Thursday, January 30, 2020

'రోమా'



ఒక సినిమా కథ మొత్తం రాయడం నాకు ఇష్టం లేని విషయం కానీ, ఈ సినిమా ఎక్కువమందికి అందుబాటులో లేకపోవడం వలన రాస్తున్నాను. నెట్ఫ్లిక్స్ సినిమా. చూడాలనుకున్న వాళ్ళు చూసాక చదవడమే నేను సజస్ట్ చేస్తాను.

మెక్సికో సిటీ సబర్బన్ అయిన కొలోనియా రోమాలోని ఒక సంపన్నకుటుంబంలో పనమ్మాయి క్లియో. సినిమాని ఎక్కువగా క్లియో కళ్ళ నుంచి చూపుతాడు దర్శకుడు అల్ఫాన్సో ఖ్వోరాన్. డెబ్భైల కాలం.

కుటుంబ యజమానులు సోఫియా ఆమె భర్త ఆంటోనియో. వాళ్ళ నలుగురు పిల్లలు (ఐదారేళ్ళ నుంచి పదకొండు పన్నెండేళ్ల పిల్లలు) సోఫియా తల్లి, క్లియో, ఇంకో పనమ్మాయి ఆడేలా ఆ ఇంట్లోని మొత్తం సభ్యులు. క్లియో ఆ ఇంటికి జీవనాడి. ఆ అమ్మాయి లేకుండా ఒక్క నిమిషం గడవదు. సోఫియాతో ముఖ్యంగా చిన్న పిల్లలతో తనకి చాలా సున్నితమైన సంబంధం వుంటుంది. ఆంటోనియో, సోఫియాల జీవితం ఒడిదుడుకులతో నిండి ఉందని చిన్నచిన్న సంభాషణల్లో తెలిసిపోతుంది. ఆంటోనియో రెండు మూడు సార్లు మాత్రమే కనపడతాడు మొత్తం సినిమాలో. 

క్లియో, ఆడేలా బయటకు వెళ్లిన ఒక సందర్భంలో క్లియోకి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న ఫెర్మీన్ తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారి ఆ అమ్మాయి గర్భం దాల్చుతుంది. ఈ విషయం తెలియగానే షరా మామూలుగా ఫెర్మిన్ తప్పుకుంటాడు. సోఫియాకి క్లియో భయం భయంగా 'నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారా' అంటూ ఈ సంగతి చెప్పగానే సోఫియా, క్లియో ని అక్కున చేర్చుకుంటుంది. ధైర్యం చెప్పి తనే దగ్గరుండి డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లి కావలసిన మందులు ఇప్పిస్తుంది. క్లియో, ఫెర్మీన్ ను మళ్లీ కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినా పెద్దగా లాభం వుండదు. ఈలోపు ఆంటోనియో, సోఫియాని వదిలేస్తున్నానని ఖాయంగా చెప్పేస్తాడు. సోఫియా ఈ సంగతి పిల్లలకీ, పనివాళ్లకు స్పష్టంగా తెలియనివ్వదు. క్లియో విషయాన్ని గ్రహిస్తుంది. సోఫియా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నా తను కాస్త దెబ్బతింటుంది. 

క్లియోకి నెలలు నిండుతాయి, పుట్టబోయే బిడ్డకోసం ఉయ్యాల కొనేందుకు క్లియోని తీసుకుని సోఫియా తల్లి షాపుకు వెళుతుంది. ఆ సమయంలో జరిగిన ఆందోళనల్లో క్లియో కి ఫెర్మీన్ గొడవ చేస్తున్న వ్యక్తుల్లో ఒకడిగా ఎదురుపడతాడు, ఎట్లాగో వీళ్ళకు హాని చేయకుండానే వెళ్ళిపోతాడు. ఈలోపు క్లియో ఉమ్మనీటి సంచీ పగలడం తో సోఫియా తల్లి, డ్రైవర్ క్లియోని తొందరగా హాస్పిటల్ కి చేర్చే ప్రయత్నం చేస్తారు, గొడవల నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యి రెండు గంటల తర్వాత కానీ హాస్పిటల్ చేరలేకపోతారు. డాక్టర్లు ఎంత చురుకుగా పనిచేసి తనకి డెలివరీ చేసినా క్లియో బిడ్డని కాపాడలేకపోతారు. 

సోఫియా పిల్లల్ని చిన్న వెకేషన్ కోసం బయలుదేరదీస్తుంది. వాళ్లతో పాటు క్లియోని కూడా వచ్చేందుకు ఒప్పిస్తుంది తనకు మార్పు కావాలని. అక్కడకు చేరాక పిల్లలకూ క్లియోకి చెప్పేస్తుంది ఆంటోనియో తనను వదిలేస్తున్న సంగతి, అతను తన సామాను తీసుకెళ్లిపోవడానికి వీలుగానే పిల్లల్ని ఈ వెకేషన్ కి తెచ్చిన సంగతి. అక్కడి బీచ్ లో ఆడుకుంటూ సోఫియా పిల్లల్లో మధ్యవాళ్ళు సముద్రంలో మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకుంటారు. క్లియో ఈత రానిదైనా పడుతూ లేస్తూ వెళ్లి ఆ పిల్లల్ని ఒడ్డుకి తెస్తుంది. ఈ లోపు అక్కడికివచ్చిన సోఫియాతో తనలో ఇన్నాళ్లు దాచుకున్న సంగతి చెప్పేసి ఏడుస్తుంది. తను, తన బిడ్డ బతకాలని కోరుకోలేదన్నదే ఆ విషయం. ఎంత క్షోభ ఫలితమో అంత విషాదపుకోరిక. 

టూకీగా కథ ఇది, కానీ కథకు మించిందే ఈ సినిమాలో ముఖ్యం. నలుపుతెలుపుల్లో తీసిన ఈ సినిమా దృశ్యాల్లోని అందం చెప్పనలవి కాదు. ఇంట్లో చూసే మామూలు దృశ్యాలు మెట్లెక్కడాలు, బట్టలు ఉతకడాలు, నేల కడగడాల్లాంటి అతి సాధారణ దృశ్యాలు కాన్వాస్లలాగా ఉంటాయి. పూర్తిగా సహజమైన పరిసరాలు, ఆ కాలపు వాతావరణం, ఎక్కువగా ఆ ఇంటి పరిసరాల్లోనే కథ నడిచినా మొనాటని ఉండదు. నటన అపూర్వమైన నటన అని ఎవరిదీ చెప్పలేం. చాలా సహజంగా ఆయా పరిస్థితుల్లో సాధారణ మనుషులు ఎలా స్పందిస్తారో దానికి ఒక స్థాయి తక్కువగానే వీళ్ళ స్పందనలు వుంటాయి. 

విడిపోవడాలు, బిడ్డని పోగొట్టుకోవడం, జీవితం నడుస్తున్న అంతస్తులో ఆకస్మికంగా మార్పు రావటంలాంటి అసాధారణ సంఘటనలు నడుస్తున్నా ఈ ఆడవాళ్లు ధైర్యం కోల్పోరు. ఒకరికి తోడుగా ఒకరుంటారు. ఈ తోడుంటమే ఈ సినిమాలో అపురూపంగా తోచే విషయం. 
సోఫియాకి ఆమె తల్లి బలం. ఆవిడ చేసేది కనిపించడమే సినిమాలో, కానీ తెలిసిపోతుంది. కుటుంబం మొత్తానికి సోఫియా మూలస్తంభం. పిల్లలతో చక్కటి అనుబంధం తనకి, ఉద్యోగరీత్యా ఎక్కువగా క్లియో మీదే ఆధారపడి వున్నా కూడా. క్లియో తమ జీవితాల్లో ఒక ముఖ్యమైన ఇరుసు అన్న గ్రహింపు సోఫియాకు ఎప్పుడూ ఉంటుంది. క్లియో కి ఒక అడ్మిరేషన్ సోఫియా పట్ల. యజమాని పనివాళ్ళు అన్న తారతమ్యాలు వుంటాయి, ఆవేవీలేకుండా ఉత్త మనుషుల్లాగే కూడా వుంటారు. పనమ్మాయిలు ఇద్దరు వుండగానే తోచే పిచ్చి రాజకీయాలేవీ వుండవు. ఇద్దరూ తోడుతోడుగా ఒకరికొకరు చెయ్యందించుకుంటూ పనిచేసుకుంటారు. నీ పనీ, నా పనీ అన్న లెక్కలు కనపడవు. ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటారు పనుల్లోనే. 

