విషయం విపరీతమైన ఆబ్జేక్టిఫికేషన్ ఆఫ్ వుమన్. ఆడవాళ్ళ పాత్రలని అతి ఎక్కువగా రక్త మాంసాల్లోనే దర్శించారు రచయిత. ముఖాలని అసలు చూడబుద్ది కాదు ఆయనకు మిగిలిన అవయవాలే కాని. స్వప్న రాగలీన ని తప్ప మిగిలిన వాళ్ళని వర్ణించాలంటే చూడబుద్ది కాని రూపం, ముక్కు తెచ్చిపెట్టినట్టున్న రూపం, రంగు పాలిపోయిన రూపం, లావణ్యం అస్సలు లేని ముఖం, చెక్కేసిన ముఖం. మగవాళ్ళ పాత్రలను మరి ఇట్లా కొలతలతో పరిచయం చెయ్యలేదు వాళ్ళకు హావభావాలు మాత్రం చాలు. ఇంకొక విషయం చక్కనివాళ్ళు మంచివాళ్ళే ఎక్కువసార్లు. రచయిత ఇంకెవరైనా అయ్యుంటే బహుశా నాకు ఈ పేరా రాయడం ముఖ్యమయ్యేది కాదు. చండీదాస్ హిమజ్వాలలో గీతా దేవిని అత్యంత మహత్తరమైన పాత్రగా తీర్చి దిద్దరాని చదివిన అందరూ చెప్పాక ఆయన నుంచి ఇటువంటి పలుచదనం స్త్రీ పాత్రలకు ఆపాదించబడుతుందని ఎదురుచూడలేదు. స్వప్న రాగలీన ను కొలతగా ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్న రావచ్చు, ఆవిడని అధిమానవ పాత్రగా సృష్టించడం వల్ల. ఆమె రక్త మాంసాలున్న మనిషి కాకపోవడం వల్ల. ఈ నవలలోని స్త్రీ పాత్రలన్నింటిలో కాస్త గట్టి ఆలోచన  ఉన్న పాత్ర గాయత్రిదే. ఆ గాయత్రి ఆలోచనలు కూడా ఎక్కువసార్లు వితండవాదంలా కనిపించడం కూడా ఆశ్చర్యమే. దాంతో చాలా బలంగా ఉండవలసిన పాత్ర చాలాసార్లు కేరికేచర్ లాగ కనపడుతుంది. విరసంలో వున్న తన మేల్ కౌంటర్పార్ట్శ్ అట్లా వుండరు, వాళ్ళకు అందరికీ పట్టు విడుపులు తెలుసు. సరే, ఆడవాళ్ళలో ఒక్క వేశ్యావృత్తిలో ఉన్నవారి పట్ల మాత్రం పూర్తి ఎంపతీ కనపడుతుంది రచయితలో. అంతవరకూ  సంతోషిన్చాల్సిందే.

వీటికి మించి అప్పటి రాజకీయ వాతావరణపు చిత్రణ మాత్రం అత్యంత నిజాయితీగా సాధ్యమైనంత వివరంగా ఇచ్చారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రాజకీయాల మీద సమగ్రమైన వ్యాఖ్యానం, అంతర్జాతీయ వ్యవహారాలపైన విహంగ వీక్షణం ఇచ్చారు. డెబ్బైలని దాదాపుగా ఒడిసిపట్టారు. ఘనం శీనయ్య జావళీల నుంచి, చారుమతి వీణ, అనంత్ గిటార్ల సాక్షిగా నికోలాయ్ రోరిక్ గంగావతరణం పెయింటింగ్ దాకా ఇందులో లేనిది లేదు. నిస్సందేహంగా అనితరసాధ్యమైన రచన, మీకు ఆభిరుచి వుంటే కొంచెం కష్టపడైనా తప్పక చదవండి. విమర్శలు చూసి ఆగకుండా మీకు మీరుగా తేల్చుకోండి. ఇది అసమగ్రమే, కానీ ప్లాట్ఫారం పరిధికి మించి రాసాను కాబట్టి ఇక్కడితో ఆపుతునాను. 

#sRatnakaramWrites #Anukshanikam

పచ్చందనమే

'అలలే లేని సాగర వర్ణం..
మొయిలే లేని అంబర వర్ణం..
మయూర గళమే వర్ణం..
గుమ్మాడి పూవు తొలి వర్ణం..'
మహా ఇష్టమైన పాట. మొత్తం పాట ఇష్టమైనా ఈ లైన్లు కాస్త ఎక్కువ. ఆ షాలినిపిల్ల ఆ నీలాల్లో ఎంత అందంగా వుంటుందో 💖 ఈ పాట విన్నది వందలసార్లుంటే చూసింది కనీసం పదుల సార్లు. 

ఆ విజువల్ బ్యూటీ, లిరికల్ బ్యూటీల్లో పడి ఎప్పుడూ గమనించినట్టేలేదు నేను. మాయురగళం దాకా సరిగ్గావచ్చేసి అక్కడ 'గుమ్మాడిపువ్వ'య్యింది. నాకు పల్లెల పరిచయం అతి తక్కువ కాబట్టి గుమ్మడి పువ్వును చూసిన గుర్తు లేదు. కానీ, బొమ్మల్లో చూసిన దాన్ని బట్టి ఏ రంగులో ఉంటుందో ఒక ఊహ వుంది. తొలి వర్ణం మహా ఐయితే లేతాకుపచ్చ నుంచి పసుపు కావాలి, ఈ నీలం ఎట్లా వచ్చిందీ అని కొంచెం బుర్ర తడుముకున్నా. నాకు సరిగ్గా తెలిసుండదు అని ఇంకాసిన్ని బొమ్మలు చూసినా గుమ్మడి పువ్వు గుమ్మడి పువ్వే😁 మొత్తానికి అసలు లిరిక్స్ చూస్తే పోలా అన్న ఆలోచన వచ్చి చూసా. 

ఇదీ అసలు మాట
'Alaiyillaadha Aazhi Vannam, Mugililladha Vaanin Vannam, Mayilin Kazhuththil Vaarum Vannam, Kuvalai Poovil Kuzhaiththa Vannam'

దాని అర్థం
'The color of the sky without darkness! The color of the sky without clouds. The Peacock’s neck’s color. The color of the water-lily!'

ఆ నీటి కలువ నీలి కలువే కావాలి కదా మరి, అదీ సంగతి. మళ్లీ తెలుపు కాదు. 😊

ఇది పెద్ద విషయం కాదు గానీ, ఎన్ని తమిళ పాటలు తెలుగులో వింటూ అదే పదాల కూర్పు అనుకుంటామో కదా!! చేసిన పాటలో వున్న సంగీతానికి తగ్గట్టు సరైన అర్థం ఉన్న పదాలు ఏరుకుని ఆ వరసలో కూర్చోబెట్టాలి. బహుశా ఇట్లాంటివి చాలా వుండబట్టేనేమో అనువాదాలు చేసిన వాళ్ళల్లో కూడా కొంతమందికి చాలా మంచిపేరుంది వెన్నెలకంటి గారి లాగా, అర్థం పోనివ్వరని. ఏదేమైనా వాళ్లందరికీ బోలెడన్ని దణ్ణాలు 🙏🙏🙏

Tamil Lyrics credit: Lyricsraag.com
Picture credit: Google Images