Thursday, January 30, 2020

చిగురాకు రెపరెపలు - మన్నెం శారద




బాల్యం అందరిదీ ఒక్కలాగే వుంటుంది ముచ్చటగా, ఇంకెందుకూ రాయడం అన్న శారద గారిని ఒప్పించి వారి చెల్లెలు ఈ పుస్తకం రాయించి ఎంతమంచి పని చేశారో. అందరి బాల్యంలో ఆనందకరమైన జ్ఞాపకాలుంటాయి, కానీ కొన్ని ప్రత్యేకంగా వుండేవి కూడా వుంటాయి. శారద గారి చిన్నతనంలోని కథల్లో అల్లరిని ఎక్కువ అల్లరి చేసిన పెద్దలంతా రిలేట్ చేసుకోగలరు. కానీ కొన్నిసార్లు గుండె గొంతుకలోకి వచ్చి కొట్టాడినట్లుండే చిన్న చిన్న సంఘటనలు చాలా కదిలించివేస్తాయి. 

ఈ పుస్తకంలోని చిన్నారి కథానాయకి శారద కుటుంబం చాలా పెద్దది, సొంత కుటుంబమూ, ఉమ్మడి కుటుంబమూ అన్నీ పెద్దవే. అసలు ఎవరు ఎవరి పిల్లల్లో అన్నంత తేడా తెలియని ఇష్టాలు పిల్లలమీద అప్పటి కుటుంబాల్లో. పెదనాన్నకు,నాన్నకు,అమ్మమ్మకు, అత్తలకూ, పెద్దమ్మకూ అందరికీ శారద అల్లరి పిల్లే కానీ చాలా ఇష్టమైన పిల్ల కూడా. మరీ ప్రాణం మీదకు తెచ్చుకునే అల్లరి చేసినప్పుడు తప్ప అన్నిసార్లు వెనకేసుకొచ్చేస్తారు.

తెలివైన పిల్ల, ఆలోచన ఉన్న పిల్ల, ప్రశ్న తెలిసిన పిల్ల,లోకం లెక్కలు అస్సలు తెలియని పిల్ల (తెలిసే వయసూ కాదు) మరి కొంచెం కష్టమే ఈ పిల్లతో వేగడం. నల్లగా వుండటం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇంగితం లేనివాళ్ళు సరే కన్నతల్లి కూడా కొద్దిగా దూరం పెడితే ఆ కష్టం చిన్నదెట్లా. అందుకే అంత అలవిమాలిన అల్లరి అయినా అవతలివాళ్ళని ఇబ్బంది పెట్టింది తక్కువ, తను ఇబ్బంది పడింది ఎక్కువ. అట్లా అల్లరితో ఐయినా అమ్మ తనను పట్టించుకోవాలని చిన్నపిల్ల శారద ప్రయత్నాలు చూస్తే అట్లాగే పేజీల్లోకి దూరిపోయి వాళ్ళ అమ్మమ్మలాగే నీ అంత కళ వున్న మొహం ఎవరికుందమ్మా, కృష్ణమ్మ లాగా ఉన్నావని చెప్పి దగ్గరకు తీసుకు బుగ్గలు పుణకాలనిపిస్తుంది. ఎన్ని కళలో అంత చిన్నతల్లికే 💖 
తల్లులు కారణాలు ఏవి ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని తేడాగా చూడకూడదు. ఇక్కడ ఈ చిట్టితల్లికి మిగిలిన అందరి ప్రేమా పుష్కలంగా దొరికినా ఎంత కొరవ ఉండిపోయిందో జీవితంలో!! ఇట్లా కూడా దొరకని పిల్లల మాటేమిటి!? 

ఎందరెందరు ప్రేమించేవాళ్లో శారద చుట్టూ. అమాయకమైన అల్లరీ, తెలివిడితో చేసే అల్లరీ, బంగారం లాంటి మంచితనం, పెద్దపిల్లలు వెనకుండి అల్లరి చేయిస్తే అమాయకంగా అమ్మతో దెబ్బలు తినడం, బోలెడన్ని ఊళ్ళు తిరగడం, పువ్వులు పిట్టలు చూసి మైమరిచిపోవడం, వద్దన్న డాన్సులో, బొమ్మలు వేయడంలో, రాయడంలో అన్నింట్లో మిన్న కావడం వెరసి ఒక అపురూపం 'మన్నెం శారద' గారు. 

బల్లికి చేసే శ్రాద్ధకర్మలూ, జైలు ఖైదీల కోసం దోసెలు వెయ్యడం, బావి మీద ఉయ్యాల ఊగడం, పిల్లల్ని సరిగా చూసుకోకుంటే నాటకం రాసి మరీ ఆ చుట్టాల బండారం బయటపెట్టడం అమ్మో!! ఇంకెవ్వరూ చేయలేరు 😁 శారద గారూ మీరు భలే గొప్పోళ్లండీ 😊🙏

భలే నవ్వొచ్చే ముచ్చట్లు అన్నీ. చిన్ని పుస్తకం. ముచ్చటైన చిన్నతనపు కథ. శారద గారి కథనానికి నేను చెప్పగలిగే మాటేముంటుంది, మీరు పుస్తకం పట్టుకుంటే చాలు, ఆవిడే చదివిస్తారు హాయిగా.

No comments: