Showing posts with label book review. Show all posts
Showing posts with label book review. Show all posts

Sunday, February 16, 2020

సిరా - రాజ్ మాదిరాజు

నవలలో చదివించే గుణం వుంది, 260 పేజీలు ఒకే సిట్టింగ్లో చదవడం చాన్నాళ్లకు (భవభవ బంధాలున్నా😉); ఇది వారి గురువుగారి ప్రభావమే నిస్సందేహంగా. తప్పక చర్చకు పెట్టవలసిన విషయం, అందులోనూ సందేహం లేదు. కానీ, (yeah, inevitable bit of poison) మాస్ మార్కెట్ ప్రొడక్ట్ చేయడం కోసం కొంచెం రాజీ పడ్డారు శక్తివంతమైన నవలగా రాయడంలో. పథేర్ పంచాలీ లకు అవార్డులు వస్తాయి గానీ ఎవరు చూస్తారు అనుకున్నారేమో. నిజమే ఐయినా. సినిమా ఫార్మాట్ లో ముందు ఆలోచించి తర్వాత నవలకు తెచ్చారు కాబట్టి ఎక్కువగా స్క్రీన్ ప్లే ఫార్మాట్లో వుంది నవలకన్నా, దీనివల్లే పైన నాకనిపించిన కంప్రోమైజ్ కూడా. మళ్లీ కానీ, ఈ విషయం పుస్తకం అవసరాన్ని ప్రాసంగికతను అస్సలు తగ్గించదు. It is highly relevant and a compelling read. 

విషయానికి వస్తే, పిల్లలు బతికుండి హాయిగా ఏదొకటి నచ్చింది చేయడం ముఖ్యమా వాళ్ళని రుద్ది రుద్ది ఏదో మనమనుకున్నది చెయ్యబోవడం, అందులో కొందరు ఊపిరాడని పిట్టల్లాగా రాలిపోవడం ముఖ్యమా అంటే నాతో సహా బుద్ది వున్న తల్లిదండ్రులు అందరూ మొదటిదే ఎంచుకుంటారని ఒక తప్పుడు నమ్మకమ్ ఒకప్పుడు వుండేది. ఇప్పుడస్సలు లేదు. రకరకాల కారణాలు చెప్పి పీర్ ప్రెషర్ తట్టుకోలేని తల్లిదండ్రులు పిల్లల్ని ఆ ఫ్యాక్టరీల్లోనే చేర్చుతున్నారు. వాళ్ళ కలల్ని పండించాల్సిన బాధ్యత పిల్లల భుజాలమీదే.  ఒకరకంగా మూర్తి ఆర్గుమెంట్ నిజం. 

రాజ్ గారూ, సిరాను సిరాలాంటి అనేక సంస్థలను ఆ ఇంజినీరింగ్ కాలేజీల్లా మూసేస్తే నేనూ చాలా సంతోషపడతాను. కానీ, అది నిజంగా అసలు సమస్యకు పరిష్కారమా!?  నేను అవుననలేను. తల్లిదండ్రులు ముఖ్యంగా మధ్యతరగతి తల్లిదండ్రుల పేరాశలు తుడిచిపెట్టుకుపోవాలి. ఐఐటీలో ఇంజినీరింగ్ విద్య అనే నిచ్చెనతో ఆకాశహర్మ్యాలు కట్టుకుంటున్న వాళ్ళకి అది కాని ఆల్టర్నేటివ్స్ తెలియాలి, వాటిమీద నమ్మకం కలగాలి. మీ పుస్తకంలో కూడా రాసారు ఆ కథలు, అట్లాంటివి ప్రచారంలోకి రావాలి. ముఖ్యంగా ఒక సమాజంగా విజేతని మాత్రమే నెత్తిన పెట్టుకునే సంప్రదాయం మారాలి. నిజమైన ప్రయత్నాన్ని అభినందించే గుణాత్మక మార్పు రావాలి.  అప్పటిదాకా సిరాని పాతిపెడితే అంతకుమించిన విషవృక్షాలు పుట్టుకొస్తాయి. సిరా కేవలం ఒక వ్యాపారసంస్థ. లాభం తప్ప ఇంకో ఆలోచన వాళ్లకు వుండదు, సిరాను ఎదగనిచ్చిన వ్యవస్థ మారాలి 'చైనా'లు, 'కోటా'లు వుండకుండా వుండాలంటే. 

