ప్రతీ సాహిత్యాభిలాషికీ తనకే ప్రత్యేకం అయిన దృక్పథమూ, ఆలోచనా, తనలో తనతో జరుగుతుండే సంభాషణా వుంటాయి. ఈ సాహిత్యాభిలాషి రచయితా అయినప్పుడు స్పష్టమైన దృక్పథం రాతలో ప్రతిఫలించడం, తనదైన శైలిలో రచనానిర్మాణం కొనసాగించడం ఆనుషంగికం. తమకు పట్టువున్న భాషలో, యాసలో భావాలను స్పష్టంగా, పొందికగా, కుందనంగా వెలిబుచ్చడం తరువాతి సంగతి. ఒక రచనని చదివేప్పుడు కథా, కథనాల మీద చదువరి దృష్టి ఉన్నా తక్కిన విషయాలు గమనంలోకి రానివి కాదు, కొంతమంది రచయితలు అన్ని విభాగాల్లో చదువరికి ఒక సంతృప్తిని మిగిల్చినా ఏదో ఒక లోటు మిగిలించకుండా వుండటం అరుదు, ముఖ్యంగా ప్రస్తుతంలో. ఒక మేలైన చదువరి, మేధావి రచయితగా మారినప్పుడు ఈ ఆలోచన తనలో అంతర్లీనంగా వుండటం సహజం, కానీ, రచనలోకి ఇదంతా మేలుగా ప్రతిఫలింపచేయడం మాత్రం ఎన్నదగిన అంశం. కథాంశం, కథా నిర్మాణం, పాత్రల చెక్కడం వేటికవే మేలైనవిగా, ఈ కాలానికి అవసరమైనవిగా వుండటం ఎలాగూ ఉన్న రచన కానీ ఇక్కడ ప్రస్తావించిన విషయాలు ఒక పుస్తకానికి తప్పని అవసరం అని నేను అనుకుంటుంటాను కాబట్టి అక్కడ మొదలుపెట్టడం.
ఆంథోలోజి స్పర్శతో నడిచే ఆధునిక నవల వలస. కళ్యాణి, శ్యామ్, స్వామిల జీవితాలని పొరలు పొరలుగా చూపిస్తూ, గందరగోళపెట్టని టైమ్ ట్రావెల్ చేయిస్తూ ఈ కథని మన కళ్ళముందు పరుస్తారు సుస్మిత. “ఒక కదలిక చిరు మెదలిక” అన్నంత చిన్న చిన్న పరిచయాలనుంచీ జీవితకాలపు స్నేహాలయ్యేంత చిక్కని మానవ సంబంధాలను చూస్తాం, సహాయం చేయడానికి చప్పున ముందుకువచ్చే మనుషులు సహాయం తీసుకోవడానికి మొహమాటపడటం చూస్తాం, చింతలులేని కుటుంబం అనుకునేంత చిన్న యూనిట్ లోని విడదీయలేంత అల్లుకుపోయిన చిక్కుముళ్ళని చూస్తాం, పిల్లల జీవితాలను తీర్చిదిద్దడానికి వీలయితే వాళ్ళని దూరంగా పంపగల తల్లుల్నీ చూస్తాం, ఒక్కగానొక్క పిల్లని ఎట్లా వదులుకుంటాం అని జీవితాంతం త్రిప్పట పడ్డ తల్లినీ చూస్తాం, ఓ కంట్రోల్ ఫ్రీక్ అత్తగారు, ఇంకో తామరాకుమీది నీటిబొట్టు అత్తగారు, వీళ్లందరినీ పనిగట్టుకుని కాంట్రాస్ట్ చూపించడానికి తయారుచెయ్యలేదు, ఇట్లాంటి మనుషులుండటం సాధ్యమేనా అనేంత ఉదాత్తమైనవో కృతకమైనవో పాత్రల్ని మాత్రం చూడం. ఇక్కడ చదివేవన్నీ జీవితాల్లోంచి నడిచొచ్చిన పాత్రలు. కొందరు మనకు ప్రత్యక్ష పరిచయం వుండొచ్చు, కొందరు కాస్త దూరపు స్ప్రైరల్ కో చెందినవాళ్లలా కనిపించవచ్చు, కానీ అందరూ రక్తమాంసాలతో పరిపుష్టమైన మనుషులే.
రెండవ తరానికి ఎప్పుడూ ముందటి తరం జీవితాన్ని కాచి చూసిన అనుభవం, దాటివచ్చిన నైపుణ్యం అక్కరకు వచ్చేవే. ఒకే మస్తిష్కంలోని వైరుధ్యపు ఆలోచనలూ, సంఘర్షణలూ తెలియనివారం కాము ఎవరమూ, అట్లాంటిది కొందరు మనుషులు కలిసి ఒకటే ఇంట్లో బతుకుతూ, అవే వనరుల్ని పంచుకుంటునప్పుడు ఘర్షణ వుండరాదు అనుకోవడం అసహజం. మొదలు ఏమైతేనేం ఈరోజున మనవి అచ్చమైన న్యూక్లియర్ కుటుంబాలు; భారతదేశపు అస్తిత్వ చిహ్నమైన ఉమ్మడి కుటుంబవ్యవస్థ దానిలోని సకలమైన లోటుపాట్లతో పాటూ, ఒక భద్రతని మూడవ, నాలుగవ తరాలకి అందించడం నిన్నటి విషయం ఇక్కడ కూడా, అటువంటిది జీవిక నిమిత్తం దేశం దాటి వెళ్లిన వలస జీవులకి ఈ భద్రత అవసరానికి అందిరావాలన్నా కాసులూ, వీసాల అడ్డుగోడలు దాటవలసిందే.
ఒక మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసేప్పుడు, కాస్త ఇక్కడిమట్టిలో ఆ వేళ్ళని ఏ టిస్యూ తోనో జాగ్రత్తగా చుట్టి కాసిన్ని నీళ్లు చల్లుకుంటూ తీసుకెళ్లి ముందొక చిన్నపాటి సంరక్షణ ఇంటిలోపలే వుంచిచేసి, కాస్త కుదురుకుంది అనుకున్నాక చేర్చవలసిన మట్టిలోకి మారుస్తాం. ఇక ఈ మొక్కలు అక్కడ పుట్టిన పిల్లలైనప్పుడు చేయవలసిన పోషణ సంగతి ఇంకెంత కథ. అనుభవలేమీ, సమయాభావం, అతి జాగ్రత్త, వైరుధ్యపు సంస్కృతులు ఈ పేరెంటింగ్ అన్న క్లిష్టమైన జీవితపు మెట్టుని ఇంకాస్త కష్టతరం చేసిన జీవితాలని ఈ నవలలో చూస్తాం. ఒక తల్లికి పిల్లకు సరైన తిండి అలవాట్లు చేయడమే ఒక సవాలు, ఇంకో తల్లికి కొడుకు ఆగ్రహంలోని ధర్మం కనపడ్డా చిన్నవాడిని ఎట్లా కాచుకోవాలా అన్న మెలకువలోకి రావడమే సవాలు, మరో తల్లికి సంస్కృతే కానివ్వండి, అత్యాధునిక నాగరికతనే అనండి; అవి నడిఇంట్లోకి తెచ్చిపెట్టిన విపరీత పోకడల్ని కనీసం అర్థం చేసుకోలేని పోరాటం; అందరూ గెలవరు, అందరూ ఓడిపోరు, ఆటూపోటూ అదే జీవితమూ. ఈ సంక్లిష్టతలనన్నింటినీ మెలోడ్రామాతో సంబంధంలేకుండా మేటర్ ఆఫ్ ద ఫాక్ట్ గా చూపడమే సుస్మిత చేసిన పని, దానికితోడు రచయితకి సహజాతమైన సుందరమైన ప్రాచ్యపదజాలం పక్కకుపెట్టి ప్రస్తుత రచనకు నప్పే పదజాలంతో నిలబడడం రచయితకు తన రచన పట్ల ఉన్న నిబద్ధతను చదువరికి పట్టి ఇస్తుంది. చదువరి కథతో ఉన్నారా లేరా అని ఒక చిన్న పరీక్ష కూడా పెట్టినట్టనిపించింది సుస్మిత :) ఇది తనకోసం రాసిన ఒక ఆత్మీయ వాక్యమవడంవల్లా, కథా ప్రస్తావన చేయకపోవడం వల్లా నేను కొరవలు అనుకున్న చిన్న విషయాల్ని ఇక్కడ ప్రస్తావించడం లేదు.
వెలుగునీడలమయం, సప్తవర్ణ సమ్మిశ్రితం జీవితం. ప్రవాసపు ఒడిదుడుకుల్ని పట్టిచ్చిన పుస్తకాలు ముందరా వచ్చాయి, కానీ ఇది ఒక అవసరమైన కథ; ఒక్క ప్రవాసపు కథ కాదు, కుటుంబం అని పట్టుకుని ఈత మొదలుపెట్టిన అందరి కళ్ళనూ ఈ ముప్పై సెకన్ల మాయాజాలపు ప్రపంచం చూపించే వెలుగుజిలుగులు ఎక్కడో మసక చేసినట్లున్నాయి కాబట్టి అసలేమిటో తెలుసుకుందుకు లేదా గుర్తు చేసుకుందుకు ఇక్కడివారికి అవసరం; అక్కడివారికి ఒకసారి అద్దాలు తుడుచుకుందుకు మొదలు చూసుకుందుకు ఇంకాస్త అవసరం, వెలుగుల్ని మాత్రమే చూపని కథ కాబట్టి.
తెలుగుని ఎంతగానో ప్రేమించే సుస్మిత అమెరికాలోనికి ఎంత ఔచిత్యంతో అడుగుపెడతారో, Statue of Liberty ని తలుచుకుని. Emma Lazarus రాసిన ఆ పంక్తులు అమెరికా తన వాకిట బ్రతుకుతెరువుకోసం అడుగుపెట్టినవాళ్ళని ఎంత ఆదరంగా, వెచ్చగా తన దగ్గరికి తీసుకుంటుందో చదివినప్పుడు ఈరోజుటి ఈ ఉక్కపోత ఎంత అర్థహీనంగా కనిపిస్తుందో.
చింతపిక్కరంగు నిక్కరు, రాంనీలంరంగు పరికిణీ కట్టుకున్న బుజ్జి అమ్మాయి, మాఘమాసపు పెళ్లి ఇంటి సందడి, అమెరికా నుంచొచ్చిన బావగారు వంటి తన బలమైన పదజాలంతో మొదలుపెట్టినా అక్కడ వుండకపోవడాన్ని తన రాత తెలిసిన చదువరులు గుర్తుపట్టి మురవకమానరు. మూడేళ్ళముందర మార్గశిరంలో సుస్మిత మంచి వెన్నెల వేళని తెచ్చింది. ఎంత మురిపెంగానో ఆ పుస్తకాన్ని చదువుకున్నాము ఆ కన్నయ్య వ్రతాన్ని, తరించిన ఆ గోపికలనీ, ఇప్పుడు ఈ కార్తీకాన వలసని ఇచ్చింది. ఇప్పుడు ఒక ఆలోచనతో, ఒక మెలకువతో ఈ నవలని చదువుకోవాలి. ఇప్పటికి శివకేశవులిద్దరికీ చెల్లింపులు అందాయి, ఇంక ఆశ్వయుజం కోసం చూస్తాను.
ప్రేమతో,
సునీత రత్నాకరం.

No comments:
Post a Comment