క్లియో ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు సోఫియా కానీ, డాక్టర్ కానీ అవసరానికి మించి ఒక్క ప్రశ్నా వెయ్యరు. ఆడేలా ఎంత సహాయం చేయగలిగితే అంతా చేస్తుంది క్లియో కోసం చివరిదాకా. క్లియోని డెలివరీకోసం తీసుకువెళుతూ సోఫియా తల్లి పడే ఆరాటం తక్కువది కాదు. హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు ఒక చక్కటి వ్యవస్థలాగా కనపడడం ఎంతో బావుంది. ఎక్కడా నిర్లక్ష్యంగా వుండరు. ఆంటోనియో ఆ హాస్పిటల్లోనే డాక్టర్. ఆ సమయంలో తనూ వచ్చి క్లియోకి ధైర్యం చెప్పి వెళ్తాడు.  

చాలా చోట్ల మెటఫోరికల్ షాట్స్ షార్ప్ గా ఉపయోగించున్నాడు దర్శకుడు. తమ ఇంటి ముందున్న ఇరుకుగా ఉండే గ్యారేజ్లో పట్టనంత పెద్ద కారుని వదిలించుకుని హాయిగా పట్టే చిన్న కారుని సోఫియా తెచ్చుకోవడం తను జీవితాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే. మార్షల్ ఆర్ట్స్ గురువు చూపించే వృక్షసనం లాంటి ఆసనాన్ని ఆ గురువూ, క్లియో తప్ప ఎవ్వరూ చెయ్యలేకపోవడం ఆ అమ్మాయికి జీవితంలో ఉన్న నియంత్రణ ఇంకా సమన్వయానికి ఉదాహరణ. ఇట్లాంటివి కొన్నున్నాయ్. అర్థం కాగానే ఒక చిన్న మెచ్చుకోలు ఇచ్చేస్తాం దర్శకుడికి. పల్ప్ సినిమా చూసినట్టు ఫ్లీటింగ్ ఆడియన్స్లా కాకుండా కాస్త నిదానంగా తరచి చూడాల్సిన సినిమా. 

విమర్శ తక్కువగానే ఉన్నా పూర్తిగా అతీతమైన సినిమా కాదు ఇది. మెక్సికోలో జరిగిన అంతర్గత కల్లోలాల్ని నేపథ్యంలో ఉంచినా దాన్ని సరిగ్గా చెప్పలేదని కొందరు విమర్శించారు. తన సినిమాకి ఏది బాక్డ్రాప్లో ఉండాలో ఏది ఫోర్గ్రౌండ్లో ఉండాలో ఈ దర్శకుడికి తెలిసిందని నాకనిపించింది. క్లియో పరంగా కథ చెప్పినా క్లియో పాసివ్ గా వుందనేది ఇంకొక పెద్ద విమర్శ, ఇది విమర్శ కాదుగానీ ఆ అమ్మాయి ఆక్టివ్ వాయిస్ అయితే పనివాళ్ల దృక్పథం ఎక్కువ ఎలివేట్ అయ్యేదని ఆ విమర్శ ఉద్దేశ్యం. ఇది సరిగానే అనిపించినా క్లియో ఇంకోలా ఉంటే అది ఇంకో సినిమా, 'రోమా' కాదు. నాకైతే రోమా తలుచుకుంటే ఎప్పటికీ అతి తక్కువ ఎక్స్ప్రెషన్స్ తో వుండే క్లియో మొహం మాత్రం గుర్తుంటుందేమో ప్రస్ఫుటంగా. ఈ 'రోమా' కి ఈ క్లియో నే తగినదని నా ఉద్దేశ్యం. 

ఇంక బోలెడంత ప్రశంసను మూట కట్టుకుంది. ఏ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లినా అవార్డు తెచ్చుకోకుండా వెనక్కు రాలేదు. గోల్డెన్ లయన్లు, గోల్డెన్ గ్లోబులు అలవాటుగా గెలుచుకుంది. పది అకాడెమీ అవార్డులకి నామినేట్ అయ్యి మూడు విభాగాల్లో (సినిమాటోగ్రఫీ, ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, డైరెక్టర్) అవార్డులు గెలిచింది. చివరి విభాగంలో ఒక విదేశీచిత్రం అకాడెమీ అవార్డు గెలిచింది ఈ చిత్రానికే.

నిఖార్సయిన సినిమా మీద ఇష్టం వుండి అవకాశం ఉన్న అందరూ చూడమనే చెప్తాను.

No comments: