Thursday, January 30, 2020

పుస్తకం

పుస్తకం బతకట్లేదు, చదవడం తగ్గిపోతుంది అని బాధపడేవాళ్లు నిశ్చింతగా వుండొచ్చు. ఇక్కడ నేను స్టాటిస్టిక్స్ రాయడం లేదు గానీ నేను చూసిన విషయం రాస్తున్నా. నిన్నటి వరల్డ్ బుక్ ఫెయిర్ లో నేను చూసిన వాళ్ళల్లో కనీసం 30 శాతం మంది 15 -25 సంవత్సరాల ఏజ్ సెగ్మెంట్. ఒక 50 శాతం రెండు మూడేళ్ల పిల్లలనుంచి 12-15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రుల సెగ్మెంట్. తక్కినవాళ్ళు మిగతా వర్గాలు. 

Hachette పబ్లిషర్స్ స్టాల్ లో ఓ సుమారు 20 ఏళ్ల అమ్మాయి ఒక డజను పుస్తకాల దొంతర పక్కన పెట్టుకుని బాసింపట్లు వేసుక్కూర్చుని ఇంకో పుస్తకం చదువుతుంది ఎంచడానికి. అంత రద్దీగా ఉన్నా ఆ అమ్మాయిని కదిలించకుండా జనాలు కదులుతున్నారు. ఇంకో దగ్గర ఓ పదమూడు పద్నాలుగేళ్ల పిల్ల 'ఇకిగై' ఉందాఅండీ అని స్టాల్ అతన్ని అడుగుతుంది. సగం మంది జనాలు ఉత్త చేతులతో కాదు చక్రాల బాగులతో మరీ వచ్చారు. రిషి అంత పిల్లలు సొంతంగా టైటిల్ చెప్పి పుస్తకాలు వెతుక్కుంటున్నారు. అన్ని వేల పుస్తకాల్లో వీడికి కావాల్సినవి వీడికి కనపడుతున్నాయి మిగిలిన పిల్లలకు లాగే. పిల్లల్లో రీడింగ్ హాబిట్ ఎట్లా డెవలప్ చేస్తున్నాం అని తల్లిదండ్రులు తమ చేస్తున్న ప్రయత్నాలను అక్కడ జరిగే ఒక వర్కుషాప్లో పంచుకుంటున్నారు. స్టోరీ టెల్లింగ్ వర్కుషాపులు, ఆథర్ మీట్లు, థీమ్ బేస్డ్ సెమినార్లు ఇంకెన్నో నడుస్తున్నాయి పార్లల్ గా. దగ్గర దగ్గర 500 స్టాల్ల్స్ మేము కనీసం చూడగలిగింది. ఆక్స్ఫర్డ్, మాక్ మిలన్, బ్లూమ్బరీ, హార్పర్ కాలిన్స్, సాహిత్య అకాడెమీ, NBT ఇత్యాది స్టాల్స్ స్టోర్స్ లాగే వున్నాయి. 

ఫ్లిప్ సైడ్ లేదా!? సగం పైన ఉన్నది ఇంగ్లీష్ పుస్తకాలే, బహుశా 70 శాతం. తెలుగు మాత్రమే కాదు మిగిలిన రీజినల్ భాషల స్టాల్ల్స్ కూడా లేనట్టే. హిందీ కొంత నయం. ఇంగ్లీషులో కూడా క్వాలిటీ రీడింగ్ ప్రాతినిధ్యం కొంచెం తక్కువే వుంది, స్టాల్స్ చూస్తూనే తెలుస్తుంది ఆ సంగతి. కాకుంటే చదవడం మొదలెట్టాక ఎలాగూ అప్గ్రేడ్ అవుతారు మెల్లగా.  

నా చివరి మాట, పుస్తకం నిలిచేవుంటుంది.

No comments: