Sunday, February 16, 2020

అనగనగగా ఒక చిత్రకారుడు – అన్వర్


అందంగా రాయబడ్డ అక్షరాలు అవును, నిజంగానే రాసినవే. లేత రంగుల బొమ్మలో కొమ్మమీద కూర్చున్న ఓ పిల్లోడు. ఇండియా పోస్ట్ వాళ్ళు ఇంకాస్త బుద్ధిగా రసీదు అంటించి ఉంటే నాకో మంచిబొమ్మ ఇంకా అందంగా మిగిలేది. రేఖాయత్ర ప్రచురణ అన్న అందమైన రంగుల అడ్రెస్ స్టికర్. అసలు కవర్ తెరవకముందే ఒక గొప్ప అనుభూతి, అడ్రస్ తీసుకుని పుస్తకం పంపడం అన్న పరమ యాంత్రికమైన బోరింగ్ పని ఇంత అందంగా చెయ్యొచ్చా అని. తెరిచాక ఒక అందమైన పసుపు అట్టపుస్తకం, నల్లటి ఎమ్బోజ్ చేసిన అక్షరాలతో ఒక పెన్సిల్ వీరుడు. ఒక చక్కని అభినందన లేఖ. అప్పటికి అనుక్షణికం మొదట్లో పెట్టిన ఇబ్బందుల్ని దాటేసి దారిలో పడ్డా, కానీ ఈ పుస్తకం చూశాక అట్లాగే పక్కన పెట్టెయ్యడానికి వల్లకాలేదు. ముందు పుస్తకం మొత్తం తిరగేస్తే అందమైన గొలుసుల శీర్షికలు. ఎర్రని తునకల excerpts. అవి చదివితే ఆ రాత చదవకుండా వదలలేము. సరే, అట్లా ఇట్లా చూద్దాం అని ‘అపురూపం’ పట్టుకున్నా. అన్వర్ గారికి బొమ్మలు ఎంత అపురూపమో, అనుభూతులు ఎంత అపురూపమో, మనుషులు ఎంత అపురూపమో, జీవితంలో మనం కృతజ్ఞతలు చెప్పుకోని సవాలక్ష అందివచ్చిన భాగ్యాలు ఎంత అపురూపమో భలే అపురూపంగా చెప్పారు. అసలాయనకి అక్షరం ఇంకా అపురూపం. బొమ్మలమీద ప్రాణం పెట్టుకునివుండకపోతే కచ్చితంగా అక్షరంతోనే నిండిపోయేది ఆ జీవితం. తర్వాతది ‘ప్రయాణం’, వున్న దగ్గర్నుంచి కదిలి బొమ్మ దగ్గరకు వెళ్లి బొమ్మను పట్టుకోవాలని మొదలెట్టి పిట్టంత భాగ్యంగా, చెట్టంత గంధంతో మనం బతుకుతున్నామా అన్న ప్రయాణం దాకా. ముందే చదివినా ‘సామజిక స్మగ్లర్లు’ భలే గొప్ప స్మగ్లర్ల కథ, ఇట్లాంటి ఒకళ్ళిద్దరు స్మగ్లర్లు నా స్నేహితుల్లో కూడా చిన్నతనంలో వున్నారుకదా, వాళ్ళు కూడా ఇప్పుడు అంతే వున్నారు. మా ఊరికెళ్ళినప్పుడు ఆ స్మగ్లర్ ఓ చాక్లెట్ ఐయినా ఊరకే ఇచ్చేమాటే, నేనుండేది రెండే నిమిషాలైనా. అమ్మయ్యో ఇట్లా ఈ మాయలో పడిపోతే చండీదాస్ సంగతేం కాను అని పక్కన పెట్టడమే, అంతకుమించి చదివింది జీర్ణం కావద్దూ. ఇంక అప్పట్నుంచీ రోజూ రెండు, మూడు చానా కదిలించేది ఒక్కటి చదివేదే గగనం అయ్యేది.

ఎన్ని మంచి కథల సంగతులో, గొప్ప సినిమాలు, పుస్తకాలు. అంత జ్ఞానం నేనే అట్టిపెట్టుకునేది ఎందుకు అని ఎంత ప్రేమగా పరిచయాలు రాసిపెట్టారో. అవ్వన్నీ చూట్టం చదవడం ఈ పుస్తకానికి మనం ఇవ్వగల అసలైన విలువ. ఈ పుస్తకం చదివీ, ఆ మనిషి అట్లా రాసాక కూడా ఆ ‘మహానగరంలో చిన్నబాలుడి’ని కలవాలని అనుకోకుంటే ఇంకేమి లాభం; గ్రీన్బూక్ లో రాసిన దారుల్ని చూడాలనుకోకుంటే ఇంకేం మనుషులం, పూనాచ్చి మేకపిల్లనీ, చిన్న పత్రికని నిలబెట్టుకున్న ఆ బంగారం లాంటి దంపతుల్ని, సత్యవతమ్మ కథల్ని తెలుసుకోవద్దూ, ఇవేనా ఇంకా యెన్నెన్ని వున్నాయో కదా. ఎంత మంది మనుషుల గురించిన కథలో. కళాకారుల అడ్డా మోహన్ గారేనా, పూనే మనిషైన గొప్ప బొమ్మలాయన రవి పరంజపేయేనా, ఎక్కడో మొదలై వేలాది మంది కళాకారుల్ని తయారుచేసిన ఆల్బర్ట్ డోర్న్యేనా, మన బాపేనా, బొమ్మయిల చంద్రనా, ఎర్రటి చిలుకల గురించి ఆరాటపడి వాటిని చూసాక గుండెలు పగిలేలా ఏడ్చిన వసుదేంధ్రనా, ఇంకెప్పుడూ అన్వర్కి ప్యాంటు షర్టు కుట్టలేని కిశోరేనా. ఎన్నెని కథలో.

చిన్నతనపు ఊసులూ, స్నేహితాలు, చిట్టి పొట్టి కోరికలు, పుట్టినరోజుకి సూపర్మాన్ కావాలనుకోవడాలు తీరా అయ్యేపోయాక ఇదేంటిరా నాయనా అనుకున్నా ముచ్చటే. అన్వర్లో చిన్నపిల్లాడు కనిపిస్తూనే వున్నా ఒక బెంగ పిల్లడు కూడా ఎప్పుడూ. అన్నకు తెచ్చిన షర్టు లాంటి అంగీ నాన్న తెచ్చివుంటే అమ్మ లేదన్న బెంగపిల్లాడు కొంచెం తక్కువే వుండేవాడేమో. ఇప్పుడింక ఒక భార్గవమ్మ బోలెడు చొక్కాలు కొనిపెట్టారట, అవి ఇంక వద్దనే చెప్పారు. ప్రేమ మాత్రం పంపమనికూడా.  ఆ పిల్లాడి ఇప్పటి బెంగలు కొంచెం వేరు మనం ఇంకాస్త మంచి మనుషులుగా ఎందుకు ఉండం, ఒక మంచి పుస్తకం ఎందుకు కొనుక్కొని చదవం, బోలెడంత కష్టపడి పక్క మనిషి చేసే ఒక పని మనకెందుకు వుచితంగా కావాలి, నిజ్జంగా మానవత్వంతో వున్న మనిషిని పిచ్చోడిగా ఎందుకు చేస్తారు, పిల్లల్ని ఎందుకు పిల్లలా వుండనివ్వం ఒక్క బెంగనా, ఇట్లాంటివి ఎన్నో. ఇవ్వి తీరేవా మరి!!

