ప్రేమ చాలా అరిగిపోయిన మాట కదా!!
కానీ ఆ ప్రేమని తలచుకున్నప్పుడు
గుండెలో ఓ చిన్ని సన్నజాజుల చప్పుడు
విని తీరతావేమో,
ఆగి ఎప్పుడైనా చూసుకున్నావా!!!
Infatuation అన్న మాట ఒకటి కూడా గుర్తుండే ఉంటుంది.
చిన్నప్పుడు పుస్తకాల మధ్యన పెట్టుకున్న గులాబీరేకు
పెద్దయ్యేసరికి వాడిపోయినంత సహజంగా పక్కకు వెళ్ళిపోతుంది.
కానీ ఆ పుస్తకం జీవితంలో ఎప్పుడైనా అప్రయత్నంగా తెరిచినరోజు
ఓ సన్నని పరిమళం, ఓ చిన్న చిరునవ్వు,
మరో జ్ఞాపకపు మొలక నీ మొహం మీద వెలగొచ్చు.
జ్ఞాపకం మరపుగా మారితే
ఒక నీకు సంపద తరిగినట్టనిపించవచ్చు,
ఇంకో నీకు అందులో తేడానే తెలియక పోవచ్చు.
సరే,ఒక్కమాట!!!
ఈరోజు నీ జీవనాన్ని వెలిగిస్తున్న మనిషిలోనూ
ఈ జ్ఞాపకాలున్నాయేమో, ఈ మెరుపులున్నాయేమో అన్న భావన
నీ మోముపై ఇంకో చిరునవ్వు పూయించగలిగితే,
ఇంకాస్త నెమ్మది తేగలిగితే
నీలో ప్రేమా, గుండెలో చెమ్మా ఆరిపోనట్లే.
మిగిలిన ప్రతిరోజూ ఉత్సవమే, ఈ ఒక్క రోజేనా!!
No comments:
Post a Comment