మా యూనివర్సిటీకి కూడా మన పిల్లలూ ఎక్కువగానే వస్తారు. మీరు రాసినట్లుగానే అకాడమిక్ గా గొప్పగా వున్న పిల్లల్లో కూడా సాఫ్టుస్కిల్స్ శూన్యం. వాళ్ళు ఒక గుంపుగా చేరిపోయి ఇంక బయటకు రారు. మిగిలిన వాళ్ళతో కలవరు.  చొరవ వుండదు, కొత్త ఆలోచనకు తొందరగా స్వాగతం చెప్పలేరు. అసలు ప్రశ్నించడం చాలా తక్కువ. Individual గా మంచి performers ఎక్కువమంది. టీంలో కష్టం. ఆటల్లో పెద్దగా కనిపించరు. ఒక ఆన్సర్ స్క్రిప్ట్లో bookish డెఫినిషన్స్ ఉన్నాయంటే తొంభైశాతం మన పిల్లలే. నాతో పాటు నా కలీగ్స్ అందరూ ఈ ట్రెండ్స్ కనీసం రెండు మూడు సెమిస్టర్లకల్లా బ్రేక్ చెయ్యాలని చాలా ప్రయత్నం చేస్తాం. ఇక్కడి పిల్లలకు బుర్రలో శూన్యం వున్నా చొరవ, ప్రశ్నించడం, ఒకళ్ళతో పని చేయించడం, టీం గా పనిచేయడం బాగా తెలుసు. పని తెలివిగా పక్కన వాళ్లమీద వెయ్యడం తెలుసు. ముఖ్యంగా వాళ్ళు చాలా వరకూ ప్లస్ టూ లో కూడా బిజినెస్నే చదివి వస్తారు, మనవాళ్ళు దాదాపుగా 'చైనా'నే. తమిళనాడు, కేరళ, కర్ణాటక పిల్లల్లో మరీ ఇన్ని లక్షణాలు గంపగుత్తగా వుండవు. ముఖ్యంగా కేరళ పిల్లలు తొందరగా లీడర్షిప్ పొసిషన్స్కి వెళ్లగలరు చిన్న గ్రూపుల్లో అయినా. నార్త్ ఇండియన్ పిల్లలు కూడా వాళ్ళని టక్కున ఆక్సిప్ట్ చేసేస్తారు. ఇంత తెలివితేటలున్న మన పిల్లలు చిన్న చిన్న లైఫ్ స్కిల్స్ లేక వెనకపడుతున్నారనే దిగులు తగ్గనివ్వట్లేదు బ్యాచ్ తర్వాత బ్యాచ్. ఇవి వ్యవస్థాగత సమస్యలు. మౌలికమైన మార్పులు రావాలి, కంటితుడుపులు అస్సలు చెల్లవు. ఒక ఆశావహమైన మాట మా మీను అన్నది ఈ పుస్తకం గురించి దానితో మాట్లాడుతుంటే; అట్లాంటి కాలేజీలు పెట్టి ముప్పై ఏళ్ళు దాటాయంటే అందరూ వాటిల్లో చదివిన పేరెంట్స్ పిల్లల్ని అక్కడ చేర్చరేమో అని. నిజమేనా!! ఆ కాలేజీల్లో చదవడం ఆస్పిరేషనల్ విలువగా ఉన్న తల్లిదండ్రుల సంగతేంటీ? వీటికి ఆల్టర్నేటివ్ ఏంటి? చిక్కేమిటంటే, ఈ పుస్తకం చదవడం, ఈ మాత్రం ఆలోచన చెయ్యడం కూడా పిల్లల మీద ముందుగానే కాస్త ఎక్కువ కన్సర్న్ ఉన్న తల్లిదండ్రులే చేస్తారు. ఇది నిజంగా పెద్ద విషవలయం. ఏదేమైనా మీరు చేసింది చాలా అభినందనీయమైన ప్రయత్నం. మెయిన్ స్ట్రీమ్ లో చర్చకి రావలసిన అంశం. 

మీరు సినిమా చేయబోతున్నారు కనుక ఈ ఒక్క మాట రాస్తున్నాను, మనోహరమూర్తి వాచ్యంగా 'మాత్రమే' గొప్ప లాయర్గా కనపడ్డారు. సినిమాలో అట్లా చెప్పడానికి అంత నిడివి దొరకదని మీకు తెలుసు. పైగా, దాదాపుగా మొదటి ఇంటరాక్షన్ నుంచే he was in awe of Ram. ఇద్దర్నీ పోటాపోటీగా నిలబెట్టినప్పుడు రామ్ అతన్ని ఆల్మోస్ట్ తన దైవంగా భావిస్తున్నపుడు అతని బిల్టప్ ఇంకా ప్రత్యక్షంగా వుండాలి. రామ్ ఓడిపోతున్నట్టు కనపడ్డా నిజానికి అన్నిసార్లూ అతనే గెలిచాడన్న ధ్వని అంతర్లీనంగా వుంది. అది కొంచెం దెబ్బ మూర్తి పాత్రకి. రమ్య ఇంకాస్త గట్టిగా వుండొచ్చునండీ, మరీ అంత తెలుగు సినిమా హీరోయిన్ మల్లే వుండక్కరలేదు. నేను అట్లాంటి బ్రిలియంట్ పిల్లల్ని వందలమందిని రోజూ చూస్తున్నాను మరి. వాళ్ళల్లో క్లారిటీనే నాకు నచ్చే మొదటి అంశం 🙂 రామ్ తో సమానస్థాయి లేదా ఇంకాస్త ఎక్కువ బలంతో వీళ్లంతా వుంటేనే కదా అసలు కోర్టురూం డ్రామా మజా పండేది, రామ్ పాత్ర గట్టిగా నిలబడేది. ఇవేవీ మీకు తెలియనివి కావు. 

చివరగా పుస్తకంలో పరిశోధన, రీడబిలిటీ, సహజమైన భాష అమోఘంగా ఉన్నాయి. రెండవ ముద్రణలో ప్రూఫ్రీడింగ్ ఇంకాస్త క్లోస్గా చేయండి. తల్లిదండ్రులూ దయచేసి నిదానంగా చదవండి, ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. 

Raj గారూ, మీ గొప్ప మానవీయమైన ప్రయత్నానికి అనేకానేక అభినందనలు 💐