అన్వర్ రాత చదివించే రాత, కదిలించే రాత, లోపలున్న మనిషి రాసిన రాత, నేనిట్లా రాయొచ్చా లేదా అని ఆలోచించి రాయని రాత, స్వచ్చమైన రాత, మనిషిమీద బెంగపడ్డ రాత, అదే మనిషిని ప్రేమించకుండా వుండలేని రాత. ఓ అలౌకిక స్థితిలో మాత్రమే రాసేంత ఉద్వేగభరితమైన రాత. ముందు ఆ రాతకోసం చదవండి, తర్వాత మళ్ళీ మళ్ళీ ఓ పూనచ్చి చదువుతూ, ఓ గ్రీన్ బుక్ చూస్తూ.

ఒక్కటే కంప్లయింట్ అన్వర్ గారూ, పుస్తకం చేతిలోకి రాగానే ఒక మంచి బొమ్మలాయన రాసిన పుస్తకం అని మా మీనుకి చెప్పా, అదీ పుస్తకాన్ని తిరగేసి అమ్మా, బొమ్మలుబొమ్మలుగా వుంటే ఇంకా బావుండును కదా అన్నది. ఇంకో పుస్తకం వేసినప్పుడు మరి గుర్తుంచుకోండి ఆ మాట. సెలవుల్లో చదివిస్తాను దాని చేత. ఇంత మంచి పుస్తకాన్ని చాలా ప్రేమతో వేసి, అంతే గొప్పగా పాఠకులకు అందించినందుకు బోలెడు నమస్సులు మీకు🙏🙂

సిరా - రాజ్ మాదిరాజు

నవలలో చదివించే గుణం వుంది, 260 పేజీలు ఒకే సిట్టింగ్లో చదవడం చాన్నాళ్లకు (భవభవ బంధాలున్నా😉); ఇది వారి గురువుగారి ప్రభావమే నిస్సందేహంగా. తప్పక చర్చకు పెట్టవలసిన విషయం, అందులోనూ సందేహం లేదు. కానీ, (yeah, inevitable bit of poison) మాస్ మార్కెట్ ప్రొడక్ట్ చేయడం కోసం కొంచెం రాజీ పడ్డారు శక్తివంతమైన నవలగా రాయడంలో. పథేర్ పంచాలీ లకు అవార్డులు వస్తాయి గానీ ఎవరు చూస్తారు అనుకున్నారేమో. నిజమే ఐయినా. సినిమా ఫార్మాట్ లో ముందు ఆలోచించి తర్వాత నవలకు తెచ్చారు కాబట్టి ఎక్కువగా స్క్రీన్ ప్లే ఫార్మాట్లో వుంది నవలకన్నా, దీనివల్లే పైన నాకనిపించిన కంప్రోమైజ్ కూడా. మళ్లీ కానీ, ఈ విషయం పుస్తకం అవసరాన్ని ప్రాసంగికతను అస్సలు తగ్గించదు. It is highly relevant and a compelling read. 

విషయానికి వస్తే, పిల్లలు బతికుండి హాయిగా ఏదొకటి నచ్చింది చేయడం ముఖ్యమా వాళ్ళని రుద్ది రుద్ది ఏదో మనమనుకున్నది చెయ్యబోవడం, అందులో కొందరు ఊపిరాడని పిట్టల్లాగా రాలిపోవడం ముఖ్యమా అంటే నాతో సహా బుద్ది వున్న తల్లిదండ్రులు అందరూ మొదటిదే ఎంచుకుంటారని ఒక తప్పుడు నమ్మకమ్ ఒకప్పుడు వుండేది. ఇప్పుడస్సలు లేదు. రకరకాల కారణాలు చెప్పి పీర్ ప్రెషర్ తట్టుకోలేని తల్లిదండ్రులు పిల్లల్ని ఆ ఫ్యాక్టరీల్లోనే చేర్చుతున్నారు. వాళ్ళ కలల్ని పండించాల్సిన బాధ్యత పిల్లల భుజాలమీదే.  ఒకరకంగా మూర్తి ఆర్గుమెంట్ నిజం. 

రాజ్ గారూ, సిరాను సిరాలాంటి అనేక సంస్థలను ఆ ఇంజినీరింగ్ కాలేజీల్లా మూసేస్తే నేనూ చాలా సంతోషపడతాను. కానీ, అది నిజంగా అసలు సమస్యకు పరిష్కారమా!?  నేను అవుననలేను. తల్లిదండ్రులు ముఖ్యంగా మధ్యతరగతి తల్లిదండ్రుల పేరాశలు తుడిచిపెట్టుకుపోవాలి. ఐఐటీలో ఇంజినీరింగ్ విద్య అనే నిచ్చెనతో ఆకాశహర్మ్యాలు కట్టుకుంటున్న వాళ్ళకి అది కాని ఆల్టర్నేటివ్స్ తెలియాలి, వాటిమీద నమ్మకం కలగాలి. మీ పుస్తకంలో కూడా రాసారు ఆ కథలు, అట్లాంటివి ప్రచారంలోకి రావాలి. ముఖ్యంగా ఒక సమాజంగా విజేతని మాత్రమే నెత్తిన పెట్టుకునే సంప్రదాయం మారాలి. నిజమైన ప్రయత్నాన్ని అభినందించే గుణాత్మక మార్పు రావాలి.  అప్పటిదాకా సిరాని పాతిపెడితే అంతకుమించిన విషవృక్షాలు పుట్టుకొస్తాయి. సిరా కేవలం ఒక వ్యాపారసంస్థ. లాభం తప్ప ఇంకో ఆలోచన వాళ్లకు వుండదు, సిరాను ఎదగనిచ్చిన వ్యవస్థ మారాలి 'చైనా'లు, 'కోటా'లు వుండకుండా వుండాలంటే. 

మా యూనివర్సిటీకి కూడా మన పిల్లలూ ఎక్కువగానే వస్తారు. మీరు రాసినట్లుగానే అకాడమిక్ గా గొప్పగా వున్న పిల్లల్లో కూడా సాఫ్టుస్కిల్స్ శూన్యం. వాళ్ళు ఒక గుంపుగా చేరిపోయి ఇంక బయటకు రారు. మిగిలిన వాళ్ళతో కలవరు.  చొరవ వుండదు, కొత్త ఆలోచనకు తొందరగా స్వాగతం చెప్పలేరు. అసలు ప్రశ్నించడం చాలా తక్కువ. Individual గా మంచి performers ఎక్కువమంది. టీంలో కష్టం. ఆటల్లో పెద్దగా కనిపించరు. ఒక ఆన్సర్ స్క్రిప్ట్లో bookish డెఫినిషన్స్ ఉన్నాయంటే తొంభైశాతం మన పిల్లలే. నాతో పాటు నా కలీగ్స్ అందరూ ఈ ట్రెండ్స్ కనీసం రెండు మూడు సెమిస్టర్లకల్లా బ్రేక్ చెయ్యాలని చాలా ప్రయత్నం చేస్తాం. ఇక్కడి పిల్లలకు బుర్రలో శూన్యం వున్నా చొరవ, ప్రశ్నించడం, ఒకళ్ళతో పని చేయించడం, టీం గా పనిచేయడం బాగా తెలుసు. పని తెలివిగా పక్కన వాళ్లమీద వెయ్యడం తెలుసు. ముఖ్యంగా వాళ్ళు చాలా వరకూ ప్లస్ టూ లో కూడా బిజినెస్నే చదివి వస్తారు, మనవాళ్ళు దాదాపుగా 'చైనా'నే. తమిళనాడు, కేరళ, కర్ణాటక పిల్లల్లో మరీ ఇన్ని లక్షణాలు గంపగుత్తగా వుండవు. ముఖ్యంగా కేరళ పిల్లలు తొందరగా లీడర్షిప్ పొసిషన్స్కి వెళ్లగలరు చిన్న గ్రూపుల్లో అయినా. నార్త్ ఇండియన్ పిల్లలు కూడా వాళ్ళని టక్కున ఆక్సిప్ట్ చేసేస్తారు. ఇంత తెలివితేటలున్న మన పిల్లలు చిన్న చిన్న లైఫ్ స్కిల్స్ లేక వెనకపడుతున్నారనే దిగులు తగ్గనివ్వట్లేదు బ్యాచ్ తర్వాత బ్యాచ్. ఇవి వ్యవస్థాగత సమస్యలు. మౌలికమైన మార్పులు రావాలి, కంటితుడుపులు అస్సలు చెల్లవు. ఒక ఆశావహమైన మాట మా మీను అన్నది ఈ పుస్తకం గురించి దానితో మాట్లాడుతుంటే; అట్లాంటి కాలేజీలు పెట్టి ముప్పై ఏళ్ళు దాటాయంటే అందరూ వాటిల్లో చదివిన పేరెంట్స్ పిల్లల్ని అక్కడ చేర్చరేమో అని. నిజమేనా!! ఆ కాలేజీల్లో చదవడం ఆస్పిరేషనల్ విలువగా ఉన్న తల్లిదండ్రుల సంగతేంటీ? వీటికి ఆల్టర్నేటివ్ ఏంటి? చిక్కేమిటంటే, ఈ పుస్తకం చదవడం, ఈ మాత్రం ఆలోచన చెయ్యడం కూడా పిల్లల మీద ముందుగానే కాస్త ఎక్కువ కన్సర్న్ ఉన్న తల్లిదండ్రులే చేస్తారు. ఇది నిజంగా పెద్ద విషవలయం. ఏదేమైనా మీరు చేసింది చాలా అభినందనీయమైన ప్రయత్నం. మెయిన్ స్ట్రీమ్ లో చర్చకి రావలసిన అంశం. 

మీరు సినిమా చేయబోతున్నారు కనుక ఈ ఒక్క మాట రాస్తున్నాను, మనోహరమూర్తి వాచ్యంగా 'మాత్రమే' గొప్ప లాయర్గా కనపడ్డారు. సినిమాలో అట్లా చెప్పడానికి అంత నిడివి దొరకదని మీకు తెలుసు. పైగా, దాదాపుగా మొదటి ఇంటరాక్షన్ నుంచే he was in awe of Ram. ఇద్దర్నీ పోటాపోటీగా నిలబెట్టినప్పుడు రామ్ అతన్ని ఆల్మోస్ట్ తన దైవంగా భావిస్తున్నపుడు అతని బిల్టప్ ఇంకా ప్రత్యక్షంగా వుండాలి. రామ్ ఓడిపోతున్నట్టు కనపడ్డా నిజానికి అన్నిసార్లూ అతనే గెలిచాడన్న ధ్వని అంతర్లీనంగా వుంది. అది కొంచెం దెబ్బ మూర్తి పాత్రకి. రమ్య ఇంకాస్త గట్టిగా వుండొచ్చునండీ, మరీ అంత తెలుగు సినిమా హీరోయిన్ మల్లే వుండక్కరలేదు. నేను అట్లాంటి బ్రిలియంట్ పిల్లల్ని వందలమందిని రోజూ చూస్తున్నాను మరి. వాళ్ళల్లో క్లారిటీనే నాకు నచ్చే మొదటి అంశం 🙂 రామ్ తో సమానస్థాయి లేదా ఇంకాస్త ఎక్కువ బలంతో వీళ్లంతా వుంటేనే కదా అసలు కోర్టురూం డ్రామా మజా పండేది, రామ్ పాత్ర గట్టిగా నిలబడేది. ఇవేవీ మీకు తెలియనివి కావు. 

చివరగా పుస్తకంలో పరిశోధన, రీడబిలిటీ, సహజమైన భాష అమోఘంగా ఉన్నాయి. రెండవ ముద్రణలో ప్రూఫ్రీడింగ్ ఇంకాస్త క్లోస్గా చేయండి. తల్లిదండ్రులూ దయచేసి నిదానంగా చదవండి, ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. 

Raj గారూ, మీ గొప్ప మానవీయమైన ప్రయత్నానికి అనేకానేక అభినందనలు 💐